అగ్రరాజ్యం అమెరికా కోవిడ్ మహమ్మారి బారిన పడి గజగజా వణుకుతోంది. రోజూ వారి కేసుల సంఖ్య పదకొండు లక్షలకు చేరడంతో.. నివారించే మార్గం కానరాక అమెరికా తల్లడిల్లుతోంది. రోజు లక్షన్నర మందికి పైగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తుండడంతో.. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆరోగ్యరంగం సతమతమవుతోంది. రోజువారీ కొత్త కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బైడెన్ ప్రభుత్వం ఆర్మీ వైద్య సిబ్బందిని సైతం రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. వారంలో 30 శాతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. సీడీసీ డేటా ప్రకారం అమెరికాలో రోజుకు 8లక్షల కేసులు నమోదవుతున్నాయి. రోజూ 1800 మంది మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఏ వారానికి ఆ వారం కేసుల తీవ్రత పెరగడం ఆందోళనకు కారణం అవుతోంది.
ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతితో ప్రపంచ దేశాలు కొత్త వేవ్‌లను చవిచూస్తున్నాయి. ఒకేరోజు లక్షన్నర మంది కొవిడ్ బాధితులు ఆస్పత్రిలో చేరాల్సి రావడం అక్కడి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచిస్తోన్న నిపుణులు.. పాజిటివ్ కేసులే రేపటి ఆస్పత్రి చేరికలకు సంకేతాలంటూ అప్రమత్తం చేస్తున్నారు. ఆస్పత్రి చేరికల పెరుగుదల ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో అమెరికా ఆస్పత్రులకు చీకటి రోజులు రానున్నాయంటూ హెచ్చరిస్తున్నారు.
అమెరికాలో నమోదవుతోన్న కేసుల్లో 98 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నట్లు అక్కడి వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం చెబుతోంది. ఇదివరకే వైరస్ బారినపడడం.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తాజా వేరియంట్‌తో స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారితోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఆందోళనకరమేనంటున్నారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయేందుకు సిద్ధంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరిల్యాండ్‌కు చెందిన ప్రొఫెసర్ ఇటీవలే హెచ్చరించారు. కొవిడ్ రోగుల తాకిడితో అమెరికా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది తీవ్ర కొరత ఏర్పడుతోంది.
డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ పైచేయి సాధించినట్లు సీడీసీ నివేదికలు నిర్ధారిస్తున్నాయి. చాలా నగరాల్లో గతంలో కంటే ఎక్కువగా కొవిడ్ కేసులు రికార్డు కావడంతో పాటు ఆస్పత్రి చేరికలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఇతర సర్జరీలను వాయిదా వేయడమో లేదా సిబ్బందిని సర్దుబాటు చేయడమో చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. స్థానిక ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు కొవిడ్ నిబంధనలను సరళతరం చేసేలా మరికొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటించాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేరిల్యాండ్ హాస్పిటల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఒమిక్రాన్ రాబోయే రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చడం ఖాయంగా కనిపిస్తోంది.