తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సవాళ్ల పర్వం మొదలైంది… ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో మంత్రి కేటీఆర్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.. నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని బహిరంగ సవాల్ విసిరారు.. అయితే, కేటీఆర్ సవాల్‌కు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని ఎదురుదాడికి దిగారు.. కేసీఆర్ వస్తే ఇద్దరు మోడీ దగ్గరకు వెళ్లి రాజీనామా చేస్తాం అన్నారు. కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారు.. కేసీఆరే రాజీనామా చేయాలన్నారు. పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుంది.. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడినట్లు లీకులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు.
సకల జనులు సమ్మె వలన వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి కుటుంబం కోట్ల రూపాయలు సంపాదించిందని ఆరోపించారు బండి సంజయ్.. కొత్త సెక్రటరేరియట్ నిర్మాణం పూర్తి అయ్యే సరికి ఈ ప్రభుత్వం ఉండదంటూ సెటైర్లు వేసిన ఆయన.. సచివాలయానికి వెళ్లని వాడికి కొత్తది ఎందుకు? అని ప్రశ్నించారు.. ఇక, ఉద్యోగి చనిపోయిన తర్వాత.. పదవి విరమణ తర్వాత పీఆర్సీ ఇస్తారా? దేశంలో ఎక్కడైనా ఉందా? అంటూ ప్రశ్నించిన ఆయన.. ముఖ్యమంత్రి దిగ జారి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. ఆర్టీసీ విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించాలని సూచించిన బండి.. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఎందుకు వాయిదా వేయించారు? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి? కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు? అంటూ నిలదీశారు బండి సంజయ్ కుమార్.