గుడ్‌న్యూస్.. గన్నవరం నుంచి కువైట్‌కు నేరుగా విమానం
ఆంధ్రప్రదేశ్‌లోని విదేశీ ప్రయాణికులు.. అన్ని ప్రాంతాలకు నేరుగా వెళ్లేందుకు విమాన సౌకర్యం లేదు.. వాళ్లు హైదరాబాద్ లేదా మరో సిటీకో వెళ్లి విదేశీయానం చేయాల్సి ఉంటుంది.. అయితే, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి క్రమంగా అంతర్జాతీయ విమానాలు ప్రారంభం అవుతున్నాయి.. ఇవాళ్టి నుంచి కువైట్ విమాన సర్వీసులు పునర్‌ప్రారంభం కాబోతున్నాయి. నేటి నుండి గన్నవరం-కువైట్ విమాన సర్వీసు ప్రారంభం కానుంది.. విజయవాడ నుండి నేరుగా కువైట్ కు విమాన సర్వీసు నేటి నుండి అందుబాటులోకి తీసుకువస్తుంది ఎయిరిండియా.. ప్రతి బుధవారం గన్నవరం నుండి కువైట్‌కు విమానం బయల్దేరనుంది.. నేటి నుండి అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ సర్వీసును కొనసాగించనున్నారు.. వందేభారత్ మిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకోవటంతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు అత్యంత ఆదరణ ఉన్న దేశాలకు విజయవాడ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తుంది.. విజయవాడ నుంచి షార్జాకు ఇటీవలే తొలి అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం అయ్యింది.. దీంతో షార్జాకు రెండు సర్వీసులు వెళ్తున్నాయి.. ఇక ఇప్పుడు విజయవాడ నుంచి కువైట్‌కు రెగ్యులర్ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది. ఈ విమానం తిరుచిరాపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు రానుండగా.. ఇక్కడి నుంచి నేరుగా కువైట్ వెళ్తుంది.. 180 సీటింగ్ కెపాసిటీతో ఈ విమానం నడనుంది.. ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్ చేరుకోనుంది.. ఇక, కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోనుంది ఎయిరిండియా విమానం. దీంతో.. కువైట్ నుంచి ఏపీకి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకూ ఆఫర్ వచ్చింది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు కాక రేపాయి.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా సంచలనంగా మారుతున్నాయి.. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి 23 ఓట్లతో గెలవడం.. ఆ తర్వాత వైసీపీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయడం హాట్ టాపిక్ అయ్యింది.. ఇక, నాకు ఆఫర్ వచ్చిందంటే.. నాకు కూడా వచ్చిందంటూ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్లు ఇప్పుడు చర్చగా మారాయి.. మొన్నటికి మొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక నాకు రూ.10 కోట్ల ఆఫర్ వచ్చిందనే వ్యాఖ్యానిస్తే.. ఇప్పుడు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ నాకూ ఆఫర్ వచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నాకూ ఆఫర్ వచ్చిందన్నారు ఎమ్మెల్యే ఆర్థర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందన్న ఆయన.. నా కుమారునికి ఫోన్ చేశారు.. మా నాన్న ఒప్పుకోడని నా కుమారుడు తోసిపుచ్చారని తెలిపారు.. పోలింగ్ ముందు రోజు అర్ధరాత్రి తాడేపల్లిలో మా ఇంటివద్ద పర్సనల్ గా మాట్లాడాలని గన్‌మెన్ ను సంప్రదించారని ఆరోపించారు ఆర్థర్.. గన్ మెన్ ఫోన్లో మాట్లాడిస్తే కర్నూలు త్రీ టౌన్ సీఐ వద్ద పని ఉందని, పర్సనల్‌గా మాట్లాడాలన్నారు.. ఈ టైంలో ఎందుకు ఉదయమే రమ్మన్నానని తెలిపారు. పోలింగ్ కు ముందు మరీ ఫోన్ చేశారు.. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడానని.. పర్సనల్ గా మాట్లాడాలనంటే.. మీ ఆటలన్నీ తెలుసు అని వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే, రూ.200 కోట్లు ఓవైపు.. వైఎస్ జగన్ ఫొటో ఒకవైపు పెడితే.. తాను జగన్ ఫోటోనే తీసుకుంటాఅని చెప్పానని పేర్కొన్నారు నందికొట్కూరు ఎమ్మె్ల్యే ఆర్థర్.
నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
తెలుగుదేశం పార్టీ 41 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలంగాణలో పార్టీని బలపరిచే లక్ష్యంతో పార్టీ 41వ ఆవిర్భావ సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభ విజయవంతం కావడంతో పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. తాజాగా ఇవాళ హైదరాబాద్‌లో సభ పెడుతున్నారు. తెలంగాణలోనూ పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. నేటి సభకు తెలంగాణతో పాటు ఏపీకి చెందిన ముఖ్య నేతలు కూడా వస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టాక పార్టీలో కొంత జోష్ పెరిగింది. ఆయన ఆధ్వర్యంలో వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. సభకు చంద్రబాబు కూడా హాజరు కావడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. అయితే, బీఆర్ఎస్ , బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండాలని భావిస్తోంది. ఇవాళ హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ జరగనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో టీడీపీకి ముందు నుంచి బలం ఉంది. గతంలో టీడీపీ మహానాడు హైదరాబాద్ లోనే నిర్వహించారు. ఇప్పుడు సభతో హైదరాబాద్ లో టీడీపీ పట్టును నిరూపించుకోవాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది.
నేడు కర్ణాటకలో మోగనున్న ఎన్నికల నగారా!
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీకు మే వరకు గడువు ఉంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రధాన పార్టీలు తమ ప్రచార హోరును పెంచాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు తమదైన వ్యూహాలు ప్రతివ్యూహాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాల్లో, అధికార బీజేపీ కనీసం 150 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. ఈ సారి కాంగ్రెస్ పార్టీ కాస్త దూకుడు ప్రదర్శిస్తోంది. షెడ్యూల్ రాకముందే త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 124 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించింది.కాంగ్రెస్, జేడీ(ఎస్) వరుసగా 124, 93 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించాయి. వరుణ నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కనకాపూర్ నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో 124 మంది అభ్యర్థుల్లో దాదాపు సగం మంది అభ్యర్థులు లింగాయత్‌లు, వొక్కలిగలు అనే రెండు ఆధిపత్య వర్గాల నుంచి వచ్చారు. ఈ రెండు ఆధిపత్య వర్గాలతో పాటు, దళితులు, గిరిజనులు ప్రకటించిన జాబితాలో రెండంకెల వాటాలను పొందారు. ప్రస్తుత అసెంబ్లీ నుండి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది ఇంకా కాంగ్రెస్‌లో ఉన్నారు. మిగిలిన వారికి కాంగ్రెస్ పార్టీ వసతి కల్పించింది. ఇందులో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఈ వైద్యుడికి 550 మంది సంతానం..! కోర్టుకెక్కిన మహిళ
ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు.. మహా అయితే ముగ్గురు చాలు అనే తరహాలో సంతానం ఉండేలా చూసుకుంటున్నారు.. కొందరు ప్రత్యేక పరిస్థితుల్లో కొడుకు కోసం ఎదురుచూస్తూ.. ఎక్కువ మంది ఆడపిల్లలను కన్నవారు కూడా లేకపోలేదు.. ఇక, గతంలో కొన్ని కుటుంబాల్లో 10 మందికి పైగా పిల్లలను కన్నవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ వైద్యుడు ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడట.. ఏంటి..? వైద్యుడు ఏంటి? 550 మందికి తండ్రి కావడం ఏంటి..? అనుమానం వెంటనే రావొచ్చు.. అయితే, అతడు 550 మందికి తండ్రి అయ్యింది వీర్యదానం చేయడం ద్వారా..! ఇదే అతడికి ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది.. ఎందుకంటే.. ఓ మహిళ ఆ వైద్యుడిపై కోర్టుకెక్కింది.. దీంతో.. ఈ వ్యవహారం చర్చగా మారింది..నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ది హేగ్ నగరంలో జొనథన్ ఎం అనే వైద్యుడు నివాసం ఉంటున్నాడు.. ఆయన వయస్సు 41 ఏళ్లు.. ఇప్పటి వరకు నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడట.. అలా ఇప్పటికే 550 మంది చిన్నారులకు తండ్రి అయ్యాడు.. అక్కడే పెద్ద చిక్కు వచ్చిపడింది.. ఎందుకంటే రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాల్సి ఉంటుంది.. కానీ, జొనథన్ వీర్యదానం చేసి వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని 2017లోనే తేలింది.. దీంతో అలెర్ట్ అయ్యింది ఆ దేశ యంత్రాంగం. ఆ వైద్యుడిని ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్వీఓజీ) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర
బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన బంగారం ధర 10 గ్రాములకు రూ.210 మేర తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 మేర దిగివచ్చింది. ప్రస్తుతం హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 మేర తగ్గడంతో రూ.54, 500కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.240 తగ్గుదలతో రూ.59, 450గా నమోదైంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. రూ.59,450 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54, 650గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.59, 600 కి పడిపోయింది. మరోవైపు ఇవాళ వెండి ధర కూడా తగ్గింది. వెండి ధర రూ.300 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75,700 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్
తమ కెరీర్‌కి మెరుగులు దిద్దిన ఇండస్ట్రీ గురించి కొందరు భామలు తక్కువ చేసి మాట్లాడుతుంటారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి చెక్కేసిన కథానాయికల్లో కొంతమంది తెలుగు చిత్ర పరిశ్రమని హేళన చేసిన సంగతి తెలిసిందే! గ్లామర్ షో తప్ప ఏమీ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రియాంకా చోప్రా కూడా అలాంటి వారి జాబితాలోకి చేరింది. హాలీవుడ్‌కి తన మకాం మార్చిన ఈ భామ.. తనకు అవకాశాలు ఇచ్చి, స్టార్డమ్ సాధించిపెట్టిన బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్లో తనకొచ్చిన ఆఫర్ల పట్ల సంతోషంగా లేనని, అక్కడ రాజకీయాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ బాంబ్ పేల్చింది. తాను అభద్రతాభావానికి గురవ్వడం వల్లే.. బాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని కుండబద్దలు కొట్టింది. ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ.. ‘‘బాలీవుడ్లో నన్ను ఒక మూలన పడేశారు. నాకు కొందరితో విభేదాలు ఏర్పడటం వల్ల.. అవకాశాలు రాకుండా చేశారు. ఆ ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఆ పాలిటిక్స్ చేయడం తెలీదు. ఆ రాజకీయాలతో నేను విసిగెత్తిపోయి, బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలోనే తాను ఒక మ్యూజిక్ వీడియో చేయగా, దాన్ని అంజులా ఆచార్యా (ప్రస్తుతం ప్రియాంకా మేనేజర్) చూసి తనని సంప్రదించిందని తెలిపింది. యూఎస్‌లో మ్యూజిక్ కెరీర్ ప్రారంభిస్తావా? అని ఆఫర్ చేయడంతో, వెంటనే ఒప్పుకున్నానంది. అదే తన కెరీర్‌కి మెరుగులు దిద్దిందని, సరికొత్త ప్రపంచానికి (హాలీవుడ్)కి పరిచయం చేసిందని పేర్కొంది. ఇక అప్పుడే తాను అమెరికాకు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నానని క్లారిటీ ఇచ్చింది. తన మ్యూజిక్ కెరీర్ వల్లే ‘క్వాంటికో’లో నటించే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
దాని కోసం ఏం చేయడానికైనా రెడీ.. హనీ రోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘వీరసింహారెడ్డి’ సినిమా రిలీజైనప్పటి నుంచి హనీ రోజ్ పేరు మార్మోగిపోతోందని చెప్పుకోవడంలో సందేహమే లేదు. సినిమా ఆఫర్ల సంగతేమో కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రైవేట్ బ్రాండ్స్ అయితే ఆమె వెనకాలే క్యూ కట్టేశాయని చెప్పుకోవచ్చు. ఏరికోరి మరీ ఆమెను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. రీసెంట్‌గానే ఆమె హైదరాబాద్‌లో ఒక రెస్టారెంట్‌ని ఓపెన్ చేసింది కూడా! నిజానికి.. హనీ రోజ్ 15 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ‘ఆలయం’ మూవీతో ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మడు, ఆ తర్వాత ‘ఈ వర్షం సాక్షిగా’ అనే మరో సినిమా కూడా చేసింది. కానీ, అవి ఆమెకు తగిన గుర్తింపును తీసుకురాలేకపోయాయి. కానీ, ఇన్నేళ్ల తర్వాత చేసిన వీరసింహారెడ్డి మాత్రం ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక అప్పటి నుంచి ఆమె ఏం చేసినా, ఏం చెప్పినా సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడు తాజాగా ఆమె పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. సాధారణంగా కథానాయికలు ఒక వయసుకి వచ్చాక.. పెళ్లి గురించి వార్తలు చర్చలు మొదలవుతాయి. హనీ రోజ్కి మూడు పదుల వయసు దాటడంతో.. ఆమెకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు తరచుగా ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలోనూ పెళ్లి ప్రస్తావన రావడంతో.. ఆమె ఇంట్రెస్టింగ్ జవాబు ఇచ్చింది. పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత అని, ఆ బాధ్యతని స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అంటే.. తాను పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉన్నానని పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసిందన్నమాట! అంతేకాదు.. వివాహబంధం బలంగా ఉండటం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేసింది. అంటే.. సినిమాలు మానెయ్యడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే నిజమైతే.. హనీ రోజ్ అభిమానులు ఏమవుతారో ఏమో? అయితే.. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలి? అతనిపై తన అంచనాలు ఏంటి? అనే విషయాల్ని మాత్రం హనీ రోజ్ పంచుకోలేదు. అలాగే.. పెళ్లికి రెడీగానే ఉన్నానని చెప్పింది కానీ, ఎప్పుడు చేసుకుంటానన్నది కూడా రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పడేసింది.