రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధించిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఇక, జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్, మార్జిన్లకు నిబంధనలు వర్తింపజేయనున్నారు.. ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖ. కాగా, ఈ మధ్య టీడీపీ అధినేత నిర్వహించిన రెండు సభల్లో దురదృష్టకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.. కందుకూరులో ఎనిమిది మంది మృతి చెందగా.. తాజాగా గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే.
శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు..
కొలిచినవారి కొంగుబంగారం, కలియుగ ప్రత్యక్షదైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వీవీఐపీలు, వీఐపీలు, ప్రముఖులు, భక్తులు పోటెత్తారు.. హుండీ ద్వారా శ్రీవారికి పెద్ద సంఖ్యలో కానుకలు సమర్పించుకున్నారు. దీంతో.. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనంత హుండీ ఆదాయం సమకూరింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించారు. దీంతో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో భక్తులు హుండీలలో స్వామివారికి సమర్పించిన కానుకలను లెక్కించగా ఏకంగా రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది.. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి కావడంతో.. శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డులు సృష్టించింది.. అయితే, ఇప్పటి వరకు గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన లభించిన రూ.6.31 కోట్ల హుండీ ఆదాయమే అత్యధికంగా ఉండగా.. ఆ రికార్డులు ఇప్పుడు బ్రేక్ అయిపోయాయి.
తండ్రి పాడెమోసి, తలకొరివి పెట్టిన కూతుళ్లు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో తండ్రి పాడె మోసి అంత్యక్రియలు నిర్వహించారు కూతుళ్లు.. పల్లంకుర్రు శివారు చింతల చెరువు గ్రామానికి చెందిన సాపే అప్పారావు, మేరీరత్నం దంపతులకు మగమిల్లలు లేరు.. వారికి దైరుగురు కుమార్తెలు.. అయినా, వారిని మంచి చదువులు చదివించి, అందరికీ వివాహాలు జరిపించారు.. అయితే, అప్పారావు ఆదివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశాడు.. కొన్ని ప్రాంతాల్లో హిందూ సంప్రదాయం ప్రకారం శ్మశానవాటికలకు ఆడవారు వెళ్లరాదు.. మరికొన్ని ప్రాంతాల్లో అక్కడి వరకు వెళ్లినా అంత్యక్రియలు నిర్వహించరాదు.. కానీ, అప్పారావు కుమార్తెలు.. అన్నీ తామే నిర్వహించారు.. పెద్ద కుమార్తె స్వర్ణలత తలకొరివి పెట్టారు.. ఇక, దాదాపు 4 కిలోమీటర్ల మేర సాగిన అంతిమయాత్రలో.. అప్పారావు పాడెను కొద్దిసేపు మోశారు ఆయన కూతుళ్లు.. అన్ని తామేయై అమ్మాయిలు అంత్యక్రియలు నిర్వహిస్తుంటే.. బంధువులు, గ్రామస్తులు.. ఆ ఘటన చూసి చలించిపోయారు..
ఆదిశంకరాచార్యులు క్రూరమైన కుల వ్యవస్థను సమర్థించారు.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆదిశంకరాచార్యపై కేరళ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందూ వైదిక తత్వవేత్త ఆదిశంకరాచార్య క్రూరమైన కుల వ్యవస్థకు చెందిన న్యాయవాది, ప్రతినిధి అంటూ కేరళ మంత్రి, కమ్యూనిస్ట్ నాయకుడు ఎంబీ రాజేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శంకరాచార్య, నారాయణ గురుదేవుల మధ్య సమాంతరాన్ని మంత్రి వివరించారు. నారాయణ గురుదేవులు శంకరాచార్యను విమర్శించారని.. నారాయణ గురుదేవులే కేరళలో ‘ఆచార్య’ అని అన్నారు. వర్కాల శివగిరి మఠంలో జరిగిన కార్యక్రమంలో రాజేష్ మాట్లాడుతూ.. కేరళకు ఆచార్యులుంటే అది శ్రీనారాయణ గురువే తప్ప ఆదిశంకరాచార్యులు కాదని, శంకరాచార్యులు మనుస్మృతిపై ఆధారపడిన క్రూరమైన కులవ్యవస్థను సమర్థించారన్నారు. శ్రీనారాయణ గురువే మనుస్మృతిని పారద్రోలేందుకు కృషి చేశారని అన్నారు. శంకరాచార్య కుల వ్యవస్థను సమర్ధించడమే కాకుండా దానికి ప్రతినిధిగా కూడా ఉన్నారని ఆయన అన్నారు. కుల వ్యవస్థను సమర్ధించిన శంకరాచార్యపై శ్రీనారాయణ గురు విమర్శలు చేశారని రాజేష్ అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుపోవడానికి శంకరాచార్యులే కారణమని మంత్రి అన్నారు.
3వేల కిలోమీటర్లు పూర్తి.. నేడు యూపీలో పునఃప్రారంభం
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ తొమ్మిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో నేడు పునఃప్రారంభం కానుంది. 110 రోజులకు పైగా సాగిన యాత్రలో ఇప్పటివరకు 3వేల కిలోమీటర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ఇది జమ్మూ కాశ్మీర్‌లో ముగుస్తుంది. భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు చేయని.. కాలినడకన సాగిన సుదీర్ఘ పాదయాత్ర ఇదేనని కాంగ్రెస్ పేర్కొంది. జనవరి 26న శ్రీనగర్‌లో ముగిసే యాత్ర తర్వాత, యాత్ర సందేశాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారాన్ని ప్రారంభించనుంది.కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి దేశవ్యాప్తంగా ‘హాత్ సే హాత్ జోడో’ ప్రచారానికి నాయకత్వం వహించే బాధ్యతను సోదరి, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించారు.
జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి కన్నుమూత.. ప్రధాని సంతాపం
పాండిత్య ప్రసంగాలు, శక్తివంతమైన వక్తృత్వానికి పేరుగాంచిన కర్ణాటకలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్దేశ్వర స్వామి సోమవారం కన్నుమూశారు. 81 ఏళ్ల పీఠాధిపతి గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం ఆశ్రమంలో తుది శ్వాస విడిచారని విజయపుర డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేష్ ప్రకటించారు. జ్ఞానయోగాశ్రమ ప్రాంగణానికి పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు తరలివచ్చి నివాళులర్పించారు. స్వామికి కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలలో కూడా భక్తులు, అనుచరులు ఉన్నారు. కర్నాటక ప్రభుత్వం సిద్దేశ్వర స్వామికి ప్రభుత్వ లాంఛనంగా అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. సిద్దేశ్వర స్వామికి నివాళులు అర్పించేందుకు విజయపుర జిల్లా యంత్రాంగం మంగళవారం పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ముఖ్యనేతలు సిద్దేశ్వర స్వామి మృతిపట్ల సంతాపం తెలిపారు. సిద్దేశ్వర స్వామి సమాజానికి చేసిన విశిష్ట సేవలు గుర్తుండిపోతాయని.. ఇతరుల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పని చేశారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రధాని మోడీ ఫోన్‌లో స్వామి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
మాస్ మొగుడు రావట్లేదు… ట్రైలర్ వస్తోంది…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’ నుంచి ‘మాస్ మొగుడు’ సాంగ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకి రిలీజ్ అవుతుందని, మాస్ జాతర చెయ్యాలని నందమూరి ఫాన్స్ రెడీగా ఉన్నారు. ఈలోపు ‘వీర సింహా రెడ్డి’ ప్రొడ్యూసర్స్ అయిన మైత్రీ మూవీ మేకర్స్ బాలయ్య ఫాన్స్ కి షాక్ ఇస్తూ… ఈరోజు మాస్ మొగుడు సాంగ్ రావట్లేదు, త్వరలో సాంగ్ రిలీజ్ చేస్తాం అంటూ ట్వీట్ చేశారు. సొంగ్ డిలే అవ్వడంతో మాస్ జాతర చెయ్యాలి అనుకున్న నందమూరి ఫాన్స్ అప్సెట్ అయ్యారు. సాంగ్ రావట్లేదని అప్సెట్ అయిన ఫాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తూ ట్రైలర్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. ‘వీర సింహా రెడ్డి’ ట్రైలర్ మరియు, లాంచ్ ఈవెంట్ డీటైల్స్ అతి త్వరలో అనౌన్స్ చేస్తాం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ చేసిన ట్వీట్ బాలయ్య ఫాన్స్ ని జోష్ లోకి తెచ్చింది. ఈ ట్రైలర్ అనౌన్స్మెంట్ తో సాంగ్ డిలే అవ్వడం అనే వార్తని కొంతమంది పట్టించుకోలేదు, మరికొంతమంది మాత్రం ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా సాంగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వాయిదా వేస్తారు ఏంటి అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు.