కేటుగాళ్ళు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. డబ్బుల కోసం, బంగారం కోసం ఏ గడ్డితినడానికైనా వెనుకాడడం లేదు. మహిళలు, అమ్మాయిలు, ముక్కుపచ్చలారని పిల్లల్ని కూడా వారు వదలడం లేదు. గుంటూరు జిల్లాలో ఓ మైనర్ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అరెస్ట్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు.
మొత్తం ఇరవై మూడు మంది ముఠాలో ఉన్నారని, పదిమంది నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని అర్బన్ ఎస్పీ వెల్లడించారు. కరోనా సమయంలో జిజిహెచ్ లో చేరిన బాలికకు మాయ మాటలు చెప్పి స్వర్ణ కుమారి తీసుకెళ్ళిందని, ప్రకృతి వైద్యం పేరుతో తీసుకెళ్ళి వ్యభిచారం చేయించిందని విచారణలో తేలింది.
విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరులో వ్యభిచారం చేయించారు. నెల్లూరు నుండి పారిపోయి విజయవాడ వచ్చిన బాలికను పట్టుకొని తిరిగి వ్యభిచారం చేయించారని ఎస్పీ తెలిపారు. అనారోగ్యం బారిన పడటంతో బాలికను వదిలి పెట్టారు. ఈ ముఠాకు సంబంధించి పదమూడు మందిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 12 సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, రూ 1000 నగదు, కారు,ప్రామిసరీ నోట్స్ స్వాధీనం చేసుకున్నారు