నేడు భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక..
భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈరోజు పార్లమెంట్ హౌస్‌లో ఓటింగ్ జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సీ.పీ. రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీపడుతున్నారు. వసుధలోని రూమ్ నంబర్ F-101లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 10 గంటలకు ఓటు వేస్తారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, లోక్‌సభ (543 మంది సభ్యులు), రాజ్యసభ (233 మంది ఎన్నికైనవారు, 12 మంది నామినేటెడ్ సభ్యులు) లోని అన్ని ఎంపీలు ఓటు వేస్తారు. ప్రస్తుతం, 5 రాజ్యసభ, 1 లోక్‌సభ స్థానం ఖాళీగా ఉన్నందున 781 మంది ఎంపీలు ఓటు వేయనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 386 ఓట్లు దక్కించుకున్న వాళ్లు విజేతగా నిలువనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్(4 ఎంపీలు), బీజేడీ (7 ఎంపీలు) ప్రకటించిన విషయం తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది మర మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీ రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పోరుబాట.. పర్మిషన్ లేదంటున్న పోలీసులు
ఇవాళ (సెప్టెంబర్ 9న) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని జిల్లాల్లోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు చేయాలని కోరింది. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలనీ, ఉల్లి, టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తుంది. అలాగే, ఈ నిరసన ప్రదర్శనల అనంతరం ఆర్డీవోలకు వినతి పత్రాలు అందించాలని వైసీపీ నిర్ణయించింది. ఇక, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 30 యాక్ట్ అమలులో ఉన్నందున నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినా అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని వైసీపీ శ్రేణులు తేల్చి చెప్పారు.
కొవ్వూరులో కూటమి నేతల కుమ్ములాటలు- జనసేన శ్రేణుల ఆందోళన
తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరులో కూటమి నేతలు అర్ధరాత్రి నడిరోడ్డుపై కుమ్ములాడుకున్నారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సమక్షంలో టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో జనసేన శ్రేణులు రసభస చేశారు. దీంతో జనసేన నాయకులపై దారి కాసి మరీ కూటమి నేతలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఇక, ఈ దాడికి నిరసనగా అర్ధరాత్రి దొమ్మేరు సెంటర్లో జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు. అయితే, మూకుమ్మడిగా దాడి చేసిన కూటమి నేతలపై కేసులు నమోదు చేయాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకూ దీక్ష విరమించేది లేదంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రంగంలోకి దిగిన కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ దీక్ష శిబిరానికి విచ్చేసి వివరాలు సేకరించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని మీకు న్యాయం చేస్తామని జనసేన శ్రేణులకు డీఎస్పీ హామీ ఇచ్చారు. అలాగే, దీక్షా శిబిరానికి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులు సైతం వెళ్లడంతో.. కొద్దీగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
గ్రూప్-1 అంశంపై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు..
తెలంగాణలో గ్రూప్ 1 అంశంపై తెలంగాణ హైకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. గ్రూప్ 1 అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 21 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ ఈ ఏడాది మార్చి 10న విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులపై అనేక అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోఠి మహిళా కాలేజీలో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపిక కావడం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం తదితర అంశాలపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయొద్దని కోర్టులో పిటిషన్ వేసిన ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు. గ్రూప్ 1 నియామకాల ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఎలా రద్దు చేస్తారని ఎంపికైన అభ్యర్థుల వాదన.. ఎలాంటి అవకతవకలు జరగలేదని హైకోర్టుకు తెలిపిన టీజీపీఎస్సీ.. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు తన తీర్పును వాయిదా వేస్తున్నట్టు జూలై 7న ప్రకటించారు. ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠత పెరిగింది.
నేడు హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో మోడీ పర్యటన.. వరద ప్రాంతాల పరిశీలన
ప్రధాని మోడీ మంగళవారం హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లో పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో సహాయ శిబిరాలను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండచరియలు విరిగిపడి పదుల కొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం వరద బాధితులతో సంభాషించనున్నారు. అలాగే ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, ఆప్దా మిత్ర బృందాలను కలవనున్నారు. అనంతరం రాష్ట్రంలో అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
ఫ్రెంచ్‌లో రాజకీయ సంక్షోభం.. విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ఓటమి
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఫ్రాన్స్‌లోనే పెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశ రుణాన్ని తగ్గించడానికి సుమారు 52 బిలియన్లను తగ్గించాలనే ప్రణాళికలపై ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జాతీయ అసెంబ్లీ ఓటు వేసింది. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో 364 మంది డిప్యూటీలు ప్రభుత్వంపై తమకు అవిశ్వాసం లేదని ఓటు వేయగా.. కేవలం 194 మంది మాత్రమే తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో పదవీచ్యుతుడయ్యారు. ఫ్రాన్స్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా కాకుండా విశ్వాస తీర్మానం ద్వారా పదవీచ్యుతుడైన తొలి ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో కావడం విశేషం. ఇక మంగళవారం ఉదయం తన రాజీనామాను సమర్పించనున్నట్లు అత్యంత సన్నిహితుడొకరు మీడియాకు తెలిపాడు.
నేడు ఆపిల్ ఈవెంట్.. ఐఫోన్ 17 సిరీస్, కొత్త వాచ్ విడుదలకు సిద్ధం
ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఈ సంవత్సరం అతిపెద్ద ఈవెంట్‌ను నేడు నిర్వహించబోతోంది. ఇందులో కంపెనీ కొత్త ప్రొడక్టులను విడుదల చేయనుంది. ఐఫోన్ 17, 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ఇందులో ఆవిష్కరించనున్నారు. అలాగే, ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ వాచ్ సిరీస్ 11 కూడా విడుదలకానున్నాయి. ఈ ఆపిల్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపిల్ పోర్టల్, యూట్యూబ్, అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో చూడవచ్చు. ఆపిల్ ఈవెంట్ సందర్భంగా ఐఫోన్ 17 లైనప్‌ను ఆవిష్కరించనున్నారు. ఈసారి కంపెనీ ఐఫోన్ 17 ఎయిర్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఐఫోన్ 17 ఇది 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. గతంలో, స్టాండర్డ్ వేరియంట్‌లో 60Hz డిస్‌ప్లే ఉండేది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 24MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.
నాని ‘ప్యారడైజ్’ కోసం 30 ఎకరాలలో భారీ ప్లానింగ్
నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నేచురల్ స్టార్ నానిని కెరీర్ లో మునుపెన్నడూ చుడని విధంగా చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. కాగా ఈ సినిమా కథా నేపథ్యం 80వ దశకంలోని సికింద్రాబాద్ బ్యాడ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. నాని ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేయనున్నాడని టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం చిత్ర నిర్మాతలు హైదరాబాద్ శివార్లలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ మురికివాడల సెట్స్ నిర్మించనున్నారట. ఇటీవల ఈ సినిమా నుండి నేచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా భారీ స్పందన లభించింది. పక్కింటి అబ్బాయ్ లాగా ఉండే నాని రెండు పొడవాటి జడలు వేసుకుని రగ్గుడ్ లుక్ లో ‘జడల్’ గా అదరగొట్టాడు. టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు ప్యారడైజ్ ను నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ రూ. 100 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మిస్తున్నారు. తమిళ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ప్యారడైజ్ మొత్తం 8 భాషలలో రిలీజ్ కానుంది. సమ్మర్ కానుకగ వచ్చే ఏడాది మార్చి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ది ప్యారడైజ్.
తన డ్రెస్‌తో గూగుల్ హిస్టరీనే మార్చేసిన జెన్నీఫర్.. ఎలా అంటే?
మనకు తెలియని ప్రతి విషయాన్ని తెలియజేసి గూగుల్ నేడు ప్రపంచానికి ఒక విడదీయరాని భాగంగా మారింది. సాధారణ సమాచారం, సైన్స్ అండ్ టెక్నాలజీ వివరాలనో, లేక వినోదం సంబంధిత కంటెంట్‌నో – ఏదైనా కావాలన్నా గూగుల్‌లో వెతికితే క్షణాల్లో దొరుకుతుంది. కానీ గూగుల్ ఇమేజెస్ అనే ఫీచర్ ఎలా పుట్టింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏంటి? అనేది చాలామందికి తెలియదు. ఇది ప్రారంభమైనది 2000 గ్రామీ అవార్డ్స్ వేడుకలో. ఆ వేడుకకు హాజరైన అమెరికన్ గాయని, నటి జెన్నిఫర్ లోపెజ్ ఆకుపచ్చ రంగులోని వెర్సాస్ జంగిల్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆ గౌన్ ఆ రాత్రి మొత్తం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఆ డ్రెస్ ఫొటోలు చూడాలనే ఉత్సాహం వల్ల ఇంటర్నెట్‌లో మిలియన్ల మంది ఒకేసారి సెర్చ్ చేయడం మొదలెట్టారు. కానీ ఆ సమయంలో గూగుల్‌లో ఫొటోలు చూపించే ఆప్షన్ లేకపోవడంతో, యూజర్లు విపరీతంగా నిరాశ చెందారు. ఈ సంఘటన గూగుల్ యాజమాన్యానికి కొత్త ఆలోచన కలిగించింది. “ప్రజలు కేవలం కథనాలు చదవడం మాత్రమే కాదు, ఎక్కువగా ఫోటోలు చూడాలని కోరుకుంటున్నారు” అని గ్రహించారు. అప్పటి గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్ దీన్ని గుర్తించి, వెంటనే ఒక ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ అవసరం ఉందని నిర్ణయించారు. దీంతో గూగుల్ ఇమేజెస్ ఆవిష్కృతమైంది. 2001 జూలైలో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ ఇమేజెస్ మొదటి దశలోనే 250 మిలియన్ల ఫోటోలు యూజర్లకు అందించింది.
నేటి నుంచే ఆసియాకప్ టోర్నీ.. తొలి మ్యాచ్‌లో
అభిమానులకు మళ్లీ క్రికెట్ పండగ మొదలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కు ముందు జరిగే అతి పెద్ద ఈవెంట్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. పొట్టి ఫార్మాట్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఆసియాఖండంలోని ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ బరిలోకి దిగుతోంది. కాగా, ఆసియా కప్ టోర్నమెంట్ ఇవాళ (సెప్టెంబర్ 9న) ప్రారంభం కాబోతుంది. అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ లో అఫ్గానిస్థాన్, హాంకాంగ్ తలపడబోతున్నాయి. అయితే, తొలి మ్యాచ్ అఫ్గాన్ – హాంకాంగ్ మధ్య ఈ రోజు రాత్రి 8 గంటలకు జరగనుంది. అబుదాబి వేదికగా జరిగే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక, టీమిండియా తన తొలి మ్యాచ్‌ను యూఏఈతో రేపు (సెప్టెంబర్ 10న) ఆడనుంది. భారత్ – పాక్ మధ్య సెప్టెంబర్ 14వ తేదీన హై ఓల్టేజ్ మ్యాచ్ కొనసాగనుంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4, ఫైనల్ ఇలా టోర్నీని ఏసీసీ డిజైన్ చేసింది.