ఈ ప్రభుత్వాన్ని బెదిరించినా, ప్రశ్నించినా మార్పు రాదు.. గద్దె దించడమే ఏకైక పరిష్కారం అంటూ.. కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు బీజేపీ నేత మురళీధర్‌రావు.. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ పాలు పంచుకుందని.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహకారం ఉందని.. కానీ, గత ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింది… ఉద్యమాల మీద లాఠీ దెబ్బలు పెరిగాయి… అధికార పార్టీ అంతర్గత ప్రజా స్వామ్యాన్ని కుటుంబం దగ్గర కుదువ పెట్టిందని వ్యాఖ్యానించారు. యువకులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఓయూ లాంటి వర్సిటీల్లో 80 శాతం ఫ్యాకల్టీ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయన్న మురళీధర్‌రావు.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో డప్పు, డబ్బా కొట్టుకోవడం తప్ప చేసింది ఏమి లేదు… నష్ట పోయింది దళితులే అన్నారు మురళీధర్‌రావు.. 2019 నాటికి 2 లక్షల 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి.. ఈ రోజుకి 30 వేలు మాత్రమే అయ్యాయన్న ఆయన.. అవినీతికి పర్యాయ పదం తెలంగాణ ప్రభుత్వం… ఈ ప్రభుత్వాన్ని బెదిరించినా, ప్రశ్నించిన మార్పు రాదని.. గద్దె దించడమే పరిష్కారం అని పిలుపునిచ్చారు. ఇక, తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం.. మిగతా పార్టీలు టీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీలని ఆరోపించారు మురళీధర్‌రావు.. మార్పు కోసం బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. చేపడుతున్నారని తెలిపారు. మరోవైపు.. తాలిబాన్ మద్దతుదారులు, రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్నారని విమర్శించిన ఆయన.. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ వారితో కుడి ఎడమ భుజంగా రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.