ఏపీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలు ఇవే.. ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన
అన్ని పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది.. టెన్త్, ఇంటర్ పరీక్షలు ముగియగానే కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి.. ఇవాళ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.. మే 5వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీన EAPCET నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 15 నుంచి 18వ తేదీ వరకు ఎంపీపీ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు. మే 22, 23 తేదీల్లో బైపీసీ అభ్యర్థులకు పరీక్ష జరగనుంది.. ఈ నెల 17వ తేదీన ఐసెట్ నోటిఫికేషన్, మే 24, 25 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 10 తేదీ వరకు ఈసెట్ పరీక్షల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు EAPCETకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు ఐసెట్ పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరగనుంది.
పయ్యావుల ఓపెన్ చాలెంజ్.. కోర్టుకు వెళ్తామని వార్నింగ్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు.. టీడీపీకి చెందిన ఎవరెవరి ఖాతాలకు స్కిల్ డెవలప్‌మెంట్ నిధులు వెళ్లాయో వివరాలు విడుదల చేయగలరా..? అంటూ ఛాలెంజ్ చేశారు. నిధుల విడుదలకు సంతకం చేసిన ప్రేమ్ చంద్రారెడ్డి ప్రస్తావన ఎందుకు తీసుకురావడం లేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచనలకు భిన్నంగా అర్జా శ్రీకాంత్ నివేదిక ఇచ్చారన్న పయ్యావుల. సీమెన్స్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం.. సాఫ్ట్‌వేర్ వాల్యూయేషన్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు.. పిల్లల భవిష్యత్ కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం.. ప్రభుత్వం కట్టుకథలతో లేనిపోని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు.. సీమెన్స్ సంస్థతో ఒప్పందం పేరుతో టీడీపీ పెద్దల ఖాతాల్లోకి నిధులు మళ్లించారనే ఆరోపణలు చేస్తున్నారు.. ఏయే ఖాతాలకు నిధులు వెళ్లాయో.. ఆ వివరాలు వెల్లడించండి.. ఖాతాల నెంబర్లను విడుదల చేయండి..? అంటూ బహిరంగ సవాల్ విసిరారు.
మళ్లీ టీడీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి..? క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు పార్టీలు మారడం.. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.. అయితే, కొన్నిసార్లు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా త్వరలో మరో పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతుంటుంది.. ఇప్పుడు అలాంటి ప్రచారమే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై జరుగుతోంది.. ఆ ప్రచారంపై స్పందించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలను పదే పదే చెప్పి , నిజమని ప్రచారం చెయ్యడం చంద్రబాబుకు మామూలే అని మండిపడ్డారు. నేను ఆ స్కూల్ స్టూడెంట్ నే.. లోకేష్ భవిష్యత్తు పై చంద్రబాబు ఆందోళనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. లోకేష్ కు బుర్ర లేదు.. ఏమి మాట్లాడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఇక, తెలుగుదేశం పార్టీలో నేను చేరుతానని కొన్ని చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి, వైసీపీలోకి వచ్చానని గుర్తుచేసిన ఆయన.. అలాంటి నేను మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్తాను అని ప్రశ్నించారు. మంత్రి పదవి రావచ్చు, రాకపోవచ్చు.. పదవి ముఖ్యం కాదు, పదవి రాకున్నా ఎప్పుడూ అసంతృప్తి చెందలేదన్నారు.. జనంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వస్తే ఎవ్వరూ తట్టుకోలేరని హెచ్చరించారు. కానీ, సీఎం కావడంతో బిజీగా ఉన్నారని తెలిపారు. మరోవైపు.. ఉద్యోగస్తులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు.. కానీ, సీఎం వైఎస్ జగన్ అందరికీ న్యాయం చేస్తారు.. నెలాఖరులోగా శుభవార్త చెబుతారనే నమ్మకాన్న వ్యక్తం చేశారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
చట్టానికి ఎవరు చుట్టం కాదని ఇప్పటికైనా తెలుసుకో
దుబ్బాక పట్టణంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ బూత్ స్వశక్తి కరణ్ అభియాన్, భారత రాష్ట్రపతి ప్రసంగం వర్క్ షాప్‌లో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కపోయిన చెల్లెమ్మ కవిత.. తెలంగాణ ఆడపడుచులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ మరో తప్పు చేయోద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అవినీతి చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శించిన వాళ్లకు చెల్లె కవితకిచ్చిన ఈడీ నోటీసులే సమాధానం చెబుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న వారికి జవాబు కవితకు ఈడీ నోటీసులు అని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్ లో మీరు ఆదాయం పెంచుకోవడానికి ఎందుకు తలదూర్చారో గుర్తు తెచ్చుకోవాలి చెల్లె కవిత అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆస్తుల కోసం ఢిల్లీలో లిక్కర్ దందా నువ్వు చేసి ఈ రోజు అందరిని కలపడం బాధాకరమన్నారు. కవితమ్మ ముద్దాయి అని తెలుపుతూ నోటీసులు ఇచ్చింది ఈడీ.. మోడి కాదని ఆయన అన్నారు. నోటీసులు ఇస్తే నేను ఎదుర్కొంటా అంటివి ఇప్పుడు ఎదుర్కో చెల్లే అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది . ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కాగా కవిత రిక్వెస్ట్ మేరకు ఈడీ ఆమెను ఈనెల 11న విచారించనుందని సమాచారం. అయితే.. ఈ క్రమంలోనే.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారన్నారు. ముఖ్యంగా ఈడీ విచారణకు హాజరుకావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఢిల్లీ వెళ్లే ముందు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. తమ కార్యక్రమాన్ని కొనసాగించాలని, ఆందోళన పడాల్సిన పనిలేదని కవితకు భరోసా ఇచ్చారు. బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాటం చేద్దామని తన కుమార్తె కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పారని, పార్టీ అండగా ఉంటుందంటూ కవితకు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 10న గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టనున్నారు. దీనికోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే మరికాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.
మనీష్ సిసోడియా హత్యకు బీజేపీ కుట్ర.. ఆప్ ఆరోపణలు
మాజీ మంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైలులోని జైలు నంబర్ 1లో అత్యంత భయంకరమైన నేరస్థులలో ఉంచబడ్డారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. మనీష్ సిసోడియా ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రిని విపాసనా సెల్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించినప్పటికీ, ఆయనను జైలు నంబర్ 1లో ఉంచడంపై జైలు పరిపాలనను ఆయన ప్రశ్నించారు. మనీష్ సిసోడియాను ధ్యానం చేసే సెల్‌లో ఉంచాలని ఢిల్లీ కోర్టు స్పష్టంగా ఆదేశించిందని సౌరభ్ భరద్వాజ్ హైలైట్ చేశారు. తీహార్ జైలులోని ఒకటో నెంబర్ సెల్‌లో కరుడుగట్టిన నేరస్తులను నిర్బంధిస్తారని, ఇదే సెల్‌లో మనీష్ సిసోడియాను కూడా వేయడంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను మట్టుబెట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందా అని ఆప్ నేత, ఆ పార్టీ ప్రతినిధి సౌరవ్ భరద్వాజ్ కమలం పార్టీని ప్రశ్నించారు. జైలు నంబర్ 1లోని ఖైదీలకు హింసాత్మక సంఘటనల చరిత్ర ఉందని, వారిలో చాలా మంది మానసిక అనారోగ్యంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. ”అనేక కుట్రలు పన్నినా ఢిల్లీలో వరుసగా మూడు ఎన్నికల్లో ఆప్‌ని బీజేపీ ఓడించలేకపోవడమే ఇలాంటి విపరీతమైన చర్యలకు పూనుకున్నట్లుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం’’ అని సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మనీష్ సిసోడియా వంటి అండర్ ట్రయల్‌లో ఉన్న వ్యక్తిని దేశంలో అత్యంత ప్రమాదకరమైన, హింసాత్మక నేరస్థులతో ఉంచడంపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆప్ డిమాండ్ చేసింది.
అరేయ్.. మీకసలు బుద్దుందా.. ఏది చెప్తే అది నమ్మేయడమేనా
స్టార్ హీరోల సినిమాలు సెట్ మీదకు వెళ్లాయి అంటే.. అవి రిలీజ్ అయ్యేవరకు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి. హీరో పక్క ఆ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోంది.. ఈ హీరోయిన్ నటిస్తోంది. ఈ సత్తార్ హీరో క్యామియో చేస్తున్నాడు. హీరోయిన్ చనిపోతుంది.. ఆ ప్లేస్ లో ఇంకో హీరోయిన్ వస్తుందట.. ఒకటి కాదు రెండు కాదు. అందులో నిజాలు ఉన్నాయో లేదో పక్కన పెడితే.. ఈ రూమర్స్ వలన సినిమాపై అంచనాలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. మొన్నటికి మొన్న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో అల్లు అర్జున్ జ్ క్యామియో అని అనగానే.. అమ్మ బాబోయ్. ఎంత పెద్ద క్యామియో. బన్నీ ఉంటే ఇంకేమైనా ఉందా.. రచ్చ రచ్చ అనే సోషల్ మీడియాలోట్రెండ్ చేశారు. ఆ తరువాత అదంతా ఫేక్ అనగానే ఎంత రచ్చ చేశారో అంత సైలెంట్ గా మారిపోయారు. అసలు ఈ రూమర్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారో తెలియదు కానీ, వారు దొరికితే మాత్రం మాములుగా కొట్టకూడదు అంటూ బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా అలంటి రూమర్ నే మొరొకరి క్రియేట్ చేశారు కొందరు. అదేంటంటే.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది అని ఉదయం నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమాలో రష్మిక పాత్ర చనిపోతుందని, ఆ ప్లేస్ లో మరో హీరోయిన్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ పాత్ర కోసమే సాయి పల్లవిని ఓకే చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వార్త ఎవరు సృష్టించారో తెలియదు కానీ, ఇదంతా పచ్చి అబద్దమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అసలు సాయి పల్లవి ని ఈ సినిమా కోసం ఎవరు సంప్రదించింది లేదట. అసలు పుష్ప 2 లో ఇంకో హీరోయిన్ కూడా లేదట. ఎవడో ఏదో చెప్తే దాన్ని ట్రెండ్ చేయడం ఏంటి మీకసలు బుద్దుందా.. ఏది చెప్తే అది నమ్మేయడమేనా అని పుష్ప 2 యూనిట్ లో వారు బన్నీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసారని టాక్. ఏదిఏమైనా ఈ కాంబో రావాలని ఆశపడిన అభిమానులకు నిరాశే మిగిలిందని చెప్పాలి. డెఫినెట్ గా భవిష్యత్తులో మాత్రం బన్నీ- సాయి పల్లవి కాంబో వస్తుందని చెప్పొచ్చు. అప్పటివరకు ఆగడమే తప్ప ఇలాంటి రూమర్స్ ను నమ్మకుండా ఉంటేనే మంచిదని బన్నీ అభిమానులు చెప్పుకొస్తున్నారు.
‘రైటర్ పద్మభూషణ్’ అప్పుడే ఇంట్లో అడుగుపెడతాడట
కథ బావుంటే.. బడ్జెట్ తో కానీ, హీరోతో కానీ ప్రేక్షకులకు సంబంధం ఉండదు. ఈ మధ్యకాలంలో అలాంటి సినిమాలే వస్తున్నాయి అని చెప్పాడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక కలర్ ఫోటో లాంటి చిన్న సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్. ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అయినా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత సుహాస్ హీరోగా నటించిన చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛాయ్ బిస్కెట్ మేకర్స్ అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రంలో సుహాస్ సరసన శిల్పరాజ్ నటించింది. చిన్న సినిమాగా ఫిబ్రవరి 3 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా మహిళా అభిమానులు ఈ సినిమాకు నీరాజనం పట్టారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీలో వస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ డేట్ ను రిలీజ్ చేశారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 17 న జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఉగాది కన్నా ముందే అభిమానులకు కనుక ఇస్తున్నాం అంటూ జీ5 చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరి థియేటర్ లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం డిజిటల్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.