(అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి)
భారతీయుల మదిలో అహింసామూర్తిగా గుడికట్టుకున్నారు మహాత్మ గాంధీ. మన దేశానికి సంబంధించిన తొలి డాక్యుమెంటరీస్ లో మహాత్ముడే ఎక్కువగా కనిపించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మహాత్మ గాంధీ చేస్తున్న అహింసా పోరాటాలను నిక్షిప్తం చేయాలని భావించి, ఆ దిశగా డాక్యుమెంటరీలు రూపొందించారు. అలా నిక్షిప్త పరచిన మహాత్ముని దృశ్యాలనే ఈ నాటికీ చూడగలుగుతున్నాం. ముఖ్యంగా దండి వద్ద బాపూజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీపై చిత్రీకరించిన విజువల్స్ ఈ నాటికీ అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసినప్పుడు భారతీయుల మది పులకించిపోతుంది. గాంధీ తెరపై కనిపిస్తే చాలు చప్పట్లు మారుమోగేవి. ఇప్పటికీ అదే తీరు సాగుతూ ఉండడం విశేషం. గాంధీ కన్నుమూసి దాదాపు 74 సంవత్సరాలు అవుతున్నా, ఈ నాటికీ మహాత్ముని తలచుకొని భారతీయులు పులకించిపోవడం గమనార్హం! ప్రతియేటా అక్టోబర్ 2న గాంధీ జయంతిని భారతీయులందరూ ఓ పర్వదినంలా జరుపుకుంటూ ఉంటారు. అనేక పర్యాయాలు బాపూజీ జయంతిన మన సినిమాలు సైతం వెలుగు చూశాయి.
మన తెలుగునాట కూడా గాంధీజీ అంటే విశేషమైన భక్తి చోటు చేసుకుంది. గాంధీజీపై 1941లోనే తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రూపొందింది. హేమలతా ఫిలిమ్స్ పతాకంపై ఎ.కె.చెట్టియార్ దర్శకత్వంలో ‘మహాత్మ గాంధీ’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఇందులో నాటి మేటి నటగాయనీమణులు బెజవాడ రాజరత్నం, పి.కన్నాంబ, టంగుటూరి సూర్యకుమారి నటించారు. ఈ సినిమాకు ముందు 1938లో గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో రూపొందిన ‘మాలపిల్ల’ చిత్రంలో బసవరాజు అప్పారావు గాంధీజీపై రాసిన “కుల్లాయి కట్టితేయేమి మా గాంధి మాలడై తిరిగితే ఏమి…” అనే పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది.
స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కూడా పలు చిత్రాలలో గాంధీ ప్రస్తావనతో పాటలు రూపొందాయి. 1955లో తెరకెక్కిన ‘దొంగరాముడు’లో “భలే తాత మన బాపూజీ… బాలల తాతా బాపూజీ…” పాట కూడా విశేషాదరణ చూరగొంది. ‘బడిపంతులు’లో “భారతమాతకు జేజేలు…” అంటూ సాగే పాటలోనూ “శాంతి దూతగా వెలసిన బాపూ…” అంటూ గాంధీని స్మరించుకోవడం జరిగింది. ‘పవిత్రబంధం’లో “గాంధి పుట్టిన దేశమా… ఇది… నెహ్రు కోరిన సంఘమా ఇది…” అంటూ యువరక్తం ప్రశ్నించేలా ఓ పాట రూపొందింది. ఇక ‘గాంధీ పుట్టిన దేశం’ చిత్రంలోని “గాంధీ పుట్టిన దేశం… రఘురాముడు ఏలిన రాజ్యం…” అంటూ సాగే పాట సైతం ఎంతగానో మురిపించింది. ‘మరో ప్రపంచం’ చిత్రంలో “మహాత్ముడే కలలు కన్న మరో ప్రపంచం…” పాట కూడా ఆదరణ చూరగొంది. గాంధీజీ బోధించిన “చెడు అనవద్దు…చెడు వినవద్దు… చెడు కనవద్దు… ఇది బాపూజీ పిలుపు… ఇదే మేలుకొలుపు…” అంటూ ‘మేలుకొలుపు’ చిత్రంలో మరో పాట ఆకట్టుకుంది. ఇలా ఆ రోజుల్లో అనేక తెలుగు చిత్రాలలో గాంధీజీ పాటలు రూపొందడం విశేషం. ఆ మధ్య వచ్చిన ‘మహాత్మ’ చిత్రంలో “కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ…” పాట సైతం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
ఇక బ్రిటిష్ డైరెక్టర్ రిచర్డ్ అటెన్ బరో తెరకెక్కించిన ‘గాంధీ’ చిత్రం భారతీయ భాషలన్నిటా అనువాదమై అలరించింది. తెలుగునేలపైనా ‘గాంధీ’ చిత్రం మురిపించింది. “మేకింగ్ ఆఫ్ మహాత్మ, సర్దార్, హే రామ్, గాంధీ- మై ఫాదర్, లగే రహో మున్నాభాయ్, మైనే గాంధీ కో నహీ మారా” వంటి చిత్రాలలోనూ, మన తెలుగు సినిమా ‘శంకర్ దాదా జిందాబాద్’లోనూ గాంధీ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ చిత్రాలలో కొన్నిట గాంధీ చుట్టూ కథ సాగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇతర భారతీయ భాషల్లోనూ మహాత్మునిపై రూపొందిన చిత్రాలు బోలెడు కనిపిస్తాయి. ‘కోడలు దిద్దిన కాపురం’లోని “నీ ధర్మం… నీ సంఘం…” పాటలో “స్వతంత్ర భారత రథసారథియై సమరాన దూకే నేతాజీ… సత్యాగ్రహమే సాధనంబుగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ…” అనీ వినిపిస్తుంది. ఇక తమిళ చిత్రం ‘చంద్రోదయం’లో రూపొందిన “బుద్ధన్ ఏసు గాంధి పిరందదు…” పాట తమిళనాట అక్కడి జనాన్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇలా పాటల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ గాంధీజీని భారతీయులు స్మరించుకుంటూనే ఉన్నారు. భవిష్యత్ లోనూ ఆ శాంతిదూతను తలచుకోవలసిన అవసరం ఎంతయినా ఉందని చెప్పవచ్చు.