ఏపీఎస్‌ఆర్‌టీసీకి మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది.. 2024 సంవత్సరానికి డిజిటల్ చెల్లింపు ద్వారా టికెట్ల జారీ అంశంలో ఏపీఎస్ఆర్టీసీని ప్రతిష్టాత్మక “స్కోచ్” అవార్డు వరించింది.. సంస్ధ తరఫున స్కోచ్ అవార్డును అందుకున్నారు ఏపీఎస్‌ఆర్టీసీ ఛీఫ్ ఇంజనీర్ వై.శ్రీనివాసరావు.. బస్సులలో డిజిటల్ పద్ధతిలో టికెట్ల జారీ అంశంలో స్కోచ్ అవార్డు వచ్చినట్టు ఏపీఎస్‌ఆర్టీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.. 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక అయినట్టు తెలియజేయడానికి సంతోషిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్న ఏపీఎస్‌ఆర్టీసీ.. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు మరియు కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశపెట్టుట, In Busలో డిజిటల్ టికెట్లు జారీ చేయుట, సంస్థ అన్ని బస్సులలో ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటు చేయుట ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకుందని తెలిపింది.. ఈ రోజు, ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తరపున సంస్థ చీఫ్ ఇంజినీర్ ఐటీ వై శ్రీనివాసరావు ఈ అవార్డును అందుకోవడం జరిగిందని ఏపీఎస్‌ఆర్టీసీ తన ప్రకటనలో పేర్కొంది.
ఏపీలో ఉద్యోగ విరమణ చట్ట సవరణ.. గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. ఏపీలో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు.. దీంతో, న్యాయాధికారుల ఉద్యోగ విరమణను 61 ఏళ్లకు పెంచుతూ చేసిన చట్ట సవరణకు ఆమోదముద్ర పడింది.. ఈ మేరకు సవరించిన చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించాలని న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది.. కాగా, ఏపీలో జ్యుడిషియల్ అధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల పదవీ విరమణ వయస్సు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ శాసనసభలో ఈ నెల 13వ తేదీన ప్రవేశపెట్టారు. ఇక, ఆ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది శాసనసభ… నవంబర్1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొంది ప్రభుత్వం.. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించారు.. తాజాగా, ఉద్యోగ విరమణ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్.
తీరాన్ని తాకిన ఫెంగల్ తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
ఫెంగల్ తుఫాన్ తీరాన్ని తాకింది.. పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకినట్టు ఐఎండీ ప్రకటించింది.. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తుఫాన్ తీరం తాకిన తర్వాత.. మహాబలిపురం-కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైనట్లు భారత వాతావరణ విభాగం పేర్కొంది.. దాదాపు 4 గంటల్లో తీరం దాటే ప్రక్రియ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఈ రోజు రాత్రి 11.30 గంటల సమయానికి.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.. ప్రధానంగా తమిళనాడుకు సరిహద్దు ప్రాంతాల్లో వర్షపు జోరు కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అధికంగా వర్షాలు కుడుస్తుండడంతో జనజీవనానికి అంతరాయం కలుగుతుంది.. వాగులు.. వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. స్వర్ణముఖి.. కాలంగి.. కైవల్యా నదులతో పాటూ బొగ్గేరు.. బీరా పేరు.. పంబలేరులలో నీటి ప్రవాహం పెరిగింది. కాలంగినది నీరు పులికాట్ కు చేరుతుండడంతో సరస్సు జలకళను సంతరించుకుంటోంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ఇక, ఫెంగల్ తుఫాన్ దెబ్బకు అల్లాడిపోతోంది డెల్టా… ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లలో ప్రభావం చూపిస్తోంది తుఫాన్.. డెల్టా ప్రాంతంలోని తెనాలి, బాపట్ల డివిజన్లతో పాటు, గుంటూరు డివిజన్‌లో వర్షాలు కురుస్తున్నాయి.. డెల్టా ప్రాంతంలో అనేక చోట్ల నేలకొరిగాయి వరి పంట.. నవంబర్ మాసంలో వచ్చే తుఫాన్లు డెల్టా ప్రాంతానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయని, ఆందోళన చెందుతున్నారు రైతులు.. కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, తుఫాన్ తీరం దాటే సమయంలో గంటలకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.. తిరుపతి, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది..
నల్లమలలో పెరిగిన పులులు, తోడేళ్లు చూశా.. మీ కుట్రలు ఎంత?
రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్, మోడీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం, సాగర్ కట్టేవాళ్లా అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దన్నారు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ పరిశ్రమలు అడ్డుకుని ఫాంహౌస్‌కు పోతారని విమర్శించారు. రైతు కష్టం నాకు తెలియదా అంటూ పేర్కొన్నారు. కొడంగల్‌లో పారిశ్రామిక పార్కులు నిర్మించి ఉద్యోగాలు తేవాలని తాను అనుకున్నానన్నారు. కానీ, లగచర్లలో గొడవ చేసి మంట పెట్టారన్నారు. బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి గిరిజనులు జైళ్లకు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కుట్రలు, కుతంత్రాలు సాగనివ్వను.. కొడంగల్‌లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. 25 వేల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు. నల్లమలలో పుట్టి పెరిగా.. మీ లాంటి గుంట నక్కలకు భయపడనన్నారు. పాలమూరు వాళ్లకు పని చేయడమే తెలుసు.. గొప్పలు చెప్పుకోరన్నారు. రైతులే మా బ్రాండ్ అంబాసిడర్లు అంటూ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలను దక్కించుకోవాలి.. సీఎం ఆదేశం
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను, న్యాయ నిపుణులను అప్రమత్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా గోదావరి జలాలపై ఉన్న అంతరాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పునర్వవ్యస్తీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉంది. ట్రిబ్యునల్ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభిప్రాయాలను, ఆధారాలను మాత్రమే సేకరించింది. త్వరలోనే ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ట్రిబ్యునల్ నిర్ణయం వెలువడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, ఏయే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను ఇప్పటికే ట్రిబ్యునల్‌కు సమర్పించారు.. జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని, వాటి ఆధారంగా ట్రిబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
బీజేపీ నుంచే మహారాష్ట్ర సీఎం.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచి వారం గడిచింది. అయితే, ఇంకా ముఖ్యమంత్రి ఎవరనేదానిపై క్లారిటీ రాలేదు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు, ముంబైలో రాష్ట్ర నేతలతో బీజేపీ, దాని మిత్ర పక్షాలు ఎన్సీపీ, శివసేనలు చర్చలు జరుపుతున్నాయి. తాజాగా డిసెంబర్ 05న కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ రోజే ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తుందని బీజేపీ ఈ రోజు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి ముఖ్యమంత్రి ఉంటారని, ఇతర మిత్రపక్షాలైన ఏక్‌నాథ్ షిండే శివసేనకి, ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కుతాయని చెప్పారు. “సమావేశంలో (మహాయుతి నాయకుడి ఢిల్లీ సమావేశం) మహాయుతి బిజెపి నుండి ముఖ్యమంత్రితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మరియు మిగిలిన రెండు పార్టీలకు ఉప ముఖ్యమంత్రులు ఉండాలని నిర్ణయించారు. ఆలస్యం జరగడం ఇది మొదటిసారి కాదు. మీకు గుర్తుంది, 1999లో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక నెల సమయం పట్టింది.’’ ఆయన అన్నారు.
డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం.. ప్రకటించిన బీజేపీ..
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డెడ్‌లైన్ పెట్టుకుంది బీజేపీ. కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవ తేదీని బీజేపీ ప్రకటించింది. అయితే, ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. డిసెంబర్ 05 సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఐకానిక్ ఆజాద్ మైదాన్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఏకంగా 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లలో గెలిచింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కూటమిలోని ఏక్‌నాథ్ షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నారు. బీజేపీ కూటమి ధాటికి ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి కేవలం 46 స్థానాలకే పరిమితమైంది. శివసేన ఠాక్రే వర్గం 20, ఎన్సీపీ శరద్ పవార్ 10 సీట్లలో గెలుపొందాయి. కాంగ్రెస్ 100 సీట్లకు పైగా పోటీ చేస్తే కేవలం 16 సీట్లలో మాత్రమే గెలిచింది.
రిలయన్స్‌పై భారీ జరిమానా విధించిన సెబీ.. ఏ తప్పు చేసిందో తెలుసా ?
మార్కెట్ నిబంధనలతో పాటు స్టాక్ బ్రోకర్ల నిబంధనలను ఉల్లంఘించినందుకు రిలయన్స్ సెక్యూరిటీస్‌పై సెబీ రూ.9 లక్షల జరిమానా విధించింది. రెగ్యులేటర్, స్టాక్ ఎక్స్ఛేంజీలు, NSE, BSE ద్వారా సెబీ-రిజిస్టర్డ్ షేర్ బ్రోకర్ రిలయన్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (RSL) అధీకృత వ్యక్తుల ఖాతాలు, రికార్డులు, ఇతర పత్రాల సబ్జెక్టివ్ ఆన్‌సైట్ పరిశీలన తర్వాత ఈ ఆర్డర్ వస్తుంది. స్టాక్ బ్రోకర్ నియమాలు, ఎన్‌ఎస్‌ఇఐఎల్ క్యాపిటల్ మార్కెట్ నిబంధనలు, ఎన్‌ఎస్‌ఇ ఫ్యూచర్ & ఆప్షన్స్ ట్రేడింగ్ నిబంధనలు ఆర్‌ఎస్‌ఎల్‌కి అవసరమైన పద్ధతిలో నిర్వహించబడుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ తనిఖీ నిర్వహించబడింది. ఈ తనిఖీ ఏప్రిల్, 2022 నుండి డిసెంబర్, 2023 వరకు నిర్వహించబడింది. తనిఖీ ఫలితాల ప్రకారం.. ఆగస్టు 23, 2024న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) RSLకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 47 పేజీల ఆర్డర్‌లో ఆర్‌ఎస్‌ఎల్, దాని అధీకృత వ్యక్తులు చేసిన అనేక ఉల్లంఘనలను సెబీ గుర్తించింది. క్లయింట్ ఆర్డర్ ప్లేస్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి తగిన మెకానిజమ్‌లను నిర్వహించకపోవడం, టెర్మినల్ లొకేషన్‌లలో అసమానతలు, ఇతర బ్రోకర్‌లతో పంచుకున్న ఆఫీసులలో ఐసోలేషన్ లేకపోవడం వంటివి ఉన్నాయి.
పుష్ప 2 రిలీజ్ ముందు ‘శిల్పా’ బ్యానర్ ఆటలు!
సరిగ్గా ఎన్నికల ముందు అప్పటి వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడం పెద్ద కలకలానికి దారితీసింది. ఎందుకంటే ఒకపక్క ఆయన చిన్న మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా శిల్పా రవిచంద్రా రెడ్డి తన స్నేహితుడు కాబట్టి వెళ్ళాను అంటూ పలుసార్లు క్లారిటీ ఇచ్చారు. ఇది అంతా జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం తర్వాత మెగా క్యాంప్ కి అల్లు క్యాంప్ కి మరింత దూరం పెరిగిందని ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్లో టీం శిల్పా అంటూ శిల్పా రవిచంద్ర రెడ్డి తో అల్లు అర్జున్ ఫోటో దిగిన ఒక ఫోటోని బ్యానర్ గా ప్రచురించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సాయంత్రానికల్లా ఆ బ్యానర్ ని తొలగించారు థియేటర్ యాజమాన్యం. ఎందుకు తొలగించారు అనే విషయం మీద క్లారిటీ లేదు ఎవరి నుంచి ఆదేశాలు రావడంతో తొలగించారు అనే విషయం మీద కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇది సార్ పుష్ప గాడి బ్రాండు.. షేకయ్యేలా అడ్వాన్స్ బుకింగ్స్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు రిలీజ్ రెడీ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తెరకెక్కించారు. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా పుష్ప 2 ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు హిందీలో దాదాపు 12,500 టికెట్లు కేవలం పివిఆర్ ఐనాక్స్ ద్వారా బుక్ అయినట్లు తెలుస్తోంది. మూడు గంటల వ్యవధిలో ఈ టికెట్లు బుక్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక జొమాటో ప్రారంభించిన డిస్ట్రిక్ట్ అనే యాప్ లో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దాంతో పాటు బుక్ మై షో లో కూడా బుకింగ్ ఓపెన్ అయ్యాయి. దాదాపుగా అనేక రికార్డులను బద్దలు కొడుతూ ఈ అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో ఇప్పటికే టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ రేట్ ల గురించి అనేక రకాలు చర్చలు జరుగుతున్నాయి. సాధారణ ప్రజలు చూసే విధంగా లేవని కామెంట్స్ వినిపిస్తుండగా సినిమా బడ్జెట్ ప్రకారం భారీగా ఖర్చుపెట్టి తీశారు కాబట్టి ఆ మాత్రం రేట్లు పెట్టకపోతే కష్టమే అంటున్నాయి సినీవర్గాలు.