ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆగస్టు 15 వ తేదీన తాలిబన్లు కాబూల్‌ను ఆక్రమించుకున్నారు. తాలిబన్లు కాబూల్ ను ఎలా ఆక్రమించుకున్నారు అనే విషయంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ కీలక సమాచారం అందించారు. ఆగస్టు 15 వ తేదీన పోలీస్ చీఫ్ తనకు ఫోన్ చేశారని, జైల్లో యుద్ధఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారని, అణిచివేతకు సహాయం కావాలని కోరారని, అయితే, రక్షణ మంత్రి, హోమ్ మంత్రికి ఫోన్ చేసినా లాభం లేకపోయిందని, వారు స్పందించలేదని తెలిపారు. రాష్ట్రపతి భవన్‌కు ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. కాబూల్ నగరంలో ఎక్కడా పోలీసులు లేరని, కనీసం కమాండోలనైనా పంపించాలని పోలీస్ ఛీప్ కోరినట్టు ఆయన తెలిపారు. కానీ, తాను ఎవరికి ఫోన్ చేసినా లాభం లేకుండా పోయిందని, అప్పటికే సమయం మించిపోవడంతో తాను, కాబూల్ వదలి పంజ్‌షీర్‌కు వెళ్లినట్టు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాలిబన్లకు లొంగిపోయేది లేదని, ఒకవేళ పోరాటంలో తాను గాయపడితే తనను రెండుసార్లు తలపై కాల్చి చంపాలని తన సహచరులకు తెలిపినట్టు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు.