తెలుగు రాష్ట్రాల్లో హుజురాబాద్ ఎన్నికలు కాక రేపాయి. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమయి వుంది. అయితే రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ అభ్యర్ధి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధికార పార్టీపై మండిపడ్డారు. ఎన్నిసార్లు సీపీ, కలెక్టర్ కి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్దతిలో అధికార పార్టీ వ్యవహరించింది. డబ్బులు పెట్టి గెలిచే పద్దతి మంచిది కాదు. ఎమ్మెల్యే లు స్వయంగా డబ్బులు పంచి వెళ్లారు. బస్సుల్లో ఈవీఎంలు కూడా మార్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈవీఎం పాడైందని మార్చడం అనుమానాలకు తెర లేపింది. నన్ను ఓడించడానికి కెసిఆర్ అన్ని ప్రయత్నాలు చేశారు. డబ్బులు పంచారు, మందు పంచారు, బెదిరించారు, మభ్యపెట్టారు. చివరికి పోలింగ్ సిబ్బందికి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారన్నారు మీడియా సమావేశంలో ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నీ చేసినా గెలవలేక ఇలాంటి పనులు చేస్తున్నారు. ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తరువాత కూడా .. ఓటు వేసిన బాక్స్ లు కూడా మాయం చేయడం దుర్మార్గం.ఈ విషయంపై ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేస్తున్నాం. హుజురాబాద్ ప్రజల ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుంది. ఇది చారిత్రాత్మక ఘట్టం. కలెక్టర్ పొరపాటు జరిగింది అని చెబుతున్నారు. ఇది మామూలు ఎన్నిక కాదు. ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికలలో ఇంత నిర్లక్ష్యమా ? ఇది చాలా నీచమైనదిగా అనుకుంటున్నారన్నారు ఈటల.