మాదకద్రవ్యాలు మన దేశంలోని మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మత్తు పదార్థాలు మానవుల జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో నార్కోటిక్స్ క్రైమ్ రికార్డుల బ్యూరో నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ఆందోళనకరమైన అంశాలు బహిర్గతం అయ్యాయి. 2020లో మాదక ద్రవ్యాల కారణంగా భారత్‌లో ప్రతి గంటకు ఒక ఆత్మహత్య సంభవించిందని నివేదికలో వెల్లడైంది. 2019తో పోల్చితే మన దేశంలో ఇలాంటి మరణాలు 17 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది.
Read Also: రియల్ గజనీ… ప్రతి ఆరు గంటలకోసారి
మాదక ద్రవ్యాల ప్రభావం కారణంగా 2019లో మొత్తం 7,860 మంది ప్రాణాలు కోల్పోగా 2020లో 9వేలకు పైగా మంది ప్రజలు మృతిచెందినట్లు నార్కోటిక్స్ క్రైమ్ రికార్డుల బ్యూరో వెల్లడించింది. ఈ తరహా ఆత్మహత్యల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలలో డ్రగ్స్ కారణంగా చనిపోయిన వారు 43 శాతం మంది ఉన్నారు. అయితే ఈ నివేదికపై పలువురు మానసిక వైద్యులు స్పందించారు. మానసిక సమస్యల కారణంగా బాధపడుతూ కుంగిపోయిన వారిని మాదకద్రవ్యాలు మరింత కుంగదీస్తాయని, ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయని వారు చెప్తున్నారు. ఆర్థిక, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిలో కూడా డ్రగ్స్, మద్యం చాలా వేదనకు గురిచేస్తాయని వారు హెచ్చరించారు.