ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై అమలు చేయాలని కోరుతూ నిరసనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సీఎస్ సమీర్ శర్మ 14.29 ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ నివేదికను సీఎం జగన్‌కు అందజేశారు. అయితే సీఎస్ నివేదిక తమకు వ్యతిరేకంగా ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టడంతో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌లు పలుమార్లు ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై చర్చలు జరిపారు.
ఆ చర్చలు ఫలించకపోవడంతో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌తో భేటీ కావడానికి ఎదురుచూస్తున్నాయి. అయితే ఈనేపథ్యంలో సీఎం జగన్ నేడు సీఎస్ సమీర్ శర్మతో పాటు ముఖ్య కార్యదర్శులతో పీఆర్సీపై కీలక సమీక్ష చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ సమీక్ష అనంతరం పీఆర్సీపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.