మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ విషయంలో బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులపై దళిత సంఘాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. 1994లో దళిత ఐఏఎస్ అధికారి అయిన గోపాల్‌గంజ్ జిల్లా మాజీ మేజిస్ట్రేట్ జి కృష్ణయ్యను హత్య చేసిన కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ మంగళవారం జైలు నుంచి విడుదలైయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హత్య కేసులో సుప్రీంకోర్టులో కూడా ఆనంద్ మోహన్‌కు ఉపశమనం లభించలేదు. అయితే బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం ఆయనతో పాటు మరో 27 మందిని జైలు నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది.
Also Read:Drunkard: పెళ్లి చేసుకునేందుకు పిల్ల దొరకట్లేదు.. బట్టలు విప్పి హల్ చల్
గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న కృష్ణయ్య 1994 డిసెంబర్ 5న నడిరోడ్డుపై హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఆనంద్‌కు జీవిత ఖైదు పడింది. తొలుత ఈ కేసులో కింది కోర్టు ఆనంద్‌కు మరణశిక్ష విధించింది. అయితే ఈ శిక్షను పాట్నా హైకోర్టు జీవిత ఖైదుగా కుదించింది. పాట్నా హైకోర్టు తీర్పు తర్వాత ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ, అతనికి ఎలాంటి ఉపశమనం లభించలేదు. అయితే, నితీష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి కూడా ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలన్న బీహార్ ప్రభుత్వ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జైలు మాన్యువల్‌లో సవరణలను ఆరోపిస్తూ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌తో పాటు మరో 26 మందిని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ భారత్ ఏక్తా మిషన్ బీహార్ ఇన్‌చార్జి అమర్ జ్యోతి బుధవారం పాట్నా హైకోర్టును ఆశ్రయించారు. అమర్ జ్యోతి తన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ద్వారా నితీష్ కుమార్ ప్రభుత్వం రాష్ట్ర జైలు మాన్యువల్‌ను నేరస్థులకు అనుకూలంగా మార్చిందని ఆరోపించారు. బీహార్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హత్యకు గురైన దళిత ఐఏఎస్ అధికారి భార్య ఉమా కృష్ణయ్య కోరారు. బీహార్‌లో కుల రాజకీయాలు అటువంటి నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇది చూపిస్తుందన్నారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్‌పుత్ ఓట్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆమె ఆరోపించారు.
Also Read:AIADMK-BJP Meeting: ఏఐఏడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు.. 2024 ఎన్నికలపై చర్చ!
గ్యాంగ్‌స్టర్ ఛోటాన్ శుక్లా అంత్యక్రియల సందర్భంగా కృష్ణయ్య కారుపై దాడి జరగడంతో ఆయన మరణించాడు. ఆనంద్ మోహన్ ఊరేగింపులో భాగంగా ఉన్నాడు. ఆనంద్ మోహన్ మద్దతుదారులను నేరం చేయడానికి రెచ్చగొట్టినందుకు ముజఫర్‌పూర్ పోలీసులు ఆయనపై ఛార్జిషీట్ వేశారు.