టీడీపీ కౌంటర్ ఎటాక్.. సత్యవర్ధన్ కిడ్నాప్ వీడియో విడుదల..
విజయవాడ జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను పరామర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. అయితే, జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగింది తెలుగుదేశం పార్టీ.. టీడీపీ సీనియర్ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. ఆ సమావేశంలో సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసిన దృశ్యాలు విడుదల చేశారు.. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి హైదరాబాద్‌కు వల్లభనేని వంశీ తీసుకెళ్లారని తెలిపారు టీడీపీ నేతలు.. ఈ నెల 11న హైదరాబాద్ మైహోం బుజాలో వంశీ వెంట సత్యవర్ధన్ ఉన్నారని.. పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తి చేయాలనుకుంటే ఊరుకునేదిలేదని వార్నింగ్ ఇచ్చారు.. సత్యవర్ధన్‌ను ఎలా అపహరించారో సీసీ కెమెరా దృశ్యాలే సాక్ష్యం అన్నారు.. వంశీతో పాటు అందరి చిట్టాలు బయటికొస్తాయి.. ప్రశాంతమైన కృష్ణాజిల్లాలో అల్లర్లకు ప్రయత్నిస్తే సహించబోమని హెచ్చరించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై వైఎస్ జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.. ఇక, నేరస్థులకు జగన్ మద్దతిస్తున్నారని ఆరోపించిన ఆయన.. మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని నిలదీశారు.. మీరు చేసిన అరాచకాలన్నీ బయటకొస్తాయి.. పోలీసుల బట్టలు విప్పతీస్తారా? చట్టం ఎవర్నీ వదలదు అని వార్నింగ్ ఇచ్చారు.. మీ బెదిరింపులకు భయపడం.. కూటమి ప్రభుత్వంలో కక్షసాధింపులు ఉండవని స్పష్టం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.
నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా..? జగన్‌ను నిలదీసిన లోకేష్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి నారా లోకేష్.. విజయవాడ జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, టీడీపీపై విమర్శలు చేశారు.. వంశీపై తప్పుడు కేసులు పెట్టారని జగన్ వ్యాఖ్యానించారు.. ఇక, జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా.. స్పందించారు నారా లోకేష్.. జగన్ వ్యాఖ్యలు.. గతంలో గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి దృశ్యాలను కలిపి వీడియో షేర్ చేసిన లోకేష్.. “నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు?” అంటూ ఎద్దేవా చేశారు.. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్‌డీ చేసినట్టు ఉన్నారు అంటూ దుయ్యబట్టారు.. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి అని సూచించారు.. 100 మందికిపైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారని గుర్తుచేశారు.. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది అంటూ మండిపడ్డారు మంత్రి నారా లోకేష్..
రేపు గుంటూరు మిర్చి యార్డ్‌కు వైఎస్ జగన్.. కీలక వ్యాఖ్యలు చేసిన అంబటి
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. రేపు గుంటూరులో పర్యటించనున్నారు.. గుంటూరు మిర్చి యార్డును సందర్శించనున్న ఆయన.. రైతులతో మాట్లాడనున్నారు.. మిర్చి పండించడానికి పడిన కష్టాలు.. ప్రస్తుతం మిర్చి అమ్మేందుకు పడుతోన్న బాధలను తెలుసుకోనున్నారు.. వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. రేపు గుంటూరు మిర్చి యార్డు లో మాజీ సీఎం జగన్ పర్యటిస్తారు… రేటు లేక అవస్థలు పడుతున్న ,రైతుల గోడు వినడానికి జగన్ వస్తున్నారని తెలిపారు.. ఆసియాలోనే అతి పెద్ద మిర్చి యార్డు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతుంది… యార్డులో, మిర్చి రైతులు దగా పడుతున్నారు.. వరికి, పత్తికి రేటు లేక రైతులు విలవిలలాడి పోతున్నారు.. గతంలో తొమ్మిది వేలు పలికిన పత్తి ఇప్పుడు నాలుగు వేలకు కొనేవాడు లేడు.. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రైతు దగ్గర ధాన్యాన్ని, కొనుగోలు చేశాం… రైతాంగానికి భరోసా ఇచ్చాం.. ఇప్పుడు మిర్చి పరిస్థితి ,మిర్చి రైతు పరిస్థితి దారుణంగా ఉందన్నారు.. ఇప్పుడు తేజ రకం మిర్చి రూ. 12 వేలు పలుకుతుంది.. వైసీపీ ప్రభుత్వంలో ఇదే రకం మిర్చి 23 వేల రూపాయలు పలికిందన్నారు అంబటి.. మిర్చి రైతుల కష్టం పై ప్రభుత్వం నుండి సుయ్ లేదు, సయ్ లేదు… అందుకే రైతులను ఓదార్చేందుకు, ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యలు తెలిపేందుకు మాజీ సీఎం జగన్ వస్తున్నారు… రైతుల గోడు జగన్ విన్నాక , పరామర్శించిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం అన్నారు.. ఇప్పటి వరకు ప్రభుత్వానికి టైం ఇచ్చాం.. ఇకపై రైతుల పక్షాన పోరాడతాం.. రైతుల తరపున వకాల్తా పుచ్చుకుంటాం అన్నారు.. మరోవైపు, మిర్చి రైతుల పరామర్శకు ఎన్నికల కోడ్ కి సంబంధం లేదన్నారు అంబటి.. మేం పబ్లిక్ మీటింగ్ లు పెట్టడం లేదు.. రైతుల సమస్య మాత్రమే వింటాం.. రైతులకు అండగా ఉంటాం అన్నారు.. ఇక, చంద్రబాబు కి వయసు వచ్చింది కానీ సిగ్గు రాలేదు.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. సంపద ఎలా సృష్టించాలో చంద్రబాబు కి తెలియదట… జగన్ వస్తున్నారు అని తెలియగానే సీఎంలో కదలిక వచ్చినట్లు ఉంది.. అర్జంట్ గా , రైతుల సమస్య గుర్తుకు వచ్చింది.. సమీక్షలు పెడుతున్నారు.. జగన్ వచ్చి వెళ్లాక ఐయినా రైతులకు మంచి చేస్తే మంచిదే అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..
వల్లభనేని వంశీ కేసు.. ఎక్స్‌లో వైసీపీ బిగ్ బ్లాస్ట్..!
బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది వైసీపీ.. టీడీపీ విమర్శలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. బిగ్ బ్లాస్ట్ అంటూ ఎక్స్ లో పోస్ట్ చేసింది.. వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు చేస్తుందని.. గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు అంటూ ఆరోపించింది.. కోర్టు ముందు సత్యవర్ధన్ స్టేట్‌మెంటే అందుకు నిదర్శనం.. చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్దన్ ఫిబ్రవరి 10, 2025 నాటి స్టేట్‌మెంట్ ఇచ్చారు.. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడలేనన్న సత్యవర్ధన్.. టీడీపీ నాయకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం ఈ కేసులో సాక్షిగా తన వద్ద సంతకం తీసుకున్నానని వెల్లడించింది.. తనను ఎవరూ బలవంతం పెట్టలేదని కూడా కోర్టులో వెల్లడించారు.. కోర్టు ఎదుట సత్యవర్దన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇదీ.. సత్యమేవ జయతే.. అంటూ.. సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌ను కూడా జత చేస్తూ ట్వీట్ చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.
డిప్యూటీ సీఎంను కలిసిన తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి కావాల్సిన బడ్జెట్‌ను తయారు చేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అందజేశారు. తెలంగాణ విద్యా కమిషన్ విద్యా రంగంలోని వివిధ వర్గాలతో వరుస చర్చలు జరిపి వారి నుండి అనేకమైన సలహాలు సూచనలు తీసుకున్నట్లు విద్యా కమిషన్ తెలిపింది. గత ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేసిందని.. దీని ఫలితంగా అభ్యాస పేదరికం ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా రంగం దుస్థితి వలన ప్రజా, పౌర సమాజ సంస్థల నుండి ఒత్తిడి, అశాంతి పెరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. 2025-26 సంవత్సరములో విద్యారంగానికి బడ్జెట్‌ను పెంచాలని.. ప్రభుత్వం తగిన జోక్యం చేసుకోవాలని విద్యా కమిషన్ ఛైర్మన్ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో రాష్ట్ర బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును రూపొందించగల అభివృద్ధి ప్రాధాన్యతలకు దిశానిర్దేశం చేయడం కోసం ఈ బడ్జెట్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని పేర్కొన్నారు.
వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మైనర్ బాలిక మృతి
ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాక పనులన్నీ ఈజీ అయిపోయాయి. వాషింగ్ మెషిన్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఏసీలు, గీజర్లు విరివిగా వినియోగిస్తున్నారు. అయితే వీటి వాడకం ఒక్కోసారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ పరికరాలను ఉపయోగించే సమయంలో చిన్న పొరపాటు వల్ల విద్యుత్ అఘాతాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తూ ఓ బాలిక విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ లో చోటుచేసుకుంది. అలీ నగర్ ప్రాంతానికి చెందిన ఫాతిమా బేగం (17) ఇంట్లో వాషింగ్ మెషిన్ ఆపరేటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైంది. బట్టలు వేస్తుండగా వైర్లు చేతికి తగిలి బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఫాతిమా బేగం మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బహిరంగ లేఖ..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని తెలిపారు. అలాగే.. ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రాష్ట్రంలోని 15 యూనివర్సిటీలలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్స్‌తో పాటు.. బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందడం లేదని జాన్ వెస్లీ లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నారు.. నిధుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ల్యాబ్ పరికరాలు, హాస్టల్స్, మెస్, స్పోర్ట్స్, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు.
ఎల్లుండే రాజధానిలో ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీ సీఎం పదవి ఎవరికి?
ఎల్లుండి రాంలీల మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు కానున్నారనే దానిపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. రేపు బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తుంది. మరోవైపు.. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే నాయకులు పలువురు కేంద్ర మంత్రులు, భారత్‌లోని విదేశీ దౌత్య వేత్తలు హాజరు కానున్నారు.
దుమ్మురేపే ఫీచర్లతో.. స్టైలిష్ లుక్ లో టీవీఎస్ రోనిన్ 2025 విడుదల..
బైక్ లవర్స్ కోసం TVS కంపెనీ భారతీయ మార్కెట్లో ప్రతిసారి కొత్త, స్టైలిష్ మోడళ్లను తీసుకొస్తోంది. తాజాగా టీవీఎస్ కంపెనీ టీవీఎస్ రోనిన్ 2025 అప్ డేటెడ్ ఫీచర్లతో మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. 225 సిసి విభాగంలో ఈ బైక్ ను అప్ గ్రేడ్ చేసింది. 2025 TVS RONIN కొత్త కలర్స్, సేఫ్టీ ఫీచర్స్ అప్ డేట్ లతో వాహన ప్రియులను ఆకర్షిస్తోంది. బైక్ డిజైన్, ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ బైక్ గ్లేసియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్, మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. కొత్త టీవీఎస్ రోనిన్ 2025 ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.59 లక్షలుగా ఉంది. 2025 TVS రోనిన్ బైక్‌లో సూపర ఫీచర్లు, భద్రతా ఫీచర్లు అందించారు. ఇప్పుడు మిడ్ వేరియంట్ కూడా డ్యూయల్ ఛానల్ ABS వంటి భద్రతా ఫీచర్లతో వచ్చేసింది. దీనితో పాటు, LED హెడ్‌లైట్, LED టెయిల్ లైట్, కస్టమ్ ఎగ్జాస్ట్, ఎల్సీడీ స్పీడోమీటర్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, రెండు చక్రాలలో డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు బైక్‌లో అందించారు. TVS రోనిన్ బైక్ 225.9cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ బైక్ 20.4 PS శక్తిని, 19.93 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది.
సంతోషపడాలా? బాధపడాలా? అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు
అదిరే అభి హీరోగా స్వాతి మందల్ హీరోయిన్‌గా బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఈ క్రమంలో అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు సంతోషపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదు. నేను ఈ 23 ఏళ్లు కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతా, సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే అన్నీ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతీ శుక్రవారం ఓ ఆర్టిస్ట్ తలరాత మారిపోతుంది. ఈ శుక్రవారం మేం రాబోతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుందని అన్నారు.
మహకుంభమేళాలో పుణ్యస్నానం చేసిన పవన్ దంపతులు
ప్రయాగ్ రాజ్ మహకుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా గంగానదికి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి పవన్ కళ్యాణ్ దంపతులు హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశారు. ఇది మనందరికీ గొప్ప అవకాశం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మనం భాష లేదా సంస్కృతి విషయంలో భిన్నంగా ఉండవచ్చు, కానీ ఒక మతంగా, మనం అంతా ఒక్కటే. మహా కుంభమేళాను నిర్వహించినందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి రావాలనేది చాలా దశాబ్దాలుగా నాకున్న అతిపెద్ద కోరిక. ఈరోజు, నాకు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. మహా కుంభమేళాలో భక్తుల ప్రవాహం ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం నాడు కూడా దాదాపు 1.35 కోట్ల మంది స్నానాలు చేశారు. ఇప్పటివరకు 54.31 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహా కుంభమేళా నుండి భక్తులను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరోవైపు, మహా కుంభమేళా మీదుగా ప్రతి గంటకు 8 కి పైగా విమానాలు ఎగురుతున్నాయి. ఈ క్రమంలో విమానయాన సంస్థలు తమ ప్రయాణీకులకు ఏరియల్ వ్యూ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నాయి.