తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ జోష్ మీద ఉంది. దీంతో భవిష్యత్ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. ఇదే అంశంపై చర్చించేందుకు డీకే అరుణ నివాసంలో బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు శనివారం రాత్రి రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఇటీవల విజయం సాధించిన ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్‌రావు, రాజాసింగ్, జితేందర్‌రెడ్డి, వివేక్ హాజరైనట్లు సమాచారం.
Read Also: మంత్రి కేటీఆర్‌కు బండ్ల గణేష్ ట్వీట్.. ఇంతకీ అందులో ఏముంది?
డీకే అరుణ తమ పార్టీ నేతలకు మర్యాదపూర్వకంగా విందు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ… పార్టీ బలోపేతం, భవిష్యత్ ఎజెండాపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ సమావేశంలో బీజేపీ నేతలందరూ కలిసి టీఆర్ఎస్ను ఎదుర్కోవడం ఎలా అన్న అంశంతో పాటు నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను రూపుమాపి, అందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్, ఇతర పార్టీ నేతల చేరికలపైనా చర్చించినట్లు సమాచారం. కాగా ఈ నెల 16న హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. కానీ ఇంతలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో నిరుద్యోగ మిలియన్ మార్చ్‌ను వాయిదా వేయక తప్పలేదు. ఈ కార్యక్రమాన్ని తిరిగి డిసెంబర్ మూడో వారంలో నిర్వహించాలని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం.