మరపురాని భానుమతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురాణాల్లో భానుమతి అంటే దుర్యోధనుని భార్య అని తెలుస్తుంది. అయితే భారతంలో భానుమతి పాత్ర పెద్దగా కనిపించదు. కానీ, తెలుగు సినీభారతంలో మాత్రం బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు. మొదటి నుంచీ భానుమతికి ధైర్యం పాలూ ఎక్కువే. ఎదుట ఎంతటి మేటినటులున్నా, తనదైన అభినయంతో ఇట్టే వారిని కట్టిపడేసేవారు. ఇక ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకొని వచ్చి పట్టం కట్టడం కూడా ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అనే చెప్పాలి.
ఈ నాటి ప్రకాశం జిల్లా దొడ్డవరంలో 1925 సెప్టెంబర్ 7న భానుమతి జన్మించారు. బాల్యం నుంచీ భానుమతి చాలా చురుగ్గా ఉండేవారు. ఇట్టే పద్యగద్యాలను అప్పచెప్పేవారు. ప్రౌఢకావ్యాలనైనా అవలీలగా వల్లించేవారు. ఇక చిన్నతనంలోనే సొంతగా రచనలు కూడా చేసేవారు. అందుకు కారణం ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య అనే చెప్పాలి. “కంటే కూతుర్నే కనాలిరా… మనసుంటే మగాడిలా పెంచాలిరా…” అంటూ ఈ నాడు పాటలు పాడుకోవడం కాదు. తన కూతురుకు బాల్యంలోనే సంగీతసాహిత్యాలలో మంచి ప్రవేశం ఉండేలా చూసుకున్నారు వెంకటసుబ్బయ్య. అంతేకాదు ఆమెకు “నువ్వు ఎందులోనూ తక్కువ కాదు” అంటూ పిన్నవయసులోనే నూరిపోశారు. దాంతో భానుమతి ఎంతటివారినైనా ధైర్యంగా ఎదుర్కొనే లక్షణం చిన్ననాడే అలవరచుకుంది. టీనేజ్ లో అడుగు పెట్టిందో లేదో, ఆమె గాన,నృత్య అభినయ పటిమ గురించి తెలుసుకున్న ‘వరవిక్రయం’ దర్శకులు సి.పుల్లయ్య ఆమెకు అందులో అవకాశం కల్పించారు. అలా తెరంగేట్రం చేసిన భానుమతి ఆ తరువాత మరి వెనుదిరిగి చూసుకోలేదు.
Also Read
‘మల్లీశ్వరి’ అంటే భానుమతి!
భానుమతికి బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’ (1945) నటిగా, గాయనిగా ఎనలేని పేరును సంపాదించి పెట్టింది. అందులో భానుమతి పాడిన “ఓహో… పావురమా…” పాట అప్పట్లో తెలుగువారిని విశేషంగా అలరించింది. దర్శకుడు పి.రామకృష్ణను ఆ రోజుల్లోనే ప్రేమించి పెళ్ళాడింది భానుమతి. వారి ఏకైక సంతానం భరణి. అతని పేరుమీదే ‘భరణి స్టూడియోస్’ నిర్మించారు. భరణీ పిక్చర్స్ పతాకంపై పలు జనరంజక చిత్రాలను తెరకెక్కించారు భానుమతీ రామకృష్ణ దంపతులు. తెలుగు వారి ‘లైలా’గా అలరించిన భానుమతి ‘చింతామణి’గానూ మురిపించారు. ఇక ‘విప్రనారాయణుని’ దేవదేవిగానూ భానుమతి అభినయం జేజేలు అందుకుంది. ఎన్ని చిత్రాల్లో నటించినా భానుమతి అనగానే ఈ నాటికీ అందరికీ గుర్తుకు వచ్చే చిత్రం ‘మల్లీశ్వరి’. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ కళాఖండం పాటల తోటగా తెలుగునాట నిలచింది. ఇందులోని ప్రతి పాట అమృతమే. ప్రతి మాటా సుధలొలికిస్తుంది. యన్టీఆర్, భానుమతి జోడీ తెరపై కనువిందు చేసిన తీరు కూడా అద్భుతమే. మల్లీశ్వరి పేరుతో ఎందరు తరువాతి రోజుల్లో తెరపై కనిపించినా, తెలుగువారికి ఆ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే నటీమణి భానుమతేనని చెప్పాలి. అందులో నటిగా, గాయనిగా, నర్తకిగా భానుమతి ప్రతిభను ఎవరు మరచిపోగలరు?
‘మల్లీశ్వరి’తోనే యన్టీఆర్-భానుమతి జోడీ మొదలయింది. వారిద్దరూ నటించిన “అగ్గిరాముడు, చింతామణి, వివాహబంధం, తోడు-నీడ, పల్నాటి యుద్ధం” జనాన్ని ఆకట్టుకున్నాయి. భానుమతి దర్శకత్వం చేపట్టి తొలుత నిర్మించిన ‘చండీరాణి’ చిత్రాన్ని తెలుగు,తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు. ఈ మూడు భాషల్లోనూ యన్టీఆర్ కథానాయకుడు. తొలిసారి దర్శకత్వం వహిస్తూనే ద్విపాత్రాభినయం చేశారు. ఇక ‘చండీరాణి’కి సంగీతపర్యవేక్షణ కూడా భానుమతి నిర్వహించారు. ఆ సినిమా మూడు భాషల్లోనూ శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. ఆ తరువాత యన్టీఆర్ దర్శకత్వంలో ‘తాతమ్మకల, సమ్రాట్ అశోక’ చిత్రాల్లో నటించారు భానుమతి. ఆమె దర్శకత్వం వహించిన ‘అమ్మాయి పెళ్ళి’లోనూ యన్టీఆర్ ఆమెతో జోడీ కట్టారు.
బాలకృష్ణతో బంధం!
యన్టీఆర్ ‘తాతమ్మకల’లో బాలకృష్ణకు తాతమ్మగా నటించిన భానుమతి తరువాతి రోజుల్లో ‘మంగమ్మగారి మనవడు’లోనూ బాలయ్యకు నాన్నమ్మగా అభినయించారు. బాలకృష్ణ తొలి చిత్రంలో నటించడమే కాదు, ఆయన కెరీర్ లో తొలి విజయంగా నిలచిన సినిమాలోనూ భానుమతి కీలక పాత్ర పోషించడం విశేషం. ఆ విధంగా నందమూరి కుటుంబంతో భానుమతికి మంచి అనుబంధం ఉంది. బాలకృష్ణతో ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించ తలపెట్టిన భారీ జానపదంలోనూ భానుమతి కీలక పాత్ర ధరించారు. అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పూర్తి కాలేదు.
భానుమతి బహుముఖ ప్రజ్ఞకు ఎన్నో అవార్డులు, రివార్డులూ ఆమె కీర్తి కిరీటంలో నిలిచాయి. అందరూ బాలలతో ఆమె తెరకెక్కించిన ‘భక్త ధ్రువ -మార్కండేయ’ ఆ రోజుల్లో అలరించింది. ఈ చిత్రం ద్వారా నటి, నర్తకి శోభనను తెరకు పరిచయం చేశారు భానుమతి. పద్మశ్రీ,, పద్మభూషణ్ అందుకున్న భానుమతిని ఆంధ్ర, తమిళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో గౌరవించాయి. 1985లో ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డులభించింది. 2000 సంవత్సరం యన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు. 2005 డిసెంబర్ 24న భానుమతి కన్నుమూశారు. భౌతికంగా మనమధ్య లేకపోయినా, భానుమతి స్మృతులు సదా తెలుగువారి మదిలో మెదలుతూనే ఉంటాయి.
తాజావార్తలు
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
-
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
-
Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..