తెలంగాణలో యథావిధిగా స్కూళ్లు నడపాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సైతం స్కూళ్లు నడపాల్సిందేనని సీఎం చెప్పారని ఆమె పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిద్దామని, కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యా సంస్థల యాజమాన్యాలు అన్నిరకాల కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. కాగా… దేశ వ్యాప్తంగా ప్రస్తుతం… ఒమిక్రాన్ వేరియంట్.. టెన్షన్ ఉన్న సంగతి తెలిసిందే. ఎటు వైపు నుంచి ఈ వైరస్ దాడి చేస్తుందోనని.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు.