ఏపీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అది.. నేను మంచోడినా..? చంద్రబాబు మంచోడా..?
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ చరిత్రలోనే మా హయాంలో జరిగిందే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటీవ్ ఇస్తామని చెప్పింది.. రూ.5.10 నుంచి రూ.2.49కి యూనిట్ ధర తగ్గింది.. మనకు 15 వే9ల మి.యూ. విద్యుత్ వినియోగం ఉంది.. దీని వల్ల లక్ష కోట్లు ఆదా చేయడం సంపద సృష్టి కాదా? అని ప్రశ్నించారు.. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంత మంచి ఆఫర్ వచ్చినప్పుడు.. దానిని పక్కన పెడితే మీరు నన్ను ఏమనేవారు? అని ప్రశ్నించిన జగన్.. సీఎం చంద్రబాబు తెలిసి తెలిసి చేస్తున్నది ధర్మేనా? అని నిలదీశారు.. ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.. ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వం(సెకి), రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమేనని స్పష్టం చేశారు జగన్.. చరిత్రలోనే నిలిచిపోయే అత్యంత చవకైన ఈ ఒప్పందంపై బురద జల్లడం దారుణం అన్నారు.. రైతులకు ఉచిత కరెంట్ అనేది ఒక కల.. దీనివల్ల రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.. చంద్రబాబు హయాంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా మారింది. డిస్కంలను నిర్వీర్యం చేశారాయన. చంద్రబాబు చేసిన సోలార్ పవర్ ఒప్పందాలు రూ.5.90తో చేసుకున్నారు. డిస్కంల అప్పులను 86 వేల కోట్లకు పెంచారు. మా హయాంలో డిస్కంలను నిలబెట్టే ప్రయత్నం చేశాం. పగటి పూటే రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వగలిగాం.. ఉచిత కరెంట్ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.. అయితే, ఆ టైంలో యూనిట్‌ను 2.40 నుంచి 2.50 రూ. చొప్పున సప్లై సేందుకు 24 బిడ్లు వచ్చాయి. కానీ, ఆ ప్రక్రియకు కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి.. కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారు.. దీనికోసం మేం కోర్టులో కూడా పోరాడాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు..
అదానీ వ్యవహారంపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!
సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారంపై స్పందించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై వివరణ ఇచ్చారు.. తాము ప్రభుత్వానికి ఆదాయం పెంచామని.. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఆదాయాన్ని ఆవిరిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. ఇక, ఇదే సమయంలో.. అదానీ కేసుల వ్యవహారంపై స్పందించారు.. అదానీపై నమోదైన కేసులో నా పేరు ఎక్కడా లేదన్నారు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రులను పారిశ్రామిక వేత్తలు కలుస్తారు.. పారిశ్రామిక వేత్తలను తీసుకు రావటం కోసం ప్రతి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు వైఎస్ జగన్.. ఐదేళ్ల కాలంలో అనేక అనేక మార్లు అదానీ కలిశారని తెలిపిన ఆయన.. ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా చేస్తున్నారని వెల్లడించారు.. అయితే, తనను అదానీ కలవడంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.. కేంద్ర ప్రభుత్వ, సేకి, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందాలు జరిగాయి.. మూడో వ్యక్తి లేరని స్పష్టం చేశారు.. అయితే, తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది.. ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 3కి.మీ వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కి.మీ, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంగా 480 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర-వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందన్నారు. ఇది శుక్రవారం ఉదయానికి తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా గంటకు 50-60 కి.మీ గరిష్టంగా 70 కి.మీ ఈదురుగాలుల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి (29-30) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల అతితీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్.. 22 పాయింట్లతో..
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.. వర్మ సోషల్ మీడియా పోస్ట్‌పై వరుసగా కేసులు నమోదు.. విచారణకు రావాలంటూ పోలీసుల నోటీసులు.. ఆ కేసులు క్వాష్ చేయాలంటూ.. మరోవైపు.. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వర్మ హైకోర్టు మెట్లు ఎక్కడం.. ఇంకో వైపు.. వర్మ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలించడం.. అజ్ఞాతంలో ఉండి.. వర్మ వీడియోలు రిలీజ్ చేయడం.. ఇలా వర్మ వ్యవహారం మీడియాలో.. సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. అయితే, ఈ వ్యవహారంపై మరోసారి వరుస ట్వీట్లతో.. 22 పాయింట్లు లేవతన్నారు ఆర్జీవీ.. నా కేసు-RGV అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు పెట్టిన ఆయన.. జాతీయ మీడియాతో పాటు తెలుగు మీడియాను ట్యాగ్ చేస్తూ.. 22 పాయింట్లు లేవనెత్తారు..
శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి..! దూకుడు పెంచిన సిట్
శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిపోయింది సిట్.. కొంతకాలం ఈ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్న సిట్.. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసింది.. ఈ రోజు శ్రీవారి ఆలయంలోని పోటులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది.. ఆలయంలోని బూందీ పోటుని తనిఖీ చేసింది సిట్ బృందం.. లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై పోటు కార్మికుల వద్ద వివరాలు సేకరించారు సిట్ అధికారులు.. అంతేకాకుండా పోటు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.. అయితే, దర్యాప్తుని గోప్యంగా నిర్వహిస్తున్నారు సిట్ అధికారుల బృందం..
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం
మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేశారు. ఈ క్రమంలో వాదనలు జరగగా.. కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కొండా సురేఖకు సమన్లు జారీ చేసిన కోర్టు.. వచ్చే నెల 12 తేదీన హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
తప్పు చేశాడు కనుకే భయపడుతున్నాడు.. కేటీఆర్పై కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ సభా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అధికారులపై దాడులు చేయడానికి రైతులను ఉసిగొలుపుతున్నారని అన్నారు. రైతులకు పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాల నియామకాలు ఇవ్వకుండా 10 సంవత్సరాలు ఏం చేశారు…? గాడిదలు కాసారా…? అని దుయ్యబట్టారు. విద్యా వ్యవస్థను నాశనం చేసి, బ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు. హరీష్ రావుకు పిచ్చికుక్క కరిసినట్టు మాట్లాడుతున్నాడు.. బోనస్ ఇస్తామంటే హరీశ్ రావు అంతా బోగస్ అంటున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ.. విమర్శలు చేయడానికే బీఆర్ఎస్ ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వేల ఎకరాల భూములు కొల్లగొట్టి, వేల కోట్లు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. నీతి నిజాయితీ అని బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే లేదు.. పార్టీ చేసిన విధ్వంసం.. అవినీతి, అక్రమాలు వల్ల వీళ్ళ పాపాలు పండుతాయని తెలిసి ఆ పాపాలు తనకు అంటోద్దని తాను బయటకు వచ్చానన్నారు. జనగాం ఎమ్మెల్యే 10 లక్షల పనిచేసిన తాను ముక్కు నేలకు రాస్తానని తెలిపారు.
అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్‌నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది. లేదు.. లేదు.. బీజేపీకే సీఎం పీఠం దక్కాలంటూ కమలనాథులు పట్టుబడుతున్నారు. ఇలా దాదాపుగా 8 రోజులుగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఉత్కంఠ మాత్రం వీడలేదు. తాజాగా ఇదే వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీనే సొంతం చేసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. తాజా సమావేశంలో ఏక్‌నాథ్ షిండేను ఒప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షిండే కూడా వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
శనివారం దువా లిపా సంగీత కచేరీ.. ముంబై పోలీసుల కీలక నిర్ణయం
ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ చుట్టూ ఉన్న రహదారులను శనివారం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భరత్ నగర్ జంక్షన్ నుంచి కుర్లా వైపు వాహనాలను అనుమతించబోమని ముంబై ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బాంద్రాలోని ఖేర్వాడి గవర్నమెంట్ కాలనీ నుంచి యూటీఐ టవర్స్ వైపు వెళ్లే రహదారిని మూసేశారు. సంగీత కచేరీకి భారీ సంఖ్యలో ప్రజలు రానున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు కచేరీ ప్రారంభం కానుంది. భారీ ఇబ్బందులు తలెత్తనున్న నేపథ్యంలో ముంబైలో సగం దారులు మూసేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
భారతీయ సంస్కృతి ప్రపంచం మొత్తం కనిపిస్తుంది.. వీడియో పంచుకున్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తన విదేశీ పర్యటనలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక చిత్రాల ద్వారా రూపొందించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను పంచుకుంటూ.. ప్రధాని మోడీ క్యాప్షన్‌లో ” భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది!.. నేను ఎక్కడికి వెళ్లినా, నా దేశ చరిత్ర, సంస్కృతి పట్ల నాకు అపారమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది.” అని రాసుకొచ్చారు. ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలపై ఎక్స్‌లో పంచుకున్న వీడియోలో.. ఇటీవలి విదేశీ పర్యటనల సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఇచ్చిన ప్రదర్శనలను రూపొందించారు. అందులో ఆస్ట్రియాలో వందేమాతరం పాడటం, పోలాండ్, మాస్కోలలో గర్బా ప్రదర్శనలు, కజాన్ (రష్యా), భూటాన్‌లో దాండియా రాస్, సింగపూర్‌లో భరతనాట్యం, లావోస్, బ్రెజిల్‌లలో రామాయణం, ఇతర కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రధాని షేర్ చేసిన వీడియోలో మోడీని ప్రస్తావిస్తూ భూటాన్ కళాకారుల జానపద గీతం కూడా ఉంది.
తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పుష్ప 2 సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. మొత్తంగా 3 గంటల 20 నిమిషాలు రన్ టైమ్ తో వస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా నవంబర్ 29 అనగా శుక్రవారం ముంబై లోమద్యాహ్నాం 2.00 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 30 శనివారం చిత్తూరు లో భారీ ఎత్తున చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పైతర్జన భర్జనలు జరుగుతున్నాయి. దాదాపుగా లేనట్టే అని టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. మొదట యూసఫ్ గూడాలో చేసేందుకు నిర్ణయించిన అనుమతులు రాలేదని తెలుస్తోంది. ఇటీవల కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్, ఈ సినిమాలో మరొక సాంగ్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు భాషల్లో డిసెంబర్ 5 న 12000 థియేటర్ లలో రిలీజ్ కానుంది.
యంగ్ హీరో ‘గల్లా అశోక్’ సక్సెస్ టూర్..
గతవారం మూడు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు థియేటర్స్ లోవిడుదలయ్యాయి. వేటికవే సెపరేట్ జోనర్స్ లో తెరకెక్కాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ విభిన్న కథాంశంగా, మాస్ యాక్షన్ నేపంథ్యంతో వచ్చిన ఈ సినిమా రిలీజ్ రోజు డీసెంట్ టాక్ తెచ్చుకుంది. గల్లా అశోక్ ‘హీరో’ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా పరిణితి చెందాడు, ఎమోషన్స్ బాగా పలికించాడు, స్కీన్ పై అందంగా కనిపించాడు అనే మాట ఆడియన్స లో వినిపించింది. ఇదిలా ఉండగా డే -1 అంతంత మాత్రంగానే ఉన్న ఈ సినిమా కలెక్షన్స్ రెండవ రోజు కాస్త పుంజుకోగా మూడవ రోజు మరింత ఎక్కువ రాబట్టాయి. ప్రమోషన్స్ లో మెుదట నెమ్మదించిన మేకర్స్, కలెక్షన్స్ ఊపందుకోవడంతో సివిమాను మరింతగా ఆడియన్స్ లోకి తీసుకువెళ్ళేందుకు ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ముఖ్యంగా బీ,సీ సెంటర్స్ లో దేవకీ నందంన వాసుదేవ వీకెండ్స్ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఇక వర్కింగ్ డేస్ లోనూ డీసెంట్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. కమర్షియల్ సినిమా కి డివోషనల్ టచ్ ఇవ్వడం భారీ యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి..ఈ నెపధ్యంలో హీరో గల్లా అశోక్ తెలుగురాష్ట్రాల్లో సక్సెస్ టూర్ చేపట్టాడు. అందులో భాగంగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాడు. ఆ ఊరు ఈ ఊరు అని తేడా లేకుండా ఈ సక్సెస్ టూర్ లో గల్లా అశోక్ కు ప్రేక్షకులు బ్రమ్మరథం పడుతున్నారు. ఈ వారం మరే ఇతర సినిమాలు లేకపోవడంతో దేవకి నందన మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.