ఆ వ్యాఖ్యలపై స్పందించిన రాపాక.. ఆసక్తికర కామెంట్లు..
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నన్ను ప్రలోభ పెట్టిందని.. రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఓవైపు.. గతంలో తాను సర్పంచ్‌గా దొంగ ఓట్లుతో గెలిచానని.. చింతలమోరి గ్రామంలో నా ఇంటి వద్ద పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు పడేవని.. నా అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇది తీవ్ర వివాదంగా మారింది.. అయితే, ఆ వీడియోపై మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక.. ఎప్పుడో 32 ఏళ్ల క్రితం జరిగిన సందర్భాన్ని ఆత్మీయ సమ్మేళనంలో ప్రస్తావిస్తే, దానిని ఇప్పుడు జరిగి నట్లు ప్రచారం చేయడం తగదని హితవుపలికారు. అయితే, సదరు వ్యాఖ్యలు అందరూ నవ్వుకునేందుకు చెప్పిన మాటలేనని, సీరియస్ గా చెప్పినవి కావు అంటున్నారు ఎమ్మేల్యే రాపాక.. రాజోలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే జనసైనికులు ఆందోళన చేయడం ఎందుకని ప్రశ్నించారు. జనసేన నన్ను ఏమైనా ఓటు వేయమని అడిగారా ? అని నిలదీశారు. 2019లో 810 ఓట్ల స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించా, అంతకుముందు తొలిసారి 2009లో కాంగ్రెస్ తరఫున 4,600 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక, బొంగు రాజేశ్వరరావు చేతకాని దద్దమ్మ అంటూ ఫైర్ అయ్యారు.. రాష్ట్రం అంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీచి.. 151 సీట్లు గెలిస్తే.. సత్తా లేక బొంతు.. రాజోలులో ఓడిపోయాడని మండిపడ్డారు.. మరోవైపు.. ఇప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నన్ను ప్రలోభ పెట్టినట్లు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. గత ఎన్నికల్లో నాకు ఓటు వేసింది జనసైనికులే, ఎస్సీలు వైసీపీకి వేశారని స్పష్టం చేశారు. అయితే, నేను వైసీపీలోకి వచ్చానని బొంతు వర్గం ఆత్మీయ సమావేశం పెట్టి ఆహ్వానించారని వివరణ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.
అమరావతి రాజధాని కేసు.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ
అమరావతి రాజధాని కేసుపై ఉత్కంఠ నెలకొంది.. దానికి కారణం.. నేడు సుప్రీకోర్టులో అమరావతి రాజధాని కేసుపై విచారణ జరగనుంది.. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మరోవైపు.. హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అమరావతి రైతులు.. అయితే, ఈ రెండు పిటిషన్లను న్యాయమూర్తి కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.. ఇక, అమరావతి రాజధాని చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల గురించి తమకు తెలియని పేర్కొంది.. మరోవైపు.. విమర్శలు ఎదురైనా మూడు రాజధానులపై ముందుకు కదులోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. త్వరలోనే వైజాగ్ కు మకాం మార్చుతానని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో నేటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జీ–20 సదస్సుకు విశాఖ ముస్తాబు.. నేటి నుంచి ఆంక్షలు..
సాగర తీరం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు సిద్ధమైంది.. విశాఖ వేదికగా నేటి నుంచి నాలుగు రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి.. ఇక, ఈ సదస్సు ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. విశాఖ సిటీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.. ఈనెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను (జీఐఎస్) ఘనంగా నిర్వహిం అందరి దృష్టి ఆకర్షించిన ఏపీ సర్కార్.. ఇక, నేటి నుంచి జీ–20 దేశాల రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ (ఐడబ్ల్యూజీ) సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది.. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే థీమ్‌తో నేటి నుంచి నాలుగు రోజుల పాటు.. అంటే ఈ నెల 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు.. రాడిసన్ బ్లూ హోటల్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు జీ–20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.. ఇప్పటికే ప్రతినిధుల విశాఖకు చేరుకున్నారు.. ఇక, సదస్సు నేపథ్యంలో.. ఓవైపు విశాఖను ముస్తాబు చేసిన అధికారులు.. మరోవైపు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.. జీ–20 సదస్సుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆదివారం వైఎంసీఏ నుంచి ఆర్కే బీచ్ వరకు వైజాగ్ కార్నివాల్, ఆర్కే బీచ్ నుంచి 3కే, 5కే, 10 మారథాన్, పారా మోటార్ ఎయిర్ సఫారీ కూడా నిర్వహించారు. జీ–20 సదస్సు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. సుమారు 2,500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే, జీ–20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి.. నాలుగు రోజుల పాటు జరగనున్న జీ 20 సదస్సు తొలిరోజు పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అందు కోసం ఈ రోజు సాయంత్రం 5.15 గంటలకు విశాఖ చేరుకోనున్న సీఎం.. జీ20 దేశాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.. ఇక, విదేశీప్రతినిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు సీఎం.. జీ20 వేదికపై నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న వనరులు, అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించే అవకాశం ఉంది.. మరోవైపు సదస్సు నేపథ్యంలో విశాఖలో ఆంక్షలు విధించారు పోలీసులు.. బీచ్ రోడ్డుతో పాటు G 20 ప్రతినిధులు ప్రయాణించే మార్గాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి… కైలాసగిరి, ముడసర్లోవ సహా వివిధ పార్కులు, టూరిజం కేంద్రాల్లో సందర్శకులకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు..
నేడే ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్.. తెలుగు రాష్ట్రాల అంశాలపై చర్చ
నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభంకానుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 32 మంది సభ్యులు హాజరుకానున్నారు. తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలు.. 1. అకాల వర్షాలు, పంట నష్టం – కష్టాల్లో రైతాంగం, 2. రాష్ట్రంలో నెరవేరని ప్రభుత్వ హామీలు, 3. ఇంటింటికీ తెలుగుదేశం, సభ్యత్వ నమోదు కార్యక్రమాల సమీక్ష, 4. పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, సాధికార సారధులు పై చర్చించనున్నారు, ఇక తెలంగాణ కు సంబంధించిన సుమారు 13 అంశాలు కురిసిన అకాల వర్షాలకు, వడగండ్ల వానలతో రైతులు నష్టపోవడం, పరిహారం, హామీలు అమలులో అనే పలు విషయాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత విజయోత్సాహంతో ఉన్న పార్టీ వర్గాల్లో మరింత ఉత్సాహం నింపటం సహా ఏపీ తెలంగాణలో రాజకీయ అంశాలతో పాటు ఉమ్మడిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణ, పార్టీ 42వ ఆరిర్భావ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది మే నెలలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ముగియున్న నేపథ్యంలో ఉత్సవాలను మరింత వైభవంగా ఎన్టీఆర్ కీర్తిని చాటేలా నిర్వహించేందుకు కార్యాచరణను చంద్రబాబు దిశానిర్దేశంచనున్నట్లు సమాచారం. ట్రస్ట్ భవన్‌లో జరగనున్న ఈపొలిట్ బ్యూరో సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనుంది. పార్టీని ప్రజలకు మరింత చేరువచేస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె.. బీజేపీలో కీలక పదవిలో నియామకం
మాజీ విదేశాంగ మంత్రి, దివంగత భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమెను ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా నియమించారు. స్వరాజ్ సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని నిర్వహిస్తారు. పార్టీ పూర్తిస్థాయి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా చేసిన తొలి నియామకం ఇది. పార్టీకి సేవ చేసేందుకు ఇదో అవకాశం అని, ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్వరాజ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాకు ధన్యవాదాలు తెలుపుతూ బన్సూరి తన నియామకాన్ని ప్రకటించిన లేఖను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, ఆక్స్‌ఫర్డ్ గ్రాడ్యుయేట్ అయిన బాన్సురి 15 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. గతంలోనూ ఆమె అనధికారికంగా బీజేపీ న్యాయవ్యవహారాల్లో సాయమించారు. ఆమెకు సంస్థాగత పదవిని ఇవ్వడం ఇదే మొదటిసారి. ఢిల్లీ రాజకీయాల్లో ఆమె పాత్ర కీలకంగా ఉంటుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 24న బన్సూరికి పంపిన అపాయింట్‌మెంట్ లెటర్‌లో తక్షణమే ఆమెను నియమిస్తున్నట్లు పేర్కొంది. బిజెపి ఢిల్లీ యూనిట్‌లోని వారు బన్సూరి నియామకాన్ని ప్రశంసించారు. పార్టీ కార్యక్రమాలలో ఆమె తరచుగా పాల్గొంటున్నారు. విశిష్ట మహిళా సాధకులకు ఈ ఏడాది సుష్మా స్వరాజ్ అవార్డులను బీజేపీ మహిళా విభాగం ప్రారంభించింది.
చైనాకు తిరిగొచ్చిన జాక్ మా.. స్కూల్ క్యాంపస్ లో ప్రత్యక్షం
ఆసియా కుబేరుడు, అలీబాబా సంస్థల వ్యవస్థాపకుడు జాక్‌మా స్వదేశం చైనాకు తిరిగి వచ్చాడు. సోమవారం ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వ ఆగ్రహానికి గురైన దేశాన్ని వీడిన జాక్ మా.. దాదాపు ఏడాదిన్నర తర్వాత చైనాలో అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పిల్లలకు విద్యను ఎలా అందించాలనే దాని గురించి ఉపాధ్యాయులతో మాట్లాడటానికి అలీబాబా ప్రధాన కార్యాలయం ఉన్న హాంగ్‌జౌలోని యుంగు పాఠశాలను సందర్శించారు. జాక్ మా యుంగు స్కూల్‌కి వచ్చి క్యాంపస్ డైరెక్టర్‌లతో విద్యా భవిష్యత్తు గురించి చర్చించారు. కొత్త సాంకేతిక మార్పు తెచ్చే సవాళ్లు, అవకాశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా చైనాకు దూరంగా ఉన్న జాక్ మా.. స్పెయిన్, జపాన్, థాయ్‌లాండ్‌లలో కనిపించారు. చాలా రోజుల తర్వాత చైనాలో బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. 2020లో ప్రభుత్వ విధానాలను విమర్శించింనందుకు జాక్‌మా చిక్కుల్లో పడ్డారు. చాలా రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేసిందుకుగాను చైనా దర్యాప్తు సంస్థలు జాక్‌మాను ఉక్కిరిబిక్కిరి చేశాయి. జాక్ మా ఆర్థిక బలాన్ని విపరీతంగా దెబ్బకొట్టాయి. ఆ తర్వాత జాక్.. కొన్ని రోజుల వరకు ఎవరికీ కనిపించకుండా పోయారు. బీజింగ్ దేశీయ రంగంపై నిబంధనలను కఠినతరం చేసింది. జాక్ మా స్థాపించిన ఆలీబాబా సంస్థ 2021లో $2.6 బిలియన్ల యాంటీట్రస్ట్ జరిమానాతో దెబ్బతింది. ఫిన్‌టెక్ సంస్థపై నియంత్రణను జాక్ మా నెమ్మదిగా వదులుకుంటూ వచ్చారు.
చరణ్ కి దూరంగా బన్నీ… విష్ లేదు, విజిట్ లేదు…
చెప్పను బ్రదర్’ అని అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఒక మాట ఎంత దుమారం లేపిందో, ప్రశాంతంగా ఐకమత్యంగా ఉండే మెగా అభిమానుల్లో ఎంత కల్లోలం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫాన్స్ అంటే చిరు ఫాన్స్, చరణ్ ఫాన్స్, సాయి ధరమ్ తేజ్ ఫాన్స్, పవన్ కళ్యాణ్ ఫాన్స్, వరుణ్ తేజ్ ఫాన్స్ కానీ అల్లు అర్జున్ ఫాన్స్ కాదు అనే స్థాయికి వెళ్లిందీ గొడవ. దీన్ని సారి చెయ్యడానికి, అందరం కలిసే ఉన్నాం అని చెప్పడానికి, చూపించడానికి మెగా హీరోలు అప్పుడప్పుడూ కలిసి కనిపిస్తూ ఉంటారు. దీంతో ఫాన్స్ మళ్లీ మా హీరోలంతా ఒకటే అనుకుంటూ ఉంటారు. అభిమానులు అలా అనుకునే లోపే కాదు కాదు అల్లు అర్జున్ వేరు మెగా హీరోలు వేరు అనిపించేలా ఒక సంఘటన జరుగుతుంది. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నార్త్ సెలబ్రిటీల వరకూ చాలా మంది చరణ్ ని విష్ చేశారు. అల్లు అర్జున్ మాత్రం విష్ చెయ్యలేదు, పర్సనల్ గ ఫోన్ చేసి విష్ చేసాడో లేదో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం పోస్ట్ చెయ్యలేదు. నైట్ వరకూ వెయిట్ చేసిన ఫాన్స్, అల్లు అర్జున్ నుంచి ట్వీట్ రాకపోవడంతో మరోసారి మెగా ఫ్యామిలీ వేరు అల్లు అర్జున్ వేరు అనే కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ట్వీట్ చెయ్యకపోవడం ట్విట్టర్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఫాన్స్ అందరికీ ఇదే విషయంపై చర్చ జరుగుతుంది. చరణ్ ఇంట్లో నిన్న నైట్ వరకూ బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీకి ఇండస్ట్రీ వర్గాలందరూ వచ్చారు కానీ అల్లు అర్జున్ మాత్రం రాలేదు. దీంతో రాత్రి నుంచి మెగా ఫాన్స్ అల్లు అర్జున్ పై మరింత నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మెగా అల్లు హీరోల మధ్య గ్యాప్ ఎప్పుడు సెటిల్ అవుతుందో చూడాలి.