ఏపీ పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్.. 16న నేను ఏపీలో ఉంటా..
మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఏపీ ప్రభుత్వం.. ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.. అయితే, తన ఏపీ పర్యటనపై ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ.. ‘రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను.. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను.. ఆ తర్వాత, కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి.’ అంటూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ..
పొట్టి శ్రీరాములు విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్’గా నామకరణం.. నమూనాలను పరిశీలించిన సీఎం..
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.. ఇక, రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తులో నిర్మించనున్న అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఈ నమూనాలను సీఎం పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.. ఈ స్మృతి వనానికి గత నెల 3వ తేదీన మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విగ్రహ డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
నేను లై డిటెక్టర్ టెస్ట్ రెడీ.. మీరు సిద్ధమా? చంద్రబాబు, లోకేష్‌కు జోగి రమేష్ సవాల్..
ఏపీ ఫేక్ లిక్కర్ కేసు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు బయటకు రావడంతో ఆసక్తికరంగా మారగా.. నేను లై డిటెక్టర్ టెస్ట్ రెడీ.. మీరు సిద్ధమా? అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు జోగి రమేష్ సవాల్ చేశారు.. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన జోగి రమేష్.. తనపై సోషల్ మీడియా, కొన్ని మీడియా ఛానెల్స్ లో వచ్చే ఫేక్ వార్తలపై ఫిర్యాదు చేశారు.. జోగి రమేష్‌తో పాటు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి , రమేష్ యాదవ్ , వరుదు కళ్యాణి , పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు.. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఫేక్ బాబు ఫేక్ న్యూస్ తో రోజుకొక అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారు.. చంద్రబాబు విన్యాసాలు రాష్ట్ర ప్రజలు గమనించాలి.. నేను వాట్సాప్ లో ఛాట్ చేశానని ఓ ఫేక్ ప్రచారం చేశారు.. ఎల్లో మీడియా ఆ ఫేక్ ప్రచారం పై డిబేట్లు పెట్టింది అంటూ ఫైర్ అయ్యారు. నా సెల్ ఫోన్లు.. చంద్రబాబు, లోకేష్ కు ఇస్తా.. మీడియా సమక్షంలో ఏ అధికారికి ఇవ్వమన్నా నా సెల్ ఫోన్లు ఇస్తా అని సవాల్ చేశారు జోగి రమేష్.. రిమాండ్‌లో ఉన్న జనార్థనరావుతో ఓ వీడియో చేయించారని విమర్శించారు. అయితే, లై డిటెక్టర్ టెస్ట్ కు నేను సిద్ధంగా ఉన్నా.. చంద్రబాబు, లోకేష్ కు రెండు రోజులు టైమిస్తున్నా.. నా సవాల్ కు చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. టీడీపీ నేతలను కూడా కోరుతున్నా చంద్రబాబు, లోకేష్ తో మాట్లాడించి ఒప్పించండి.. జోగి రమేష్ మాట తప్పడు.. మడమ తిప్పడు అన్నారు.. ఎంత దిగజారిపోయావ్ చంద్రబాబు.. ప్రజలు నిన్ను గెలిపించి అధికారం ఇస్తే.. నీ అధికారాన్ని నన్ను లోపల వేయడానికి వాడుతున్నావ్.. అంటూ ఫైర్ అయ్యారు.. నన్ను ఇరికించాలని చూసి చంద్రబాబు పప్పులో కాలేశాడు.. ఇబ్రహీంపట్నంలో పుట్టినంత మాత్రాన జనార్థనరావుతో నాకు సంబంధం ఉన్నట్లేనా? అని ప్రశ్నించారు..
పంచాయతీల అభివృద్ధిపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి నాలుగు గ్రేడులుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ తెలిపింది. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలి అన్నారు. నాలుగు గ్రేడుల పంచాయతీల విధానం కచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుంది. రూర్బన్ పంచాయతీలు గుర్తించినవాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తాము అన్నారు. ఇక, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు పవన్ కల్యాణ్… స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా సంస్కరణలు తీసుకువచ్చాము అని తెలిపారు. వీటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది పాత్ర కీలకం అన్నారు పవన్. పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు కలుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పన చేపట్టడంతో అందరూ సంతోషంగా ఉన్నామని, మరింత ఉత్తేజంతో విధులు చేపడతామని వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి… వాటిపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసే ఉండాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భౌగోళికంగా విడిపోయినా.. మనుషులుగా కలిసి ఉన్నామన్నారు.. బంధుత్వాలు, స్నేహలు ఆంధ్ర, తెలంగాణ మధ్య అలాగే ఉన్నాయని అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసి ఉండాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. బీఆర్ఎస్, బీజేపీ ఒకటై ఆర్డినెన్స్ అడ్డుకున్నాయని, కచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అంటున్నారు. చీకటి తర్వాత వెలుగు ఉన్నట్లుగా ఏపీ కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుందని వ్యాఖ్యానించారు. రాత్రి పగలు రెండు ఉంటాయని అన్నారు. సముద్ర తీరంలో ఉన్న విశాఖ భవిష్యత్తులో మహానగరంగా అభివృద్ధి చెందుతుందని, ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు తెలంగాణ పీసీసీ ఛీప్ మహేష్ కుమార్ గౌడ్..
సుప్రీంకోర్టులో రేపే బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ.. ఏం జరుగుతుందో..?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9 పై స్టే విధించింది రాష్ట్ర హైకోర్టు.. అయితే, హైకోర్టు స్టే విధించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర సర్కార్.. ఈ మేరకు సోమవారం దాదాపు 50 పేజీలకుపైగా సమగ్రమైన సమాచారంతో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పులోని అంశాలపై కూలంకషంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది..అయితే, 42 శాతం బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై రేపు జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనుంది.. కోర్టు నంబర్ 3లో 49వ కేసుగా లిస్ట్ చేయబడింది.. అయితే, వచ్చే వారం సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు ఉన్న నేపథ్యంలో.. త్వరితగతిన ఈ వారమే లిస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.. దీంతో, రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రాబోతోంది.. దీంతో, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలాంటి వాదనలు కొనసాగనున్నాయి.. అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..
లక్నో ఫ్యాక్టరీ నుంచి యాక్షన్‌కు సిద్ధమైన “బ్రహ్మోస్ మిస్సైల్స్”
స్వదేశీ టెక్నాలజీ, ఆత్మ నిర్భర భారత్‌లో కీలక మైలురాయికి చేరుకుంది. కొత్తగా లక్నోలో ప్రారంభించిన ఫెసిలిటీతో తయారైన ‘‘బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి’’ మొదటి బ్యాచ్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జరగబోయే వేడుకలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు హాజరుకానున్నారు. యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లోని భట్‌గావ్ లో ఉన్న లక్నో యూనిట్‌ను మే 11న రక్షణ మంత్రి అధికారంగా ప్రారంభించారు. 80 హెక్టార్లలో సుమారుగా రూ. 300 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీంట్లో పెద్ద ఎత్తు క్షిపణులను తయారు చేస్తున్నారు. ఈ ప్లాంట్ ప్రతీ ఏడాది 80-100 క్షిపణుల్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత దీనిని 150 పెంచాలని ప్లాన్ చేస్తు్న్నారు. ఈ ప్లాంట్ దేశ రక్షణను బలోపేతం చేయడంతో పాటు విదేశాలకు ఈ క్షిపణుల్ని ఎగుమతి చేసే సామర్థ్యాన్ని మరింతగా పెంచింది. బ్రహ్మోస్ భారత్, రష్యాల జాయింట్ వెంచర్. భారతదేశానికి 50.5 శాతం, రష్యాకు 49.5 శాతం వాటాలు ఉన్నాయి. శనివారం జరిగే కార్యక్రమంలో లక్నో నుంచి మొదటి బ్యాచ్ క్షిపణుల అధికారిక డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
బీజేపీ రెండో లిస్ట్ రిలీజ్.. మైథిలి ఠాకూర్ పోటీ చేసేది ఇక్కడి నుంచే..
బీహార్ ఎన్నికలకు సమీపం దగ్గర పడుతున్నా కొద్ది రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా, బీజేపీ తన అభ్యర్థుల రెండో లిస్టును రిలీజ్ చేశాయి. 12 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షించిన జానపద గాయని మైథిలి ఠాకూర్ పేరు కూడా సెకండ్ లిస్టులో ఉంది. ఆమె రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరింది. మైథిలి ఠాకూర్ అలీనగర్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. రెండో జాబితాలో ఉన్న కీలక వ్యక్తుల్లో బక్సర్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా ఉన్నారు. ఈయనతో పాటు రోస్రా నుంచి వీరేంద్ర కుమార్, చాప్రా నుంచి చోటి కూమారి ఉన్నారు. బీజేపీ రెండో జాబితాలో ఎక్కువ మంది కొత్త ముఖాలకు ఛాన్స్ ఇచ్చింది. మిథిలాంచల్‌లో బీజేపీ క్రేజ్ సంపాదించుకోవడానికి మైథిలీ ఠాకూర్‌ను బరిలోకి దింపింది. 243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.
మావోల ‘‘లొంగు’’బాట.. రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ముందు ఆశన్న సరెండర్..
మావోయిస్టులకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. రేపు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ముందు ఆయన లొంగిపోతారు. ఆశన్నతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించనున్నారు. లొంగిపోయే మావోయిస్టుల్లో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజ్‌మన్, రనితతో సహా పలువురు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు. వీరంతా ఇప్పటికే, జగ్‌దళ్ పూర్ చేరుకున్నారు. లొంగుబాటు కార్యక్రమం కోసం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ సీఎంఓకు సమాచారం ఇచ్చారు. 1990లో మావోయిస్టుల్లో చేరిన ఆశన్న బాంబు తయారీ, ఆయుధాల తయారీ, గెరిల్లా వార్‌ఫేర్‌లో ఆరితేరారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర హత్య కేసులో పాటు మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఇతని ప్రమేయం ఉంది. ఈ లొంగుబాటుతో మరికొంత మంది మావోలు మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ పోలీసులు ముందు లొంగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావుతో పాటు మరో 60 మంది మావోలు లొంగిపోయారు. ఆయన ఫడ్నవీస్‌కు తన ఏకే -47 రైఫిల్‌ను అప్పగించారు. మల్లోజుల పై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఈయనపై రూ.6 కోట్ల రివార్డు ఉంది.
దీపావళికి BSNL బొనాంజా.. రూ.1కే అన్‌లిమిలెడ్ ప్లాన్
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ యూజర్ల కోసం దీపావళి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా (BSNL Diwali Bonanza Offer) పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త ప్లాన్ కేవలం రూ.1 కే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ కొత్త యూజర్లకు మాత్రమే వర్తించనుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్ నవంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కేవలం రూ.1తో 30 రోజులపాటు ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, అలాగే రోజుకు 100 ఉచిత SMS లభిస్తాయి. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్లు లేదా రిటైల్ స్టోర్స్‌లో సంప్రదించవచ్చు.
అలాంటి వాళ్లంతా పిచ్చోళ్లే.. బన్నీవాస్ షాకింగ్ కామెంట్స్
నిర్మాత బన్నీ వాసు ఈ మధ్య ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక కాంబోలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ లో బన్నీవాసు మాట్లాడారు. ఇందులో దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా.. చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్ లో పక్క సినిమాలను తొక్కేసి తమ సినిమాలను ఆడించుకోవాలని చాలా మంది చూస్తుంటారు. ఇలాంటి వాటిపై మీరేం స్పందించారు అని రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి బన్నీవాసు స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. పక్క సినిమాను తొక్కితేనే మన సినిమా ఆడుతుంది అనుకుంటే అంతకన్నా పిచ్చోళ్లు ఇంకెవరూ ఉండరు. సినిమా బాగుంటే రెండూ ఆడుతాయి. లేదంటే రెండూ ఆడవు. కొన్ని సార్లు తొక్కాలని చూస్తే చివరకు వాళ్ల సినిమా బాగున్నా సరే నెగెటివిటీ పెరిగి దెబ్బ పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏ సినిమాను తొక్కాలని చూసినా అది పిచ్చితనమే అవుతుంది. ఇక్కడ జీవితాలు పనంగా పెట్టి సినిమాలు చేస్తున్నాం. కాబట్టి ఒక సినిమాను తొక్కడం అంటే అది మనసున్నోళ్లు చేసేది కాదు. నా వరకు అయితే పక్క సినిమాలకు కూడా నా సినిమాలతో సమాన ప్రాధాన్యత ఇస్తుంటాను. ఇక్కడ అందరి సినిమాలు ఆడాలి. అందరూ బాగుండాలి అని కోరుకుంటానని తెలిపారు బన్నీవాసు.
హృతిక్ రోషన్ కు హైకోర్టులో ఊరట..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ వెబ్ సైట్లలో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్ మీద తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. హృతిక్ రోషన్ కు సంబంధం లేకుండా వాడుతున్న ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆర్డర్ వేసింది. ఈ కామర్స్ వెబ్ సైట్లలోనూ వాటిని తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అయితే ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో హృతిక్ ఫొటోలు, వీడియోలు వాడుతున్నారని.. వాటిని కూడా కంట్రోల్ చేయాలంటూ హృతిక్ తరఫు న్యాయవాది కోరారు. ఈ విషయంలో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమానులు వాడేవి వ్యాపార లాభం కోసం కాదని.. అది అభిమానం రూపంలో మాత్రమే అంటూ తెలిపింది. పైగా వాటిని వాడటం వల్ల ఇతరులకు నేర్పించాలనే ఉద్దేశమే ఉందే తప్ప.. అందులో ఎలాంటి లాభపేక్ష లేదు అని హైకోర్టు తెలిపింది. ఈ నడుమ చాలా మంది బాలీవుడ్ స్టార్లు ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. మొన్నటికి మొన్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, దీపిక పదుకొణె లాంటి వారు ఇలాంటి పిటిషన్లే వేశారు. రీసెంట్ గా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన వార్-2 పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నార్త్ లో పర్వాలేదు అనే కలెక్షన్లు తెచ్చుకుంది. ప్రస్తుతం హృతిక్ రెండు సినిమాల్లో బిజీగా ఉన్నారు.