Chhaava: నాగ్‌పూర్ అల్లర్ల, హింస నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ‘‘ఛావా’’ సినిమాపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్ర తెరపైకి వచ్చిందని, ఇది మొఘల్ పాలకుడు ఔరంగజేబుపై ఆగ్రహాన్ని రేకెత్తించిందని ఆయన అన్నారు. సోమవారం రాత్రి నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడుతూ, ఫడ్నవీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఛావా సినిమాను తాను నిందించాలని అనుకోవడం లేదని, ఛావా ఛత్రపతి శంభాజీ మహారాజ్ చరిత్రను ప్రజల ముందుకు తీసుకువచ్చిందని, దీంతో ప్రజల మనోభావాలు రగిలిపోయాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఔరంగజేబుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, శాంతిభద్రతలను కాపాడుకోవాలని, ప్రతీ ఒక్కరూ ఓపికతో ఉండాలని, ఎవరైనా అల్లర్లు చేస్తే కులం, మతం అనే తేడా లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Read Also: Viral video: ‘‘నన్ను మోసం చేసి, కొత్త భార్యకు ఫోన్ కొంటున్నావా?’’.. వ్యక్తిపై గర్ల్‌ఫ్రెండ్ దాడి..
విక్కీ కౌశల్ లీడ్‌రోల్‌లో లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘‘ఛావా’’ సంచలనం క్రియేట్ చేసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకి, మరాఠా రాజ్యాధినేతకు జరిగిన యుద్ధాలు, వెన్నుపోటును ఈ సినిమాలో చూపించారు. 40 రోజులకు పైగా శంభాజీని హింసించిన సన్నివేశాలు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. ఈ సినిమా తర్వాత నుంచి మహారాష్ట్రలోని ఔరంగబాద్ (ప్రస్తుతం ఛత్రపతి శంభాజీనగర్)లో ఉన్న ఔరంగాజేబు సమాధిని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి.
మహారాష్ట్ర నుండి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ వీహెచ్‌పీ మరియు బజరంగ్ దళ్ నిరసన నిర్వహించిన కొన్ని గంటల తర్వాత హింస చెలరేగింది. మతపరమైన పవిత్ర వ్యాఖ్యలు ఉన్న వస్త్రాన్ని తగులబెట్టారనే పుకార్లు రావడంతో, ముస్లింమూక దాడులకు పాల్పడింది. నిర్దిష్ట వర్గానికి చెందిన ఇళ్లను, వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ముందస్తు ‘‘కుట్ర’’తో చేసిన దాడులుగా అభివర్ణించారు.