వేసవి సెలవుల్లో భక్తులకు టీటీడీ బంపరాఫర్
తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తూనే ఉంటారు.. అనునిత్యం 60 వేల నుంచి 70 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూనే ఉంటారు.. ఇక, ప్రత్యేక రోజులు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.. మరోవైపు వేసవి సెలవుల్లో అయితే తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, వేసవి సెలవుల సందర్భంగా శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది.. శ్రీవారి వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే.. నేరుగా స్వామివారి దర్శనం కలిపిస్తున్నారు.. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో.. సామాన్య భక్తులకు దర్శనాలు సులువుగా జరిగిపోతున్నాయి.. మొత్తంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.. నిన్న శ్రీవారిని 83,380 మంది భక్తులు దర్శించుకున్నారు.. ఇక, 27936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.3.35 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.. మరోవైపు.. రేపటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది టీటీడీ.. ఈ నేపథ్యంలో మూడు రోజులు పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించిన విషయం విదితమే..
ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు.. సీఎంకు కేశినేని నాని లేఖ
విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని.. సిట్టింగ్‌ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న విశాఖలో భూ కేటాయింపుల విషయంలో తన సోదరుడు కేశినేని చిన్నిపై ఆరోపణలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు.. ఏపీలో కాక రేపుతోన్న లిక్కర్ కేసులోనూ తమ్ముడిపై ఆరోపణలు చేస్తున్నారు.. దీనిపై సీఎం నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేశారు కేశినేని నాని.. ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వ్యక్తులతో, ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు అతని సన్నిహిత సహాయకుడు దిలీప్ పైలాతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కి సంబంధం ఉన్న తీవ్రమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్న కేశినేని నాని.. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు మరియు ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు, ఎంపీ కేశినేని శివనాథ్ మరియు అతని భార్య జానకీ లక్ష్మీ కేసినేనితో కలిసి Pryde Infracon LLPలో నియమిత భాగస్వామిగా ఉన్నారు. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్, ప్లాట్ నెం. 9, సర్వే నెం. 403లో నమోదు అయ్యిందని పేర్కొన్నారు.. కేసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న Eshanvi Infra Projects Pvt. Ltd. కూడా ఇదే చిరునామాను కలిగి ఉంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, Pryde Infracon LLP మరియు Eshanvi Infra Projects Pvt. Ltd. రెండూ ఒకే అధికారిక ఈమెయిల్ ఐడీని ఉపయోగిస్తున్నాయి అని దుయ్యబట్టారు.. ఇది రెండు సంస్థల మధ్య సామీప్యత మాత్రమే కాకుండా, ఉద్దేశపూర్వక కార్యాచరణ సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తుందన్నారు..
ముంబై హీరోయిన్ కేసు.. కాంతిరాణా టాటా, విశాల్ గున్నీకి సీఐడీ నోటీసులు..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది సీఐడీ.. నేడు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.. దీంతో, ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఈ రోజు సీఐడీ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే జెత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసిన విషయం విదితమే.. మరోవైపు, ఈ కేసులో పాత్రధారులుగా ఉన్న కాంతిరాణా, విశాల్ గున్నీలను విచారణ చేయాలని సీఐడీ నిర్ణయానికి వచ్చింది.. అందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది.. కాగా, ముంబై నటి జెత్వానీ కేసు విషానికి వస్తే.. నటి కాదంబరి జెత్వానీని కృష్ణాజిల్లా మాజీ జడ్పీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు తనయుడు విద్యాసాగర్ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. దీనిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు నమోదు చేయడం.. అరెస్ట్‌ల వరకు వెళ్లింది.. అంతేకాదు.. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం సంచలనం సృష్టించింది.. ఈ కేసులో, కొంతమంది పోలీసు అధికారులు మరియు రాజకీయ నాయకులు.. నటి కాదంబరి జెత్వానీ మరియు ఆమె కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టారని.. వారిని వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి..
నేడు తెలంగాణకు నితిన్ గడ్కరీ..
కేంద్రమంత్రి నితిన్ గడ్కరి నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన 5,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా కొమురం భీం జిల్లాకు వెళ్లనున్నారు. జాతీయరహదారి 363 ని జాతికి అంకితం చేయనున్నారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంబోత్సవాలు,శంఖుస్థాపనలు చేయనున్నారు. కార్యక్రమాల్లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి,బండిసంజయ్, రాష్ట్రమంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా ఇంచార్జీ మంత్రి సీతక్క పాల్గోననున్నారు.
గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ.. ఎమ్మెల్యేకు మహిళ ఫోన్.. చివరకు
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఓ మహిళ కాల్ చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ ఎమ్మెల్యేకు ఓ కన్సల్టెన్సీ మహిళ ఫోన్ చేసింది. నువ్వు ఎవ్వరికి ఫోన్ చేశావో తెలుసా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. మహిళ తీరుపై సదరు ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై సుమోటోగా కేసు నమోదు చేశారు జగిత్యాల పోలీసులు. కన్సల్టెన్సీ మహిళ దుబాయ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో మంచి ఆఫర్స్ ఉన్నాయంటూ పలువురికి ఫోన్ కాల్స్ చేసినట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ఎలాంటి లైసెన్స్ లేకుండానే విదేశీ బ్రోకరేజీ కన్సల్టెన్సీగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆఫీస్ సీజ్ చేసి, లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై కేసు నమోదు చేశారు జగిత్యాల టౌన్ పోలీసులు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి కాల్పులు.. బుద్ధి చెప్పిన ఇండియన్ ఆర్మీ
జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో దాయాది దేశం కవ్వింపు చర్యలకు దిగుతుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. 11 రోజులుగా ఎల్ఓసీ వెంబడి పాక్ ఆర్మీ దాడులకు పాల్పడుతుంది. నిన్న (మే 4న) రాత్రి జమ్ము కాశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంధార్, నౌషేరా, సుందర్‌బాని మరియు అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. దీంతో అలర్టైనా భారత ఆర్మీ.. పాక్ కాల్పులను తిప్పికొట్టింది. ఇక, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లోని బైసారన్ లోయలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పుల జరిపారు.. ఈ ఘటనలో సుమారు 26 మంది చనిపోయారు.. అనేక మంది గాయపడ్డారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత దాయాది దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొది. పాక్ పై భారత్ అనేక ఆంక్షలు విధించింది. ఇక, భారతదేశం- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు సమావేశం కానుంది.
విదేశీ సినిమాలపై ట్రంప్ సుంకాల మోత.. ఏకంగా 100 శాతం పన్ను
అధికారం చేపట్టిన నాటి నుంచి డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలతో సంచలనంగా మారాడు. సుంకాల మోతతో వాణిజ్య రంగంతో పాటు ఇతర రంగాలు కుదేలై పోయాయి. అక్రమ వలసలను అరికట్టేందుకు కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై ట్రంప్ దృష్టిసారించారు. విదేశీ సినిమాలపై ట్రంప్ సుంకాల మోత మోగించారు. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) ను అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు ప్రకటించారు. అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలు విదేశీ సినిమాలకు లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితిని ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. అమెరికన్ చిత్ర పరిశ్రమ వేగంగా నాశనం అవుతూందన్నారు. దేశీయ చిత్ర నిర్మాణంలోకి తిరిగి రావాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కి చెబుతూ, “అమెరికాలో మళ్ళీ సినిమాలు తీయాలని మేము కోరుకుంటున్నాము” అని అన్నారు. కొత్త సుంకాలు అమెరికన్ గడ్డపై స్టూడియోలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రోత్సహించడానికి తోడ్పడతాయని అన్నారు.
ఢిల్లీతో హైదరాబాద్ ఢీ.. ఓడితే ప్లే ఆఫ్స్ ఆశలు ఖతం..
గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 18వ సీజన్‌లో మాత్రం తమ ప్రస్థానం తుది దశకు చేరుకుంది. ఈ సీజన్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. నేటి మ్యాచ్ ఫలితంతో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఈరోజు ( మే 5న) ఉప్పల్ స్టేడియంలో జరిగే పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ని హైదరాబాద్ ఢీ కొట్టబోతుంది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ ఖాతాలో 3 విజయాలతో కేవలం 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 మ్యాచ్ లు గెలిస్తే 14 పాయింట్లకు చేరుకుంటుంది. దీంతో ‘ప్లే ఆఫ్స్’కు చేరుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అయితే, ఇతర జట్ల రన్ రేట్ ను బట్టి ప్లేఆఫ్స్ ఆశలు పెట్టుకోవచ్చు ఎస్ఆర్హెచ్. కానీ, నేటి మ్యాచ్‌లో ఓడితే మాత్రం అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి హైదరాబాద్ జట్టు నిష్క్రమిస్తుంది. మరోవైపు ఢిల్లీ కూడా తమ ప్రయాణం తడబడుతుది. తొలి 4 మ్యాచ్‌లు వరుసగా గెలిచి ఘనంగా ప్రారంభించిన.. ఆ తర్వాతి 6 మ్యాచ్‌లలో 4 ఓడిపోయింది. కానీ, డీసీ పరిస్థితి ఇంకా చేయి దాటిపోలేదు కాబట్టి ఈ మ్యాచ్‌లో నెగ్గితే ఢిల్లీ మరింత మెరుగైన స్థితికి చేరుకోనుంది.
హిట్ 3 ఓవర్సీస్.. మరొక మైల్ స్టోన్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా హిట్ 3. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే డే కానుకగా 1వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. టీజర్, ట్రైలర్ తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన హిట్ – 3 తోలి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకుంది.హిట్ 3 మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 43 కోట్లు రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా హిట్ 3 దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో 450K డాలర్స్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా హిట్ టాక్ రావడంతో దూసుకెళ్ళింది. అడ్వాన్స్ మరియు డే 1 కలిపి హిట్ 3 నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అలాగే నేచురల్ స్టార్ నాని హీరోయిన్ శ్రీనిధి శెట్టి నార్త్ అమెరికాలో ప్రమోషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. ఆడియెన్స్ కలిసి అక్కడి థియేటర్స్ లో సినిమా చూస్తూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ బాగా కలిసొచ్చాయని చెప్పాలి. శని, ఆదివారం కలిపి భారీ కలెక్షన్స్ రాబట్టింది హిట్ 3. దీంతో నార్త్ అమెరికాలో 2 మిలియన్ మార్క్ అందుకుంది. అందుకు సంబందించి అఫీషియల్ పోస్టర్ కూడా రెడీ చేసారు మేకర్స్. మొత్తానికి హిట్ 3 యూఎస్ మార్కెట్ లో విధ్వంసం చేస్తూ 3 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. మరి లాంగ్ రన్ లో ఎంత మాత్రం రాబడుతుందో చూడాలి.
వరుసగా 7 ఫ్లాప్ లు పాపం ఇప్పుడు పూజ పరిస్థితి ఏంటీ..
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. వరుసగా స్టార్ హీరోలతో జతకట్టి మంచి మార్కెట్ ఏర్పర్చుకుంది. కానీ వరుస అవకాశాలతో పాటుగా వరుస డిజాస్టర్స్ కూడా తలెత్తడంతో ఈ అమ్మడు గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. దీంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస సినిమాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక ప్రస్తుతం చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడు వరుస చిత్రాలు ఒప్పుకుంది పూజ . ఇందులో తాజాగా ‘రెట్రో’ మూవీ రిలీజ్ అయ్యింది. కానీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. లుక్ మార్చి ఇందులో పూజ డి గ్లామరస్ గా కనిపించినప్పటికి చివరికి నిరాశే మిగిలింది. విడుదల తర్వాత సినిమాపై వచ్చిన రివ్యూలు, కలెక్షన్లు చూస్తే పూజకి గట్టి దెబ్బ తగిలింది అనిపిస్తుంది. ఇక ‘రెట్రో’ తో కలిపి వరుసగా ఏడవ ఫ్లాప్‌ను మూటగట్టుకుని పూజా హెగ్డే . ‘రాధేశ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’, ‘దేవా’ వంటి భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచి పూజా ఇమేజ్‌ను డ్యామేజ్ చేశాయి. పాపం ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్‌గా నిలిచిన పూజా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. పూజా కెరీర్ మళ్లీ ఊపందుకోవాలంటే, కథలో బలమున్న సినిమాలు, టాలెంట్ రివీల్ చేసే పాత్రలు చేస్తే కానీ లాభం లేదు.. ఇక ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. అలాగే విజయ్‌తో చేస్తున్న ‘జన నాయకన్’ మూవీతో అయినా హిట్ కొడుతుందో లేదో చూడాలి.