World Record Doctor: సుషోవన్ బంద్యోపాధ్యాయ్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన ఫేమస్ డాక్టర్. దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ కాలం ఒక్క రూపాయికే వైద్యం అందించిన అరుదైన డాక్టర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కువ మంది రోగులకు ట్రీట్మెంట్ చేసిన వైద్యుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. అంతకుమించి నిరుపేదల గుండెల్లో చిరంజీవిలా చెక్కుచెదరని స్థానం సంపాదించారు. రాజకీయ నాయకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 1984లో బోల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) సభ్యుడిగా, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం పాలిటిక్స్ నుంచి తప్పుకొని బడుగు, బలహీనవర్గాలకు వైద్యం అందించటానికే జీవితాన్ని అంకితం చేశారు. వైద్య, రాజకీయ రంగాల్లో ఆయన ప్రజలకు చేసిన నిస్వార్ధ సేవకు గాను కేంద్ర ప్రభుత్వం 2020లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 84 ఏళ్ల వయసులో ఆయన నిన్న మంగళవారం కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వన్ రూపీ డాక్టర్‌గా ప్రసిద్ధి చెందిన సుషోవన్ బంద్యోపాధ్యాయ్ రెండేళ్ల నుంచి మూత్రపిండ సంబంధ అనారోగ్య సమస్యలతో పోరాడారు.
read more: Commonwealth Games: తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది. తెచ్చే పతకాలెన్నో..
ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పారు. ఈ మేరకు మోడీ ట్వీట్ చేశారు. “మానవత్వానికి, విశాల హృదయానికి నిలువెత్తు నిదర్శనం బంద్యోపాధ్యాయ్. ఒక్క రూపాయి వైద్యుడిగా ఆయన వేలాది మందికి అందించిన నిరుపమాన సేవలు అజరామరం. పద్మ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా బంద్యోపాధ్యాయ్‌తో మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే ఉన్నాయి.
ఆయన ఈ లోకాన్ని శాశ్వతంగా వీడటం నన్నెంతగానో బాధించింది. బంద్యోపాధ్యాయ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బంద్యోపాధ్యాయ్ ఇక లేరనే వార్త వినగానే మనసు ఒక్కసారిగా చలించిపోయిందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ‘ప్రజల కోసమే, ప్రజలతోనే బతికిన గొప్ప వైద్యుడు బంద్యోపాధ్యాయ్. ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎందరికో ఆదర్శం’ అని అన్నారు.