లిక్కర్ స్కాంపై ఎక్సైజ్ మంత్రి కీలక వ్యాఖ్యలు..
లిక్కర్ స్కాంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆయన.. ఇది జగమెరిగిన సత్యం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఏపీ లిక్కర్ స్కామ్ ముందు పీనట్స్ అంత ఉందని పేర్కొన్నారు.. లిక్కర్ స్కామ్ అతి పెద్ద స్కామ్ అని మొదటినుంచి మేం చెబుతున్నాం.. వైసీపీ నుంచి బయటకు వచ్చి మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ లావు పార్లమెంట్ లో చెప్పారు.. ఇదే విషయంపై కేంద్ర హోం మంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారని తెలిపారు.. విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్ ఏజెంట్ గా ఉన్నాడని చెప్పారన్న ఆయన.. వాళ్ల నాయకులే ఇదంతా చెబుతున్నారు.. లిక్కర్ లో ప్రతి దశలో స్కామ్ జరిగిందని ఆరోపించారు.. రాష్ట్రం ఈ స్కామ్ వల్ల వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు మంత్రి కొల్లు.. దీనివల్ల పక్క రాష్ట్రాలు బాగుపడ్డాయన్న ఆయన.. 99 వేల కోట్లు నగదు లావాదేవీలు జరిగాయి.. లిక్కర్ స్కామ్ పై సీఐడీ, సిట్ విచారణ జరుగుతోందన్నారు..
పిఠాపురంపై పవన్ కల్యాణ్ రివ్యూ.. కీలక సూచనలు
పిఠాపురం అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇకపై వరుసగా సమీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పేషి అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో ఈ రోజు నియోజవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై రివ్యూ నిర్వహించారు పవన్. అధికారులతో రివ్యూలో కీలక సూచలను చేశారు.. పిఠాపురం నియోజక వర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు.. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల మూలంగా పోలీస్ శాఖ చులకన అవుతోందన్న ఆయన.. ప్రతివారం పిఠాపురం అభివృద్ధిపై సమీక్ష చేస్తానని తెలిపారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలని సూచించారు డిప్యూటీ సీఎం పవన్.. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. వేసవిలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండ కూడదు.. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలన్నారు. అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేశాను.. పిఠాపురం – ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగాం.. రూ.59.7 కోట్లు నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు.. ఇక, ఉపాధి హామీ పథకంలో రూ.40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టాం.. 431 గోకులాలు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చాం.. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సీహెచ్‌సీ నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచాం.. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయని సమీక్ష సమావేశంలో వెల్లడించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
పోలవరం నాకు సెంటిమెంట్.. ఎక్కువ బాధ పడేది నేనే..
పోలవరం నాకొక సెంటిమెంట్.. ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధ పడేది నేనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడిచి పెట్టకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తాం.. తర్వాతనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పోలవరం పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన సీఎం నిర్వాసితులతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 4,311 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదని… కనీసం మీ సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల అకౌంట్లలో 829 కోట్లు జమ చేశామని తెలిపారు.. 2019లో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండుంటే 2020కి ప్రాజెక్టు పూర్తయ్యేదని.. ఆలస్యం చేయడం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయాందని తెలిపారు.. 400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిందని.. ఇప్పుడు మళ్లీ .990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మిస్తున్నాం అని వెల్లడించారు.
కాంట్రాక్టర్లకు సీఎం వార్నింగ్.. అలా జరిగితే బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం..!
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు సీఎం.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ను 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ఇందుకుగాను కాంట్రాక్టర్లు వారికి కేటాయించిన పనులను నిర్దేశించిన సమయానికంటే ముందుగానే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి నెలాఖరుకు కాంట్రాక్టర్లకు నిర్దేశించిన పనులలో కొంతమంది కాంట్రాక్టర్లు వెనుకబడి ఉండడం, కొందరు సమావేశానికి హాజరు కాకపోవడంపై ముఖ్యమంతి స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ అని దీని దృష్ట్యా పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు దశలవారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డయాఫ్రమ్ నిర్మాణాన్ని 2025 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని, రైట్ మెయిన్ కెనాల్ కనెక్టవిటీలను జులై, 2026 నాటికి పూర్తిచేయాలన్నారు. ఈసీఆర్ఎఫ్-గ్యాప్ 1 పనులను 2026 మార్చి లోగా పూర్తి చేయాలన్నారు. ఈసీఆర్ఎఫ్-గ్యాప్ 2 పనులను 2027 డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశించినప్పటికీ గోదావరి పుష్కరాల కంటే ముందుగానే 2027, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి, జాతికి అంకితం చేసేలా అధికారులు, కాంట్రాక్టర్లు పనిచేయాలన్నారు. అర్హులైన ప్రతీ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భూ సంస్కరణలు.. అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసిన సర్కార్
భూ సంస్కరణల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. జిల్లా ఇంఛార్జ్ మంత్రి చైర్మన్ గా.. జిల్లా మంత్రి.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే.. జాయింట్ కలెక్టర్.. ఆర్జీవో సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ఇక, ఈ అసైన్మెంట్ కమిటీల్లో ప్రత్యేక ఆహ్వానితుడుగా ఆ ప్రాంత ఎమ్మెల్సీ కూడా ఉండనున్నారు.. ప్రభుత్వ భూమిని గుర్తించడం.. పేదలకు భూమి ఇవ్వడం.. ఆయా జిల్లాలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం అసైన్మెంట్ కమిటీల ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్.. అసైన్మెంట్ కమిటీల ఏర్పాటుతో భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టే విధంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది.. కాగా, గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయి.. అవకతవకలు జరిగాయని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశాలను ప్రస్తావించిన విషయం విదితమే..
తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిపై అసెంబ్లీలో వేడివేడి చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో తపమంటున్నాయని మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వంపై అవరోధాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటనపై శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఆ ఘటన వెనుక బీఆర్ఎస్ నేతలే ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి భూసేకరణను అడ్డుకున్నారని అన్నారు. ఫార్మా పరిశ్రమల ద్వారా వేలాది ఉద్యోగాలు లభిస్తాయని తెలిసినా, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ప్రతిపక్షాలు అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుతున్నామని, అయితే ప్రతిపక్షాలు ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించడం విడ్డూరంగా ఉందని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కుదరకుండా ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర నిధులపై బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మధ్య కేంద్ర నిధులపై ఆసక్తికరమైన చర్చ చోటుచేసుకుంది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయించిందని, బీబీ నగర్ ఎయిమ్స్ వంటి ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తరచూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం గత పదేళ్లలో అనేక నిధులు కేటాయించిందని, తమిళనాడులో డీఎంకే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పాలనలో నడుస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే తన ప్రయాణాన్ని ప్రారంభించిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా ప్రాజెక్టులు తెలంగాణకు మంజూరు చేసిందా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. డీలిమిటేషన్ అంశంపై రాహుల్ గాంధీ తన స్పష్టమైన వైఖరి ప్రకటించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సమాధానంగా మంత్రి శ్రీధర్ బాబు, డీలిమిటేషన్‌పై రాష్ట్ర బీజేపీ నేతలు తమ నిర్ణయం చెప్పాలని సవాలు విసిరారు.
ఇమ్మిగ్రేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఇమ్మిగ్రేషన్ బిల్లును లోక్‌సభ ఈరోజు (మార్చి 27) ఆమోదించింది. చొరబాటు, అక్రమ వలసలను ఆపడం లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ బిల్లు పేరు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ బిల్లు 2025. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధి కోసం వస్తున్న వలసదారులను మేము స్వాగతిస్తామని హోంమంత్రి లోక్‌సభలో వెల్లడించారు. విద్య, వ్యాపారం, పరిశోధన కోసం దేశానికి వచ్చే వారిని మేము స్వాగతిస్తాము. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది ప్రధాని మోడీ లక్ష్యం. అందుకే చాలా పాత చట్టాలను రద్దు చేశామన్నారు. వలస అనేది ఒక ప్రత్యేక సమస్య కాదు. దేశంలోని అనేక సమస్యలు దీనితో ముడిపడి ఉన్నాయి. జాతీయ భద్రత దృష్ట్యా, దేశ సరిహద్దులోకి ఎవరు ప్రవేశిస్తారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశ భద్రతకు హాని కలిగించే వారిపై తీవ్రంగా వ్యవహరిస్తామని అన్నారు. ఈ బిల్లు దేశ భద్రతను బలోపేతం చేస్తుందని, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు సహాయపడుతుందని కేంద్ర హోం మంత్రి అన్నారు.
కర్ణాటకలో పాల ధరల పెంపు.. లీటర్ పాలపై రూ. 4
కర్ణాటక ప్రజలు ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో చాలా సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి లీటరుకు రూ. 4 పెంచుతున్నట్లు మంత్రి కె.ఎన్. రాజన్న గురువారం ప్రకటించారు. పాల సంఘాలు, రైతుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. కాగా.. కర్ణాటకలో పాల ధర పెరగడం ఇది మూడోసారి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని బ్రాండ్ పాలు, వాటి ఉత్పత్తులపై రూ. 5 పెంచాలంటూ డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ రూ. 4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) చైర్మన్ భీమా నాయక్ పాల ధర పెరుగుదలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రస్తుతం అమ్ముతున్న పాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధరకు ఉన్నాయి. గుజరాత్‌లో 1 లీటరు పాలు రూ. 53, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రూ. 58, ఢిల్లీ, మహారాష్ట్రలో రూ. 56, కేరళలో రూ. 54 ధర ఉన్నాయి. కర్ణాటకలో లీటరు పాలు రూ. 42కి అమ్ముతున్నారు.” అని అన్నారు. ఈ ధర పెరుగుదల నిర్ణయం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నట్లు భీమా నాయక్ తెలిపారు. పాల ఉత్పత్తి చేసే రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందువల్ల.. రైతులకు మరింత లాభం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పెరిగిన రూ. 4 మొత్తం రైతులకు మాత్రమే వెళ్ళిపోతుంది” అని ఆయన స్పష్టం చేశారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కు ఆర్బీఐ షాక్.. రూ. 75 లక్షల జరిమానా.. ఎందుకంటే?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై కొరడా ఝుళిపిస్తోంది. రూల్స్ పాటించని బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతు లైసెన్స్ లను రద్దు చేస్తుంది. భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర బ్యాంక్ ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు బిగ్ షాక్ ఇచ్చింది. నిబంధనలు పాటించని కారణంగా భారీ ఫైన్ వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు రూ.75 లక్షల జరిమానా విధించింది. కేవైసీ (KYC)కి సంబంధించి 2016లో ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించని కారణంగా హెచ్‌డీఎఫ్‌సీపై ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ అండ్ సింధు బ్యాంకుపై కూడా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఈ బ్యాంకుకు రూ. 68 లక్షల ఫైన్ విధించింది. అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం, ఆర్థిక చేరిక మార్గదర్శకాలను నివేధించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుపై ఫైన్ విధించింది. ఈ రెండు బ్యాంకులపై తీసుకున్న ఈ చర్య ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం చూపించదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
నడుము అందాలతో హీటు పుట్టిస్తున్న ప్రియాంకచోప్రా
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లోనే అత్యధికి రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా ఆమెకు పేరుంది. ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలోనే ఉంటున్న ఈ బ్యూటీ.. ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇక్కడకు వచ్చి షూటింగ్ చేసుకుని తిరిగి వెళ్లిపోతోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీతో ఆమెకు మరింత ఫేమ్ రావడం ఖాయం అని అంటున్నారు. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ ను అప్ లోడ్ చేస్తూనే ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి బ్రాలో అందాలను మొత్తం పరిచేసింది. ఇందులో జీన్ ప్యాంట్ వేసుకుంది. నడుము అందాలతో పాటు ఎద పరువాలు చూపిస్తూ రచ్చ చేసింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తల్లి అయినా సరే తన తన అందం చెక్కు చెదరలేదని ఈ ఫొటోతో నిరూపించేసింది. ఇంత అందాలు చూపించిన తర్వాత ఆ ఫొటో వైరల్ కాకుండా ఉంటుందా. వయసు పెరిగినా సరే ప్రియాంక అందాలు తగ్గలేదని.. గ్లోబల్ బ్యూటీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.
‘రామజన్మభూమి’ వాచ్ తో సల్మాన్ ఖాన్..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్ కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. డైరెక్టర్ ఏ.ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దీన్ని బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ టైమ్ లోనే సల్మాన్ ఖాన్ తాజాగా ఇన్ స్టాలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన రామజన్మభూమి ఎడిషన్ వాచ్ పెట్టుకుని కనిపించారు. ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయిపోయాయి. సాధారణంగా సల్మాన్ ఎప్పుడూ ఇలాంటి వాచ్ లు పెట్టుకోలేదు. ఈ రామజన్మభూమి వాచ్ లిమిటెడ్ ఎడిషన్. ఈ వాచ్ లో రామజన్మభూమి, రాముడు, హనుమంతుడు, సీతాదేవి లాంటి సింబల్స్ ఉన్నాయి. దీని ఖరీదు రూ.61లక్షల దాకా ఉంటుంది. జాకోబ్ కంపెనీకి చెందిన ఈ ఎడిషన్ వాచ్ అతికొద్ది మంది మాత్రమే పెట్టుకుంటారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేతికి కనిపించడంతో దీనిపై చర్చ జరుగుతోంది. ప్రమోషన్ కోసమే ఇది పెట్టుకున్నాడంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.