తెలంగాణలో ఇంటర్ విద్యార్దులు ఫస్టియర్ విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, కాంగ్రెస్.. ఇతర విద్యార్ధి సంఘాలు ఇంటర్ బోర్డుపై వత్తిడి తెచ్చాయి. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 35 మార్కులతో ఫెయిలైన విద్యార్థులందరినీ… పాస్ చేస్తున్నట్లు తెలిపారు. మినిమమ్ మార్కులు వేసి.. ఈ సారి పాస్ చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
ఈ నేపథ్యంలో తమ ఉద్యమ ఫలితంగా ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఏబీవీపీ ప్రకటించింది. ద్వితీయ సంవత్సరం పరీక్షలు సమీపంలో ఉన్నందున విద్యార్థులను పాస్ చేయడం మంచిదే అని ఏబీవీపీ అభిప్రాయపడింది. ప్రభుత్వం, బోర్డ్ నిర్లక్ష్యం 7 విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైందని ఏబీవీపీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు 10 లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
కార్పొరేట్ కళాశాలలతో కుమ్మకైన ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి,బలోపేతం చేయాలని కోరింది. మరోవైపు ఇంటర్ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో విద్యార్ధి సంఘాలు ఆందోళన విరమించాలని నిర్ణయించాయి. మంగళవారం తలపెట్టిన ఇంటర్ బోర్డు ముట్టడిని కాంగ్రెస్ పార్టీ విరమించుకుంది.