నందమూరి, అల్లు కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉందని శనివారం రాత్రి జరిగిన అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. అల్లు రామలింగయ్య గారు, అల్లు అరవింద్ గారితో తనకు చనువు ఉందని… తన తండ్రి ఎన్టీఆర్ గారికి అల్లు రామలింగయ్య గారు ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు. అఖండ మూవీ విషయానికి వస్తే .. నవ పూజ విధానాల సమాహారమే ఈ సినిమా అని పేర్కొన్నారు. భక్తిని ఈ సినిమా బ్రతికించిందని బాలయ్య పేర్కొన్నారు. ఇక ముందు వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తానని… నటన అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడమని బాలయ్య తెలిపారు. తనకు అల్లు అర్జున్, శ్రీకాంత్ తమ్ముళ్ల లాంటి వాళ్లని బాలయ్య చెప్పారు.
మరోవైపు కరోనా సమయంలో కొంతమంది ప్రాణాలకు తెగించి షూటింగులు జరిపారని… వాళ్లు ఏం చేసినా సినిమా కోసమే చేశారని బాలయ్య వ్యాఖ్యానించారు. కష్టకాలంలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని బాలయ్య కోరారు. రానున్న కాలంలో పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయని… తమ్ముడు నటించిన పుష్ప, ఎన్టీఆర్ నటించిన ఆర్.ఆర్.ఆర్, చిరంజీవి గారు నటించిన ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్నాయని… ఈ సినిమాలు మంచిగా ఆడేలా ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నానని బాలయ్య ఆకాంక్షించారు. ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. నందమూరి అభిమానులు ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తారని.. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అభిమానులను చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందని బాలయ్య అన్నారు.