America: అగ్రరాజ్యం అమెరికాలో మొత్తం 582 స్టార్టప్ కంపెనీలు ఉండగా అందులో సగానికి పైగా అంటే 319 సంస్థల వ్యవస్థాపకుల్లో కనీసం ఒక్కరైనా ఇతర దేశాల వాళ్లు ఉన్నారు. అందులోనూ ఇండియన్లే ఎక్కువ మంది ఉండటం విశేషం. మనోళ్లు అత్యధికంగా 66 కంపెనీలకు ఫౌండర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం యూనికార్న్‌ల విలువ ఒక బిలియన్ డాలర్లకు పైగానే ఉండటం గమనార్హం. ఇండియా తర్వాత ఎక్కువగా ఇజ్రాయెల్‌వాళ్లు ఎంట్రప్రెన్యూర్లుగా సత్తా చాటుతున్నారు. వీళ్ల సంఖ్య 54. ఇక ఈ లిస్టులో ఉన్న విదేశీయుల వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రిటన్ (27), కెనడా (22), చైనా (21), ఫ్రాన్స్ (18), జర్మనీ (15), రష్యా (11), ఉక్రెయిన్ (10), ఇరాన్ (8). ఈ వివరాలను నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్‌ఎఫ్‌ఏసీ) రిపోర్ట్ వెల్లడించింది. యూఎస్‌లో కనీసం 10 మంది వేరే దేశాల వాళ్లు మినిమం రెండు, మూడు స్టార్టప్‌లను ప్రారంభించటం చెప్పుకోదగ్గ విషయం. వీళ్లలోనూ నలుగురు ఇండియన్లే ఉన్నారు. సీబీ ఇన్‌సైట్స్ అనే పరిశోధన సంస్థ అందించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఎన్‌ఎఫ్‌ఏసీ ఈ జాబితాను రూపొందించింది. ఫారనర్లు ఫౌండర్లుగా ఉన్న అమెరికాలోని యూనికార్న్‌లు ఒక్కొక్కటి సగటున 859 మందికి ఉద్యోగాలిచ్చాయి.
read also: World Record Doctor: ఒక్క రూపాయి వైద్యుడిగా వరల్డ్ రికార్డు సృష్టించి.. నిన్న ఈ లోకాన్నే వదిలి..
ఈ 319 అంకుర సంస్థల వ్యాల్యూ 1.2 ట్రిలియన్ డాలర్లు. ఇది ప్రధాన దేశాల్లోని ప్రధాన స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీలన్నింటి విలువ కన్నా కూడా ఎక్కువ. దీంతోపాటు మరో 133 సంస్థల్లో విదేశీయులు టాప్ లీడర్‌షిప్ పొజిషన్లలో ఉన్నారు. సీఈఓ, సీటీఓ, వీపీ ఆఫ్ ఇంజనీరింగ్ తదితర పోస్టుల్లో పనిచేస్తున్నారు. దీన్నిబట్టి.. మొత్తం 582 స్టార్టప్స్‌లో 78 శాతం అంటే 451 స్టార్టప్స్ ఇతర దేశాలవాళ్ల చేతుల్లోనే ఉన్నట్లు చెప్పొచ్చు. ఒక సంస్థను సరిగ్గా నడపాలన్నా, అభివృద్ధి బాటలో కొనసాగించాలన్నా ఈ పదవుల్లో ఉన్నవాళ్ల సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది.
కొత్త కంపెనీ పెట్టడం, నిధులు సమీకరించటం తేలికే గానీ ఆ వ్యాపారాన్ని విజయవంతం చేయటం మాత్రం కష్టమని చాలా మంది ఎంట్రప్రెన్యూర్లు చెబుతుంటారు. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లేందుకు కావాల్సిన గ్రీన్ కార్డుల కోటా తక్కువగా ఉండటంతో చాలా మంది సుదీర్ఘకాలంగా వెయిటింగ్ లిస్టులో ఉన్నారని కాంగ్రెసనల్ రీసెర్చ్ సర్వీస్ పేర్కొంది. ఈ వేచి ఉండేవారి సంఖ్య 2030 నాటికి 20 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది.
ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్‌తోపాటు అగ్రరాజ్యంలో బిజినెస్‌ని సైతం ప్రారంభించేందుకు వీలు కల్పించే హెచ్1బీ వీసాలనూ ప్రతి దేశానికి పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తుండటంతో యూఎస్‌లో యూనికార్న్‌ల సంఖ్య ఇంత తక్కువగా ఉందని తెలిపింది. లేకపోతే ఇంకా ఎక్కువ మంది విదేశీయులు కొత్త కొత్త స్టార్టప్‌లను స్థాపించేవాళ్లని వివరించింది.