కడప జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెయ్యేరు నది పొంగి పొర్లుతోంది. దీంతో చెయ్యేరు నది ఒడ్డున ఉన్న శివాలయం మునిగిపోయింది. దీంతో అక్కడ కార్తీకమాస పూజల కోసం వచ్చిన భక్తులు వరదలకు కొట్టుకుపోయారు. మొత్తం 26 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో 14 మంది మృతదేహాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మృతులంతా పులమత్తూరు, మందపల్లికి చెందినవారుగా గుర్తించారు.
Read Also: జగన్ గాల్లో నుంచి కిందకు దిగాలి: నారా లోకేష్
ఎగువ, దిగువ మందపల్లికి చెందిన 13 మంది వరదనీటిలో గల్లంతు కాగా… ఈ ఘటనలో పూజారి రామ్మూర్తి కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. వీరిలో ఇప్పటి వరకు ఒక మహిళ మృతదేహం మాత్రమే లభ్యమైందని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కాగా కడప జిల్లాలో కుండపోత వర్షాలపై రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి స్పందించారు. వర్షాల కారణంగా నియోజకవర్గంలో భారీ నష్టం వాటిల్లిందన్నారు. పొలపత్తూరు శివాలయంలో దీపారాధనకు వెళ్లి ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయంలో సరైన సమాచారం లేదన్నారు. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలను గుర్తించారని, పలువురు గల్లంతయ్యారని చెప్పారు. 11 నుంచి 12 మంది వరకు చనిపోయి ఉండవచ్చని తాము భావిస్తున్నామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని తెలిపారు. వరద బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే మల్లికార్జున్‌రెడ్డి హామీ ఇచ్చారు.