ఎన్నికలంటే సహజంగానే ప్రచారం హోరెత్తెత్తుంది. ఇంటింటికి తిరిగి ఓటడుగుతారు. హామీల వర్షం కురిపిస్తారు. ఒటర్లను ఆకట్టుకుంటారు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు యుద్దాన్ని తలపిస్తున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోరు రసకందామంలో పడింది. అభ్యర్థులే కాదు వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరో వైపు నియోజకవర్గంలో మద్యం ఏరులైపారుతోంది. డబ్బులు కూడా గట్టిగానే ముట్టచెపుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎప్పుడో కానీ ఇలాంటి ఎన్నికలను మనం చూడలేం అంటున్నారు హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు.
ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ లో ఎలక్షన్ కోడ్‌ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంటో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది. దాంతో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే నియోజకవర్గంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎవరినీ వదలకుండా చెక్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో హుజూరాబాద్ నిఘా నీడలో ఉంది. అణువణువూ జల్లెడ పడుతున్నారు. కార్లు, బస్సులు, బైక్‌లు ..దేన్నీ వదలట్లేదు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి పంపిస్తున్నారు.
హుజురాబాద్లో ముక్కోణ పోరు నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ ప్రధానంగా బరిలో ఉన్నాయి.ఐతే, టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ , బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్యనే టఫ్‌ఫైట్ ఉంటుందని అంచనా. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చూపిన స్థాయిలో ప్రభావం చూపుతారా అన్నది ప్రశ్న. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఒట్లు పోలయ్యాయి. ఏదేమైనా ముగ్గురు అభ్యర్థులు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. వ్యూహాలకు పదును పెట్టి అమలు చేస్తున్నారు.
ఈ ఉప ఎన్నికల్లో అభ్యర్థులతో పాటు వారు కుటుంబ సభ్యులు ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వారి భార్య, పిల్లలు, తల్లులు ఉత్సాహంగా నియెజకవర్గం మొత్తం కలియతిరుగుతూ ఓట్లడుగుతున్నారు. ఈటల రాజేందర్ భార్య జమున ఈ విషయంలో అందరి కన్నా ముందున్నారు. చాలా రోజులుగా ఆమె హుజూరాబాద్‌లో మకాం వేసి భర్తకు అండదండగా ఉన్నారు. హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులని, డబ్బుకు అమ్ముడు పోయే రకం కాదని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారామె. హుజూరాబాద్‌కు వస్తున్న ప్రతీ పథకం ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే అంటున్నారామె. తమ్ముడు తమ్ముడు అని కేసీఆర్ తడిగుడ్డతో గొంతుకోశారంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు మిసెస్ జమునా రాజేందర్.
టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ భార్య శ్వేత కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన భర్తను గెలిపించాలని ఇంటింటికి తిరిగి ఓటడుగుతున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం 20 ఏళ్లు పోరాడిన తన భర్త ఏనాడూ ఏ పదవీ ఆశించలేదని, ఈ పేదింటి ఉద్యమకారుడిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారామె. ఆయనకు నిజాయితీగా పనిచేయడమే తెలుసని. అందుకే.. సీఎం ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారని ఓటర్లకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారామె.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించిన బల్మూరి వెంకట్ తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారబరిలో దిగనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించటంలో అలస్యం కావటంతో ప్రచారంలో కాంగ్రెస్ కాస్త వెనకబడింది. రెండు మూడు రోజుల తరువాత బల్మూరి పద్మ ప్రచారంలో పాల్గొననున్నారు. నిరుద్యోగ అంశాన్ని ఆమె తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రతీ తల్లికి తండ్రికి తెలిసేలా అందరినీ ఏకం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళతా అంటున్నారామో. తన కొడుకు గెలుపుకు తన వంతు కృషి చేస్తానంటున్నారామె.
ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ జంప్ జిలానీలకు గిరాకీ పెరిగింది. రాత్రికి రాత్రే కండువా మారుస్తున్నారు. ఇక హామీల పేరుతో కుల సంఘాలకు గాలం వేస్తున్నారు. మొత్తం మీద బేరసారాలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎప్పుడు ప్రత్యర్థి శిభిరంలోకి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. దాంతో ప్రధాన పార్టీల అభర్థులు తలలు పట్టుకుంటున్నారు. నేతలను కాపాడుకునేందుకు గ్రామాలకు పరుగులు పెడుతున్నారు.కీలక నాయకులను కలిసి పార్టీ వీడొద్దంటూ బతిమిలాడుకుంటున్నారు. గ్రామాలలో బలంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఏ ఊర్లో ఎవరికి పలుకుబడి ఉంది…ఎన్ని ఓట్లు పడతాయి అని లెక్కలు చూసుకుని తాయిలాలు అందించే కార్యక్రమం నడుస్తోంది. అలాగే ఆయా గ్రామాలలో ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి..ఆ కులంలో ఎవరి మాటకు విలువ వుంది..ఎవరు చెపితే ఓట్లు పడతాయన్న ఈక్వేషన్స్‌తో ప్రధాన పార్టీలు ముందుకుసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో నగదు పంపిణీ కూడా గట్టిగానే ఉందని టాక్. పోలింగ్‌కు ఇంకా 20 రోజుల పైనే ఉంది. అప్పటి వరకు ఇంకెన్ని సిత్రాలు జరుగుతాయో ఏమో!!