కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా, 12 మంది గల్లంతైనట్టు అధికారులు పేర్కొన్నారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలను కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కేరళలో త్రివిధ దళాలు సేవలు అందిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కరోనా నిబంధనలతో కూడిన పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ఇక భారీ వర్షాలు కురుస్తుండటంతో శబరిమల ఆలయం దర్శనం కోసం భక్తులు రావొద్దని ట్రావెన్‌కోర్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి.