దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా భారత్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీ వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కి చేరింది. ఢిల్లీలో మాత్రం ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం ఓమిక్రాన్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. దేశంలో మహారాష్ట్రలో ఎక్కువగా ఓమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Read Also: మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం..మూడేళ్ల చిన్నారికి పాజిటివ్
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖ రాసింది. ఏ జిల్లాలోనైనా కేసులు, పాజిటివిటీ రేటు పెరిగితే అక్కడి స్థానిక యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచించింది. ఆ ప్రాంతాల్లో పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని… కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి, రాత్రి కర్ఫ్యూ విధించాలని ఆదేశించింది. జనసమూహాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనేవారిపై పరిమితులు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.