ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి సీఎం జగన్ శుభవార్త అందించారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని అసెంబ్లీలో ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఆరోగ్య రంగం అభివృద్ధిపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వమని.. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నామని జగన్ వెల్లడించారు.
Read Also: నిన్న వరుడు అలా.. నేడు వధువు ఇలా…
ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో 130 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపచేశామన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 2,446 చికిత్సలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రూ.10 లక్షల ఆపరేషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. కరోనా వైరస్‌కు రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని… కరోనాపై యుద్ధంలో 31 సార్లు ఇంటింటి సర్వే నిర్వహించామని తెలిపారు. కరోనా వల్ల అనాథలుగా మారిన పిల్లల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన తొలి ప్రభుత్వం మనదని అసెంబ్లీలో జగన్ చెప్పారు.