పంజాబ్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయకముందు ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నప్పటికీ అవి పెద్దగా బయటకు రాలేదు. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ రాజీనామా చేశారో అప్పటి నుంచి అంతర్గత కలహాలు బగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సిద్ధూ ఆ పదవికి రాజీనామా చేయడంతో మరో డ్రామా నడిచింది. కొత్త ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు నచ్చడం లేదని, తాన రాజీనామా విషయంలో పునరాలోచన లేదని చెప్పిన సిద్ధూ, ఆ తరువాత మనసు మార్చుకున్నారు. దీంతో పంజాబ్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానికి సీనియర్లు ఒకసారి లేఖ రాశారు. ఇప్పుడు జీ 23 పేరుతో సీనియర్లు మరోసారి లేఖ రాశారు. వివిధ రాష్ట్రాల్లో ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించడానికి వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ సైతం కాంగ్రెస్ నిర్ణయాలపై విమర్శలు చేశారు. జీ 23 అంటే జీ హుజూర్ 23 కాదని, కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండా నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. త్వరలోనే సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
Read: అక్టోబర్ 1, శుక్రవారం దినఫలాలు