ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీలోని జగన్ ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోలను సోమవారం నాడు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే… ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులను తమ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగుచర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో ఫీజులను నిర్ణయిస్తూ జీవో నంబర్ 53, జీవో నంబర్ 54ను ప్రభుత్వం జారీ చేసింది.
Read Also: ఏపీ సర్కార్‌తో చర్చల దిశగా సినీ ప్రముఖులు
అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌లను సోమవారం నాడు విచారించిన హైకోర్టు… ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు, చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చారని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ స్కూలు, జూనియర్ కాలేజీ అభిప్రాయాలను తీసుకున్నాకే ఫీజులు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో ప్రైవేట్ విద్యాసంస్థల తరపున న్యాయవాది ముతుకుమల్లి శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు.