రాష్ట్రవ్యాప్తంగా ఒక నగర పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గంలో ఎన్నిక అగ్నిపరీక్షగా మారింది. తాజాగా హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. కుప్పం నగర పంచాయితీ ఎన్నికల్లో ప్రచారంపై స్థానిక డీఎస్పీ విధించిన ఆంక్షలను తప్పు పట్టింది హైకోర్టు. తన అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఇచ్చిన సర్క్యులర్‌ని కొట్టిపారేసింది హైకోర్ట్.
ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించకూడదని డీఎస్పీ ఆంక్షలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు టీడీపీ నేతలు, ఈ పిటీషన్‌పై వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు… పలు అభ్యంతరాలను కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులను కాల రాస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు పోసాని.
టీడీపీ నేత పులివర్తి నాని, నిమ్మల రామానాయుడు, మునిరత్నం, అమర్నాథ్ రెడ్డి ప్రచారానికి ఆటంకాలు కల్పించవద్దని కోరగా ఆ మేరకు ఏపీ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ప్రచారం చేసుకోవడం పార్టీ నేతల ప్రాథమిక హక్కు అని వాదించారు న్యాయవాది పోసాని. ఇక కుప్పం ఎన్నికల ప్రచారం క్రమంగా వివాదంగా మారుతోంది. కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులను అధికారులు అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కుప్పంలో వున్న ఇతర ప్రాంతాల టీడీపీ నేతలను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ నేతలు నిరసనలకు దిగారు.
ఇదిలా వుంటే.. కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. తనిఖీల పేరుతో టీడీపీ శ్రేణులపై పోలీసులు ఆంక్షలు పెట్టి అడ్డుకుంటున్నారు. ప్రచారానికి సైతం అనుమతులు తీసుకోవాలంటూ ఆంక్షలు పెట్టి టీడీపీ అభ్యర్థులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు.
వైసీపీ ప్రచారానికి మాత్రం ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా పోలీసులే సహాయ సహకారాలు అందిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఎన్నికల సంఘం తమ ఫిర్యాదులపై స్పందించడం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ కంచుకోటలాంటి కుప్పంను ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. నామినేషన్లు వేసిన వారికి బలవంతంగా విత్ డ్రా చేయించారని టీడీపీ ఆరోపించింది. అధికారబలంతో తమ పార్టీ నేతల్ని వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు.