దేశంలో కరోనా కేసులు ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల్లో సగానికి పైగా కేసులు కేరళ రాష్ట్రం నుంచే నమోదవుతున్నాయి. ఓనం పండుగ తరువాత నుంచి ఆ రాష్ట్రంలో కేసులు పెరగడం మొదలయ్యాయి. దీంతో రాబోయే రోజుల్లో దేశంలో జరుపుకునే పెద్దపండగలైన వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వాటిపై కరోనా ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉన్నది. పండుగల కోసం ఒక చోట పెద్ద సంఖ్యలో గుమిగూడితే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశం నుంచి సెకండ్ వేవ్ పూర్తిగా తొలగిపోలేదు. సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ మరింతగా విస్తరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే, దేశంలో డెల్టా ప్లస్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 300 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది.