ఎస్వీ వర్సిటీలో చిరుతల కలకలం..
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.. వర్సిటీలోని వీసీ బంగ్లాలోకి వచ్చి పెంపుడు కుక్కను చంపి ఎళ్తుకెళ్లింది చిరుత.. వీసీ బంగ్లా సమీపంలో రెండు చిరుతలు సంచరించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు.. దీంతో, అధికారులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఒంటరిగా బయటకు రావద్దని విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, చిరుతల సంచారంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు యూనివర్సిటీ అధికారులు.. వర్సిటీలో త్వరలో బోన్లు ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు..
వైసీపీ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది.. ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. కామవరపుకోట మండలం ఆడమిల్లి సమీపంలో ఎమ్మెల్యే ఎలీజా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది.. అయితే, ప్రమాద సమయంలో వెంటనే బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు.. పెను ప్రమాదం తప్పడంలో.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే ఎలీజా అభిమానులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు..
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో యాత్రికులకు చుక్కలు..
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు చుక్కులు చూపించారు కొందరు యువకులు.. రిజర్వేషన్ బోగీలోకి పెద్ద ఎత్తున యువకులు చొరబడ్డారు.. దీంతో, సంఘమిత్ర ఎక్స్ ప్రెస్‌లో గత రాత్రి నరకం అనుభవించారు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యాత్రికులు.. రిజర్వేషన్ బోగీలోకి పెద్ద ఎత్తున యువకులు రావడంతో.. నానా ఇబ్బందులు పడ్డారు దాదాపు 130కు పైగా యాత్రికులు.. అయితే, తూర్పుగోదావరి నుంచి కాశీ యాత్రకు వెళ్లారు భక్తులు.. కాశీ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.. కాశీ నుంచి తిరుగు ప్రయాణంలో సంఘమిత్ర రైలులో ఎక్కారు.. ముందుగా రిజర్వేషన్ చేసుకుని.. ఆ ప్రకారమే బోగీల్లోకి ఎక్కారు.. కానీ, ట్రైన్‌లోని రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లోకి పెద్ద ఎత్తున చొరబడ్డారు యువకులు.. కాలు కదిపే ఆస్కారం కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టారని యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు.. కనీసం బాత్‌రూమ్‌కి వెళ్లాలన్నా నానా తిప్పలు పడాల్సి వచ్చిందని మహిళా ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.. రిజర్వేషన్ బోగీల్లోకి ఎందుకు ఎక్కారని నిలదీస్తే.. కొందరు యువకులు తమని బెదిరించారని తూ.గో జిల్లా వాసులు చెబుతున్నారు.. ఇక, రిజర్వేషన్ బోగిలో జొరబడ్డ యువకుల్లో కొందరు మద్యం మత్తులో ఉండడంతో బిక్కు బిక్కు మంటూ గడిపామని అంటున్నారు.
విమానాన్ని కుదిపేసిన బలమైన గాలులు
అప్పటివరకూ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇంకాసేపట్లో విమానం ల్యాండ్ అవ్వబోతోందని తెలిసి, ప్రయాణికులందరూ గమ్యస్థానంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, ఇంతలోనే చోటు చేసుకున్న అనూహ్య పరిణామంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. విమానాశ్రయంలో దిగడానికి కొద్దిసేపటి ముందు.. బలమైన గాలులు ఆ విమానాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ దెబ్బకు లోపలున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో 36 మంది గాయపడగా, వారిలో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. విమానం పైకప్పు క్రాక్స్ వచ్చాయంటే.. ఏ రేంజ్‌లో గాలులు ఆ విమానాన్ని కుదిపేశాయో అర్థం చేసుకోవచ్చు. హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం.. ఫీనిక్స్ నుంచి హొనొలులుకు బయలుదేరింది. ఇందులో 10 మంది క్రూ మెంబర్స్, 278 మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. సీటుబెల్టులు సరిగ్గా ధరించని వారు.. ఈదులు గాలులు వీచినప్పుడు ఒక్కసారిగా పైకి ఎగిరారు. విమానం పైకప్పును ఢీకొట్టుకొని, కింద పడ్డారు. మరికొందరు అటూఇటు ఊగిపోయారు. కిటికీలను, ముందున్న సీట్లను ఢీకొట్టారు. విమానం ఎత్తు రెండుసార్లు అకస్మాత్తుగా తగ్గిపోయిందని, అప్పుడు కొందరు ప్యాసింజర్లు సీట్ల నుంచి గాల్లో ఎగిరినట్టు అయ్యిందని పలువురు ప్రయాణికులు చెప్పారు. ఈ విమానం కుదుపులకు గురవ్వడంతో.. అత్యవసర ల్యాండింగ్‌కి అనుమతి ఇచ్చారు. ల్యాండ్ అయిన వెంటనే, హొనొలులు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ రంగంలోకి దిగి, గాయపడిన వారికి చికిత్స అందించింది. తీవ్ర గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఎమర్జెన్సీ రూమ్స్‌కి తరలించారు.
చైనా ఆటలు సాగవు..
సరిహద్దుల వద్ద చైనా పన్నే పన్నాగాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగనివ్వబోమని, ఆ దేశాన్ని సరిహద్దు దాటనివ్వమని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట సరిహద్దుల్ని మార్చాలని చైనా ప్రయత్నిస్తే.. భారత సైన్యం చూస్తూ ఊరుకోదని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత సంఖ్యలో బలగాలను సరిహద్దు వెంట మోహరించామని చెప్పిన ఆయన.. ప్రధాని మోడీ ఆదేశాలతోనే సైన్యం అక్కడుందని, రాహుల్ గాంధీ చెబితే కాదని చురకలంటించారు. ఇదే సమయంలో.. ఎల్‌ఏసీ వెంట భారత భూభాగాల్ని డ్రాగన్ కంట్రీ ఆక్రమించిందన్న ఆరోపణల్ని తోసిపుచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా-జపాన్ కాంక్లేవ్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు సమస్యపై రాజకీయం చేయడం ఏమాత్రం తగదని.. పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకురావడం కోసం చైనాపై ఒత్తిడి తెస్తున్నామని, ఆరోపణలు వస్తున్నట్టు ఏమాత్రం నిర్లక్ష్యం వహించడంలేదని జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సైన్యాన్ని విమర్శించకూడదని హితవు పలికారు. సరిహద్దులో మన జవాన్లు తీవ్ర ప్రతికూలతల మధ్య పహారా కాస్తున్నారని.. తవాంగ్‌లో వారు చూపిన సాహసానికి గాను ప్రశంసించడంతో పాటు సూచించారు. అలాగే.. చైనా సైనికుల చేతుల్లో మన జవాన్లు దెబ్బలు తిన్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టారు. మన జవాన్లకు ‘పిటై’ అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారంటూ ప్రశ్నించారు. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని.. రాజకీయంగా విభేదాలు, విమర్శలు వచ్చినా తమకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు.
ఒకేసారి ‘వారసుడు’, ‘వారిసు’ రిలీజ్
దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు’, తమిళ్ లో ‘వారిసు’ పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ మంచి జోష్ లో చేస్తోంది. సాంగ్స్, పోస్టర్స్ తో దళపతి విజయ్ ఫాన్స్ ని ఎంగేజ్ చేస్తూనే ఉంది. ఇప్పటికే ‘వారిసు’ నుంచి రెండు పాటలు బయటకి వచ్చి యుట్యూబ్ ని షేక్ చేశాయి. ముఖ్యంగా ‘థీ దళపతి’ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘రంజితమే’ సాంగ్ అయితే తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్బ్ వ్యూస్ రాబడుతోంది. ఇప్పుడు వారిసు ఆల్బం నుంచి మూడో సాంగ్ బయటకి వస్తోంది. ‘సోల్ ఆఫ్ వారిసు’ అంటూ బయటకి రానున్న ఈ మూడో సాంగ్ ని తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాయగా, తమిళ వర్షన్ ని వివేక్ రాశారు. తెలుగు తమిళ భాషల్లో సింగర్ ‘చిత్ర’ ఈ సోల్ ఆఫ్ వారిసు సాంగ్ ని పాడింది. మదర్ అండ్ సన్ ఎమోషన్ తో ఈ సాంగ్ బయటకి రానుందని సమాచారం. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ‘సోల్ ఆఫ్ వారిసు’ సాంగ్ రిలీజ్ కానుంది. ‘వారిసు’ నుంచి తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానున్న మొదటి పాట ఇదే కావడం విశేషం. ఇప్పటివరకూ ముందు తమిళ పాటని విడుదల చేసిన తర్వాత తెలుగు పాటని విడుదల చేశారు. ఇప్పుడు రెండు భాషల్లో ఒకేసారి సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇకపై వచ్చే ప్రతి అప్డేట్ ని ఇలానే రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే, తెలుగులో కూడా ‘వారిసు’ సినిమాపై హైప్ పెరుగుతుంది లేదంటే ఈ సినిమాని ఒక డబ్బింగ్ సినిమాగా చూసే ప్రమాదం ఉంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో కూడా ‘వారిసు’ సినిమాని రిలీజ్ చేస్తానని చెప్పిన దిల్ రాజు, ఇప్పటివరకూ నార్త్ లో ప్రమోషన్స్ ని మొదలుపెట్టలేదు. ‘వారిసు’ రిలీజ్ కి ఎక్కువ సమయం లేదు కాబట్టి చిత్ర యూనిట్, హిందీ ప్రమోషన్స్ పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంది.
వీర సింహారెడ్డి నుంచి మూడో పాట వచ్చేస్తోంది..
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి జోష్ లో చేస్తున్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య, తమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా ‘జై బాలయ్య’ సాంగ్ నందమూరి అభిమానులని సాటిస్ఫై చేసింది. తాజాగా వీర సింహా రెడ్డి సినిమా నుంచి మూడో పాట కూడా రిలీజ్ కానుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున వీర సింహా రెడ్డి సినిమాలోని మూడో పాట బయటకి రాబోతుంది అంటూ నందమూరి మోక్షజ్ఞ ట్వీట్ చేశాడు. మాస్ నంబర్ లోడింగ్ అంటూ మోక్షజ్ఞ ట్వీట్ చేయగా, ఈ సాంగ్ ని తమన్ కుమ్మేసాడు అంటూ గోపీచంద్ మలినేని కామెంట్ చేశాడు. ప్రొడక్షన్ హౌజ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా థర్డ్ సింగల్ లోడింగ్ అంటూ పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసిన ఈ మాస్ ఐటెం సాంగ్, వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ కి మంచి కిక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్, వీర సింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న సినిమా కాబట్టి బాలయ్య అడ్డా లాంటి అనంతపూర్ లాంటి ప్రాంతంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తే నందమూరి ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చినట్లు ఉంటుంది. మరి మైత్రి మూవీ మేకర్స్ ఆ సైడ్ ఆలోచిస్తారేమో చూడాలి. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.