ఏపీ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు సతీమణి, తన సోదరి భువనేశ్వరిపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుబట్టారు. భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఇవాళ జరిగిన ఘటనతో తన మనసు నిజంగా గాయపడిందని తెలిపారు. అక్కాచెల్లెళ్లుగా తామిద్దరం ఎన్నో విలువలతో పెరిగామని పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో వైసీపీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేమని పురంధేశ్వరి స్పష్టం చేశారు.
Read Also: పదవి కోసం అద్భుతంగా నటిస్తున్నావు చంద్రబాబు : వల్లభనేని వంశీ
మరోవైపు బీజేపీ నేత సుజనాచౌదరి కూడా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏపీలో రాజకీయాలు ఇంత అథమస్థాయికి పడిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఇన్నాళ్లు వ్యక్తిగత దూషణలు జుగుప్స కలిగించాయనుకుంటే, ఈరోజు చంద్రబాబు అర్ధాంగిని అసభ్యంగా దూషించడం ద్వారా వైసీపీ రాష్ట్ర రాజకీయాలను నీచాతినీచ స్థాయికి దిగజార్చిందని విమర్శించారు. ఇది సిగ్గుచేటు అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.