పాదయాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్. ఆయన కంటే ముందు.. ఆ తర్వాత ఎంతోమంది పాదయాత్రలు చేశారు. అయినా పాదయాత్రలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలోకి రావడానికి వైఎస్ అనుసరించిన ఈ ఫార్మూలా ఆ తర్వాత ఎంతోమంది నాయకులకు ఆదర్శంగా నిలిచింది. వైఎస్ఆర్ స్ఫూర్తితో పాదయాత్ర చేపట్టిన ఎంతోమంది రాజకీయ నాయకులు ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఏపీలో పాదయాత్ర చేపట్టారు. ఓదార్పు యాత్ర, పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లి జననేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల కష్టాసుఖాలను తెలుసుకొని వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను తయారు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించడంతో ప్రస్తుతం ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గడిచిన రెండేళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలో సంక్షేమమే ప్రధాన ఏజెండా ముందుకు వెళుతున్నారు.
ఇక వైఎస్ఆర్ కూతురు షర్మిల సైతం తెలంగాణలో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ఆమె వైఎస్ఆర్టీపీని స్థాపించారు. వైఎస్ఆర్ మాదిరిగానే ఆమె సైతం తెలంగాణలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రేపటి నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్రను చేవేళ్ల నుంచి ప్రారంభించగా షర్మిలా సైతం అదే జిల్లా నుంచి పాదయాత్రను ప్రారంభించేందుకు రెడీ అయ్యారు.
షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి అందుబాటులో లేని సమయంలో ఆమె ఆపార్టీ కోసం పాదయాత్ర చేపట్టారు. జగన్ వదిలిన బాణం అంటూ ఏకంగా 3,112 కిలోమీటర్ల పాదయాత్రను ఏపీలో పూర్తి చేశారు. అత్యధిక దూరం పాదయాత్ర చేపట్టిన తొలి మహిళగా ఆమె పేరు రికార్డుకెక్కింది. అయితే తన రికార్డును తానే బద్దలు చేసేలా తెలంగాణలో 4వేల పాదయాత్రను షర్మిల చేయబోతున్నారు. జీహెచ్ఎంసీ మినహా తెలంగాణలోని 90నియోజకవర్గాల పరిధిలో షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
ఈ పాదయాత్రను షర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిని విజయవంతం చేసేందుకు ఆపార్టీ మొత్తంగా 26 కమిటీలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల వారీగా బాధ్యతలను పార్టీలోని ముఖ్యనేతలకు అప్పగించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులను కలుపుకుపోయేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పాదయాత్రకు ఆమె తల్లి విజయమ్మ పూర్తి మద్దతు ఇస్తున్నారు. పీకే టీం సైతం షర్మిలతోనే నడిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్, జగన్ కు కలిసొచ్చిన పాదయాత్ర షర్మిలకు ఏమేరకు కలిసి వస్తుందో వేచిచూడాల్సిందే..!