భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగపు అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ, ఎప్పటికప్పుడు అడ్డంకులు వస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుతులు వస్తే ప్రపంచ వ్యాప్తంగా కోవాగ్జిన్ వాడటానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో అమోదించిన వ్యాక్సిన్లు తీసుకున్నవారికి మాత్రమే విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో, కోవాగ్జిన్ తీసుకున్న భారతీయులు విదేశాలకు ప్రయాణించాలంటే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
నవంబర్ 3న అత్యవసర వినియోగపు అనుమతుల గురించి డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక సలహా గ్రూప్ మళ్లీ సమావేశం జరుగనుంది.
భారత్‌లో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఎక్కువగా వినియోగించారు. ఎమర్జెన్సీ లిస్టింగ్ లో చోటు దక్కించుకున్న వ్యాక్సిన్లను డబ్ల్యూహెచ్‌వో కొనుగోలు చేసి.. పేద దేశాలకు సరఫరా చేస్తుంటుంది. ఈయూఎల్‌లో.. ప్రస్తుతం కోవాగ్జిన్‌కు చోటు దక్కలేదు. దీనికోసం భారత్ బయోటెక్ యాజమాన్యం తన వంతు ప్రయత్నాలను చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన కోవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి క్లినికల్ డేటా, రీసెర్చ్ డాక్యుమెంట్లు, ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందజేసింది. డాక్యుమెంట్లను పరిశీలించిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ సమాచారం అసమగ్రంగా ఉందని తెలిపింది. రిస్క్-బెనిఫిట్ అసెస్‌మెంట్‌కు సంబంధించిన సమాచారం మరింత కావాలని పేర్కొంది. తాజాగా, 24 గంటల్లోగా కోవాగ్జిన్‌కు అనుమతి లభించే అవకాశం ఉందంటూ డబ్ల్యూహెచ్‌వో అధికారులు సూచనప్రాయంగా తెలిపినా.. మరోసారి తాత్కాలికంగా బ్రేక్ పడింది.