భారత్-శ్రీలంక మధ్య ఇవాళ తొలి వన్డే జరగనుంది. శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్ జరగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ ప్రకటన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
మూడు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇవాళ భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆర్ ప్రేమదాస స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే…మ్యాచ్ కు వరుణుడు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రేపు కొలంబోలో వర్షం పడే అవకాశం అధికంగా ఉంది. దీంతో తొలి వన్డే కోసం ఆశగా చూస్తున్న అభిమానుల్లో కలవరం మొదలైంది. ఇటీవల సౌతాంప్టన్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు కూడా వరుణుడు పదేపదే అడ్డుతగిలి ఇబ్బందిపెట్టాడు. ఆ తర్వాత భారత్ ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే.
భారత జట్టులో ఎక్కువ మంది స్టార్ ప్లేయర్స్ లేనప్పటికీ, టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునేందుకు యువ ఆటగాళ్ళు బాగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఓ చక్కని అవకాశం శ్రీలంకతో పర్యటనలో రానుంది. శ్రీలంకతో ఆరు మ్యాచ్‌లు జరగనుండగా.. అందులో మూడు వన్డే మ్యాచ్‌లు, మూడు టీ20 మ్యాచ్‌లు. ఇవాళ జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కాబోతుంది.
ధావన్ కెప్టెన్సీలో కొత్త ఆటగాళ్లతో..సిరీస్ కు సన్నద్ధమైంది టీమీండింయా. దాసున్ షానకా శ్రీలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో బయో-బబుల్ ఉల్లంఘన కారణంగా కుశల్ మెండిస్ మరియు నిరోషన్ డిక్వెల్లాను సస్పెండ్ చేయగా.. మాజీ కెప్టెన్ కుశాల్ పెరెరా గాయం కారణంగా ఆడట్లేదు. దీంతో శ్రీలంక జట్టు బలహీనంగా కనిపిస్తోంది.