ఏపీలో పురపోరు ముగిసింది. నెల్లూరు కార్పోరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 36 సర్పంచ్‌లకు, 68 పంచాయతీ వార్డు మెంబర్ స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పుల్లయ్యగూడెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
విశాఖపట్నం కొయ్యూరు మండలం బాలవరం సర్పంచ్ గా 96 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి అప్పలనర్సమ్మ గెలుపొందారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కంది కాపుల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో 157 ఓట్లు మెజారిటీతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి చెందిన కురువ శివరామయ్య విజయం సాధించారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగాట్లగూడెంలో సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీ బలపర్చిన వామిశెట్టి పావని 925 ఓట్లతో గెలుపొందారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివాపురం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి సుబ్బమ్మ 442 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కంచిముద్రం సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గంగ లక్ష్మి 625 మెజార్టీతో గెలుపొందారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.