మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇప్పుడు హీట్ పెంచుతున్నాయి.. ప్యానల్స్ మాత్రమే కాదు.. సింగిల్‌గా కూడా తాము బరిలోకి దిగుతాం అంటున్నారు సినీ సెలబ్రిటీలు.. ఈ మధ్యే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు వచ్చిన బండ్ల గణేష్.. తాను స్వతంత్ర అభ్యర్థిగా జీవితారాజశేఖర్‌పై పోటీచేస్తానని ప్రకటించడం చర్చగా మారింది. ఇక, వ్యక్తిగత విమర్శలు.. వాటికి జీవిత కౌంటర్ ఇవ్వడంతో మా ఎన్నికల ఎపిసోడ్ రసకందాయంగా మారిపోయింది. ఇప్పుడు బీజేపీ నేత, సీనియర్ నటుడు బాబు మోహన్.. మా ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన బాబు మోహన్.. మా ఎన్నికల వివాదంపై స్పందించారు.. అసలు నోటిఫికేషన్ రాకుండా, ఇప్పుడున్న వారి పీరియడ్ కంప్లీట్ కాకుండా.. కొందరు ఎన్నికలు అని కళామ్మతల్లిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇక, నన్ను పోటీ చేయమని కొందరు పెద్దలు అడుగుతున్నారన్న బాబు మోహన్.. దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు.. మా ఎన్నికలపై ఇంతటి ఆతృత అవసరం లేదన్నారు బాబు మోహన్.. చిత్ర పరిశ్రమ పరిస్థితి క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. డబ్బుల్లేక ఇప్పటివరకు ‘మా’ కార్యాలయాన్ని కట్టలేదని.. కానీ, మా ఆఫీస్ కట్టడం కోసమే ఎన్నికలు అని చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న అసోసియేషన్ చాలా బాగా పనిచేస్తోందని ప్రశంసలు కురిపించిన బాబు మోహన్.. మా లో జరిగే పరిణామాలతో చాలా ఆవేదన చెందుతున్నట్టు తెలిపారు.