Story Board: ఇదిగో..అదిగో అంటూ రోజులు..వారాలు.. నెలలు గడిచిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఎదురుచూపులు మాత్రం ఫలించడం లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ…ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిందన్న మాటే కానీ…పార్టీలో కింది స్థాయి నుంచి ఎమ్మెల్యేల దాకా ఎవరు సంతృప్తిగా లేరు. మంత్రి పదవుల భర్తీ చేయలేదు. నామినేటెడ్ పోస్టుల్లేవు…కనీసం పీసీసీ కార్యవర్గాన్ని కూడా నియమించలేకపోతున్నారు. ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ పనులు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. హైకమాండ్ కూడా ఎప్పట్లాగే కసరత్తు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గ్రీన్ సిగ్నల్ వస్తుందా అన్నది మాత్రమే ఎవరికీ అంతుచిక్కడం లేదు.
Read Also: Off The Record: వైఎస్ జగన్ లిక్కర్ కేసులో అరెస్టుకు మానసికంగా సిద్ధమయ్యారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్…హస్తిన చుట్టూ చక్కర్లు కొట్టారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో వరుసగా భేటీలు అయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో…రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్ విడివిడిగా సమావేశం అయ్యారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చలు జరిపారు. దీంతో కాంగ్రెస్‌లో పదవుల కసరత్తు…ఈ సారి కొలిక్కి వస్తుందని ఆశావహులు భావించారు. ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండి అందర్నీ కలిసి ఈ సారికి క్యాడర్ ఆశల్ని మోసుకుంటూ వద్దామని అనుకున్నారు. కానీ ఒకరి తర్వాత ఒకరి ఆమోదం పొందాల్సి రావడంతో కసరత్తు ఆగిపోయింది. ఖర్గే ఢిల్లీలో లేకపోవడంతో మళ్లీ రావాలని చెప్పి పార్టీ నేతల్ని ఇప్పటికి పంపించి వేశారు. నెలాఖరులో మిగిలిన విషయాలు మాట్లాడదామని కబురు పంపారు. దీంతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్.. ఎప్పట్లాగే.. త్వరలో అనే కబురుతో తిరిగి వచ్చేశారు.
Read Also: Off The Record: కేసీఆర్ దగ్గర కవిత రెండు ప్రధాన డిమాండ్స్ పెట్టారా..?
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేరని ఒకసారి…పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేడని ఇంకోసారి తిప్పిపంపుతున్నారు. వీరిద్దరు అందుబాటులో ఉంటే…రాహుల్ గాంధీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ జయంతి నటరాజన్ ఉండటం లేదు. ఈ కారణంగా ఏడాదిన్నరగా తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పంపకం కొలిక్కి రావడం లేదు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు…ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. ఎన్ని సార్లు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లారు ? ఇంకెన్ని సార్లు పార్టీ కోసం వెళ్లారు ? అంటూ విమర్శిస్తున్నాయి. రాష్ట్రానికి ఎన్ని నిధులు సాధించుకోచ్చారంటూ సీఎంను ప్రశ్నిస్తున్నాయి. పార్టీ అధిష్టానమే…తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడాన్ని పార్టీ నేతలతో పాటు కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. 30న మళ్లీ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ను తిప్పి పంపారు. అప్పుడైనా ఆశావహుల ఆశలు నెరవేరుతాయా ? లేదంటే మళ్లీ నాన్చుడు ధోరణి అవలంభిస్తారా అన్నది అంతుచిక్కడం లేదు.
Read Also: Alcohol : మందు తాగితే నిద్ర బాగా పడుతుందా? ఈ వాదనలో నిజమెంత…!
తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆశావహులు మాత్రం భారీగానే ఉన్నారు. మిగిలిన నేతలు…ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చాన్స్ రాదని అధిష్టానాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలంటే.. జిల్లాలు, సామాజికవర్గాలను సమన్వయం చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆశలు పెట్టుకున్న పార్టీ నేతలకు అవకాశం ఇవ్వలేరు. అలా ఇవ్వకపోతే వారు చేసే రచ్చ పార్టీని డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఏడాదిగా మంత్రి పదవుల భర్తీ అంశాన్ని పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ క్యాడర్ పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. పార్టీని నమ్ముకున్న వాళ్లు.. తమకు ఏదో ఓ పదవి వస్తుందని ఆశ పడుతున్నారు. ఈ అశ ఇలా కొనసాగుతూనే ఉంది. కొన్ని పదవులు ప్రకటించినా ఇంకా మెజార్టీ పదవుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇందు కోసం కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఓ ఫార్ములాను రెడీ చేశారు. దానిపై కసరత్తు చేశారు. పదవుల పేర్లతో షార్ట్ లిస్టు కూడా రెడీ అయిందని పార్టీలో ప్రచారం జరిగింది. ప్రకటన మాత్రం రావడం లేదు.
Read Also: NIA Investigation: సిరాజ్, సమీర్ విచారణ.. బయటపడుతున్న కీలక విషయాలు
పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్‌ను నియమించారు. కానీ ఇప్పటి వరకూ కార్యవర్గాన్ని మాత్రం ప్రకటించలేదు. మంత్రి పదవులకు, నామినేటెడ్ పోస్టులకు లింకు పెట్టి అక్కడ చాన్స్ దక్కని వారికి పార్టీ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఇక్కడా కసరత్తులు చేసి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయమూ ప్రకటించలేదు. పార్టీ పరిస్థితి మెరుగుపడాలంటే.. ముందుగా క్యాడర్‌కు పదవులు ఇవ్వాలి. ఎంత ఆలస్యం చేస్తే అంత డ్యామేజ్ జరుగుతుంది. రాష్ట్ర నాయకత్వాన్ని ఎంత బలంగా ఉంచితే.. వారు పదవుల పంపకం తర్వాత ఏర్పడే సమస్యల్ని అంతగా కవర్ చేస్తారు. కానీ ఈ రెండు విషయాల్లోనూ హైకమాండ్ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ప్రకటించడమే తరువాయి అన్నట్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ….ఢిల్లీ వెళ్లడం…రావడం కామన్‌గా మారిపోయింది. అయితే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం మాత్రం కొలిక్కి రావడం లేదు.
Read Also: UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యవర్గాన్ని కూడా లేకుండా నెలల తరబడి ఎదరుచూసేలా చేయడం ఏమిటని…కాంగ్రెస్ హైకమాండ్ అంత తీరిక లేకుండా ఉందా అన్న విమర్శలు సొంత పార్టీలోనే వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీకి పదవుల పోటీ ఎప్పుడూ ఉంటుంది. ఈ కారణంగా వాయిదాలు వేసుకోవడం అంటే సమస్యలను పెద్దవి చేసుకోవడమే అని నేతలు గొణుక్కుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని సమీకరణాలు చూసుకుని ఫలానా వాళ్లకు పదవులు ఇవ్వాలని సిఫారసు చేస్తే.. ఇతర నేతల నుంచి పోటీగా మరో జాబితా వెళ్తోంది. పార్టీలో అన్ని వర్గాలు కనిపించేందుకు హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ర్వారి సిఫారసులకూ విలువ ఉన్నట్లుగా చేస్తోంది. దీంతో పదవుల పంచాయతీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఎప్పుడు ముగింపు కార్డు పడుతుందో కూడా సీఎం, పీసీపీ చీఫ్‌లకు క్లారిటీ లేకుండా పోయింది.