తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పతనం ప్రారంభమైందని, కేసీఆర్‌కు ప్రజలు చరమ గీతం పాడుతారని డీకే అరుణ మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. కరోనా నిబంధనలు కేవలం బీజేపీ కు మాత్రమే వర్తిస్తాయా అని, టీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభలు, సమావేశాలు పెట్టినప్పుడు ఏ నిబంధనలు గుర్తు రాలేదా అని డీకే అరుణ పోలీసులను ప్రశ్నించారు. కండువా వేసుకొని టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఎప్పటికీ టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలో ఉండదన్న విషయాన్ని పోలీస్ అధికారులు గుర్తు పెట్టుకుంటే మంచిదని ఆమె అన్నారు. కేసీఆర్ నియంత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ను పాతాళానికి తొక్కెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఈ విషయంపై కరీంనగర్ కమిషనర్ సత్యనారాయనతో డీకే అరుణ మాట్లాడగా.. కరోనా నిబంధనలు అతిక్రమించినందుకు బండి సంజయ్ పై కేసులు నమోదు చేశామని చెప్పడంతో, కేవలం బీజేపీ కు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా అని డీకే అరుణ కమిషనర్ ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఇంకా ఎంత మంది నాయకులను అరెస్ట్ చేస్తారో చేయండని, అరెస్టులు కేసులతో భయపడే ప్రసక్తే లేదని, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని డీకే అరుణ తెలియజేశారు. అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపినంత మాత్రాన ప్రజల కోసం తమ పోరాటం ఆగదని డీకే అరుణ స్పష్టం చేశారు.