తన ఫాం హౌస్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పదే పదే తన ఫాం హౌజ్‌ను దున్నుతా అంటున్నావ్.. నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్‌వా? అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. చట్టం ప్రకారం కొన్న తన ఫాం హౌజ్ ముందు అడుగు పెడితే ఆరు ముక్కలవుతావని హెచ్చరించారు. అయినా తనది ఫాం హౌస్ కాదని.. ఫార్మర్ హౌస్ అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను వ్యవసాయం చేసే కుటుంబంలో పుట్టానని.. తాను ఫార్మర్ను అని.. అందుకే అక్కడ ఇల్లు కట్టుకున్నట్లు కేసీఆర్ వివరించారు.
Read Also: ప్రజల పక్షాన మాట్లాడితే దేశద్రోహి ముద్ర వేస్తారా?: కేసీఆర్
తనకు మనీలాండరింగులు, దొంగ వ్యాపారాలు లేవని.. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం కట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో తమదే కాకుండా తమ అత్తగారికి చెందిన వేల ఎకరాల భూమి పోయిందని కేసీఆర్ తెలిపారు. అప్పర్ మానేరు, మిడ్ మానేరు ప్రాజెక్టుల్లో తమ ఊరే మునిగిపోయిందని కేసీఆర్ అన్నారు. వ్యవసాయం చేసుకుని బతకడం తప్పా అని కేసీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ఓ జాగా అమ్ముకున్నానని కేసీఆర్ వెల్లడించారు. వచ్చిన డబ్బులో రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నానని.. తన హద్దులు చెప్పడానికి బండి సంజయ్ ఎవరని కేసీఆర్ నిలదీశారు. తాము తెలంగాణ ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఏ పాత్ర ఇచ్చినా తాము పనిచేస్తామని.. అధికారం శాశ్వతం కాదన్నారు.