ప్రభుత్వ కాలేజీలో నాణ్యమైన విద్య కోసం కొత్త ప్లాన్..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలకు సిద్ధంమైంది.. దీనిపై కీలక సూచనలు చేశారు మంత్రి నారాయణ.. ఇంటర్ తరగతుల నిర్వహణ ఎలా ఉండాలి, విద్యార్థులను ఎలా చదివించాలి, సబ్జెక్టుల వారీగా తీసుకోవలసిన ప్రాధాన్యత అంశాలపై పలు సూచనలు చేశారు నారాయణ .. ఇంటర్మీడియట్ బోర్డ్ కమిషనర్ కృతికా శుక్లా వినతి మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులకు వర్క్ షాప్ లో పాల్గొని కీలక అంశాలను పంచుకున్నారు.. అంతేకాదు.. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా నారాయణ గ్రూప్ నుంచి సహకారం అందిస్తామని వెల్లడించారు.. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించేలా అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు మంత్రి నారాయణ.. విజయవాడలో నిర్వహించిన వర్క్ షాప్ కు ఇంటర్ బోర్డు కమిషనర్ ఆర్జెడీలు, ఆర్ఐవోలు, ప్రిన్సిపాల్స్, ఇతర అధ్యాపకులు హాజరయ్యారు.. ఆ వర్క్ షాప్‌లో పాల్గొన్న మంత్రి నారాయణ.. కీలక సూచనలు చేశారు..
ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుంది
ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అసెంబ్లీలో వివిధ అంశాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేసిన ఆయన.. ఉద్యోగాలు, ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలు ఇచ్చేలా కొత్త విధానాలను రూపొందించాం అన్నారు.. మొదటిగా వచ్చిన 200 పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధానాలు ఉన్నాయి.. 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తాం.. అమరావతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తాం.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు కూడా ప్రత్యేకంగా ప్రోత్సాకాలు ఇచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మలచాలన్నది మా లక్ష్యంగా పేర్కొన్నారు. ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ రూపకల్పన చేస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్రప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసుకుని డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తామన్న ఆయన.. ఇలా ఓ 10 వేల మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరిగేలా చేస్తాం.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా ప్రతీ ఉత్పత్తికీ ఓ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం అన్నారు. క్వాలిటీ, ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం.. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఎంతగా ప్రోత్సహిస్తే అంతగా రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.. పండించే పంటలకు విలువజోడిస్తేనే ఎక్కువ ఆదాయం వస్తుంది.. విలువ జోడిస్తే ప్రపంచానికే ఫ్రూట్ బాస్కెట్ గా ఏపీ అవతరిస్తుందన్నారు.. ఇక ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని విధానం రూపోందించాం.. కొత్త పద్ధతుల్లో ఈ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు అవుతాయన్నారు.
లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు..
లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది అని కేటీఆర్ అన్నారు. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది.. దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడు.. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో రైతులు తమ ఆవేదన చెప్పుకున్నారు.. ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లను కొట్టి మిగతా పార్టీ వాళ్లను వదిలేశారు.. ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు.. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు.. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెబుతారు.. ఇక, సురేష్ అనే వ్యక్తి మా పార్టీ కార్యకర్తే.. ఆయనకు భూమి లేకపోయినా గొడవ చేశాడని అంటున్నారు.. కానీ సురేష్ కు భూమి ఉంది.. భూమి లేని వాళ్లే గొడవ చేశారంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ గ్రూప్-4 ఫలితాలు విడుదల..
తెలంగాణ గ్రూప్ 4 ఫలితాలు విడుదల అయ్యాయి. 8,180 పోస్టులకు 8,084 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. కాగా.. 8,180 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్-4 నియామక పరీక్ష నిర్వహించారు. తాజాగా.. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ తరవాత పోస్ట్‌లకి ఎంపికైన 8,084 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం.. మహేశ్‌కుమార్ ఎన్నిక
వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు. ఢిల్లీ తదుపరి మేయర్‌గా ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కోసం ఆప్-బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. కరోల్‌బాగ్‌లోని దేవ్‌నగర్ కౌన్సిలర్‌గా ఉన్న మహేశ్ ఖిచికి 133 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థికి 130 ఓట్లు వచ్చాయి. దీంతో స్వల్ప మెజార్టీతో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తంగా 265 ఓట్లు పోలవ్వగా.. రెండు ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు. ఎస్సీ సామాజికవర్గం నుంచి మూడో మేయర్‌గా మహేశ్ ఖిచి రికార్డు సృష్టించారు. ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, ఎన్‌డీ గుప్తా, బీజేపీకిచెందిన ఏడుగురు ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. నిరసనగా కాంగ్రెస్ కౌన్సిలర్ సబిలా బేగమ్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక కొత్తగా ఎన్నికైన మేయర్ ఐదు నెలలు మాత్రమే పదవిలో ఉంటారు.
ఫేజ్-2లో సగం అభ్యర్థులు కోటీశ్వరులే.. అత్యల్ప అభ్యర్థి ఆస్తి ఎంతంటే..!
జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది. ఇందుకోసం అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అయితే సెకండ్ ఫేజ్‌లో సగం మంది కోటీశ్వరులే పోటీ చేస్తున్నట్లుగా ఏడీఆర్ నివేదికను బట్టి తెలుస్తోంది. డజన్ల కొద్దీ కోటీశ్వరులు రెండో దశ పోలింగ్ కోసం పోరాడుతున్నారు. ఏడీఆర్ నివేదిక ప్రకారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫేజ్ 2లో పోటీ చేస్తున్న 522 మంది అభ్యర్థుల్లో 127 మంది కోటీశ్వరులే.
ట్రంప్ మిల్లర్ ఎంపికలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బందే..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. అయితే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆందోళన నెలకొంది. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌లోకి స్టీఫెన్ మిల్లర్ అనే వ్యక్తిని తీసుకున్నాడు. ఇతడిని ‘‘డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ పాలసీ’’ కోసం నియమించాడు. మిల్లర్ నియామకాన్ని వైస్ ప్రెసిడెంట్‌గా గెలిచిన జేడీ వాన్స్ సోమవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ‘‘అధ్యక్షుడి మరో అద్బుతమైన ఎంపిక’’ అంటూ ప్రశంసించారు. అయితే, స్టీఫెన్ మిల్లర్ ఎంపిక రాబోయే కాలంలో భారతీయ టెక్కీలకు, H-1B వీసా కోరేవారికి ఇబ్బంది కలిగించవచ్చు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీని గట్టిగా సమర్థించే వ్యక్తుల్లో మిల్లర్ ఒకరు. మిల్లర్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడి అయిన సమయంలో అతడి పాలనలో సీనియర్ సలహాదారుగా, స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇతను ‘ముస్లిం ప్రయాణ నిషేధం’, 2018లో ఫ్యామిలీ సపరేషన్ పాలసీ సహా ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్‌కి కీలక సలహాలు ఇచ్చాడు.
భారత్ జోరు.. రఫ్పాడించిన మహిళా ఆటగాళ్లు
మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. గురువారం బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. భారత్ తరఫున దీపికా కుమారి 5 గోల్స్ చేసింది. దీంతో.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. దక్షిణ కొరియాతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ దీపిక రాణించింది. ఆ మ్యాచ్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. భారత్ తరఫున లాల్‌రెమ్సియామి దేవి, ప్రీతి దూబే, మనీషా చౌహాన్ చెరో 2 గోల్స్ చేశారు. ఈ టోర్నీలో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. చైనా కూడా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. నవంబర్ 14న జరిగిన మూడో మ్యాచ్‌లో చైనా 2–1తో జపాన్‌ను ఓడించింది. భారత్‌తో పోలిస్తే చైనా గోల్ తేడా చాలా ఎక్కువగా ఉంది. నవంబర్ 12 వరకు చైనా గోల్ తేడా 20 కాగా, ఇప్పుడు 21కి పెరిగింది. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో చైనా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగడానికి ఇదే కారణం.
నిజమైన దేశభక్తుడు ఏజెంట్ రాబిన్‌హుడ్.. అంచనాలు పెంచేలా టీజర్
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈరోజు అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైంది, ఇది ఇంటెన్స్ నెరేటివ్ కి టోన్‌ని సెట్ చేస్తుంది. నితిన్ హై-ఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకుని, అడ్వెంచరస్ దోపిడీలను చేసే మోడరన్ రాబిన్‌హుడ్‌గా పరిచయం అయ్యారు. అతనికి ప్రత్యేకమైన ఎజెండా లేదా నిర్దిష్ట కారణం ఏమీ లేదు, అతని ఏకైక మోటివేషన్ డబ్బు. ఇలాంటి సిట్యువేషన్స్ లో అతను పవర్ ఫుల్ కుటుంబ నేపథ్యం ఉన్న శ్రీలీలని ఇష్టపడతాడు. ఇది ఇప్పటికే డేంజర్ లో వున్న అతని లైఫ్ ని మరింత కాంప్లికేట్ చేస్తుంది. వెంకీ కుడుముల ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌లో నెరేటివ్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
భారీగా నష్ట పోయాం.. టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు
సాధారణంగా నిర్మాతలు తమ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోరు కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాత్రం అందుకు భిన్నం. ఆయన పలు ఇంటర్వ్యూలలో తన గత సినిమాల గురించి ఎన్నో సార్లు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి హార్ట్ టాపిక్ అయ్యారు. నిజానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక నిర్మాణ సంస్థను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంస్థలు నడుపుతున్న టీజీ విశ్వప్రసాద్ ప్రారంభించారు. తెలుగులో 100 సినిమాలు నిర్మించడమే తమ ధ్యేయంగా రంగంలోకి దిగిన ఈ సంస్థ ఒక ఫ్యాక్టరీ మోడల్ లో రన్ అవుతుంది. గతంలో ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి కొన్ని పర్వాలేదు అనిపించుకున్నాయి. కానీ 2024 లో మాత్రం ఈ సంస్థ నుంచి అన్ని సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, శర్వానంద్ మనమే అలాగే మరో నిర్మాతతో కలిసి చేసిన విశ్వం సినిమాలు ఇబ్బంది పెట్టాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన టీజీ విశ్వప్రసాద్ 2024 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి ఒక బ్యాడ్ ఇయర్ అని అభివర్ణించారు. దాదాపుగా ఈ సినిమాల వల్ల 100 కోట్ల వరకు నష్టపోయినట్లు ఆయన ఒప్పుకున్నారు. ప్రస్తుతానికి కొత్త ప్రాజెక్టులు ఏవి లాంచ్ చేయడం లేదని వచ్చే ఏడాది కం బ్యాక్ ఇస్తామని చెప్పుకొచ్చారు. నిజానికి ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ టన్నులు కొద్ది ఉన్న విశ్వప్రసాద్ తాము ఖచ్చితంగా కం బ్యాక్ ఇస్తామని అంటున్నారు. ప్రస్తుతానికి విశ్వప్రసాద్ నిర్మాతగా ప్రభాస్ రాజా సాబ్, అడవి శేషు గూడచారి 2, తేజ సజ్జా మిరాయ్ సినిమాలతో పాటు సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ చిత్రాలు వచ్చే ఏడాది వరుసగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.