తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం..
తిరుమలలో లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై నేడు మూడు బృందాలుగా ఏర్పాడి సిట్ విచారణ చేయనుంది. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, అడినల్ ఎస్పీ వెంకటరావుల నేతృత్వంలో మూడు బృందాలుగా దర్యాప్తు చేయనున్నాయి. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణనలోకి ఎంక్వైరీ చేయనున్న సిట్. టీటీడీ బోర్డ్ దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాల లోతుగా దర్యాప్తు చేయనున్నారు. అలాగే, తొలుత టీటీడీ ఈఓ శ్యామలరావును కలిసి నెయ్యి కల్తీ వ్యవహారంపై పూర్తి వివరాలను సిట్ అధికారులు తెలుసుకోనున్నారు. ఇక, కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధను తమిళనాడులోని దుండిగల్ వెళ్లి ఓ బృందం దర్యాప్తు చేయనుంది. అలాగే, మరో బృందం తిరుమల వెళ్లి లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకలను పరిశీలించడంతో పాటు లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీ వైష్ణవులను ప్రశ్నించనుంది. ఇంకో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డైయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలన చేయనుంది.
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో పులి సంచారంతో శ్రీవారి భక్తుల్లో ఆందోళన మొదలైంది. కాగా, తిరుమల శ్రీవారి మెట్టు దగ్గర ఉన్న కంట్రోల్ రూమ్ వద్దకు రాత్రివేళ చిరుత రావడంతో కుక్కలు దాని వెంట పడ్డాయి. అయితే, చిరుత సంచారంపై భక్తులు చెప్పగానే సెక్యూరిటీ గార్డు భయంతో కంట్రోల్ రూమ్ లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారని పేర్కొన్నారు. సెక్యూరిటీ గార్డు సైతం ఉదయం టీటీడీ అధికారులకు, అటవీ అధికారులకు చిరుత సమచారంపై అందించారు. ఇక, శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి నడక మార్గం, ఘాట్ రోడ్డుల్లో చిరుత పులి సంచారంతో భక్తులు, టీటీడీని కలవర పెడుతోంది. ముఖ్యంగా నడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్ట పక్కల చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నట్లు టీటీడీ, అటవీ శాఖ అధికారులు గుర్తించారు. నడక మార్గంలో తిరుమలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడుతున్నారు. గతంలో చిరుతల సంచారంతో టీటీడీ అధికారులు మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్న పిల్లలను నడక మార్గంలో అనుమతించేలా తగిన చర్యలు చేపట్టారు. ఏడో మైలురాయి నుంచి గాలిగోపురం వరకూ హై అలెర్ట్ జోన్‌గా ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు పలు జాగ్రత్తలు చెప్పుకొచ్చింది.
గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్.. ప్రారంభించిన దామోదర రాజనరసింహ
నేడు హైదరాబాద్ గచ్చిబౌలిలో పింక్ పవర్ రన్-2024 కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. 15 నిమిషాల అనంతరం 5k రన్ ను ప్రారంభించగా.. మరో 15 నిమిషాల తరువాత 3k రన్ ను మంత్రి ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు సుధ రెడ్డి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ నిర్వహిస్తున్నారు. 10k రన్ పూర్తయ్యాక స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. మారథాన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వారికి మెడల్స్ ను అందించనున్నారు. రన్నర్స్ ఒక్కొక్కరుగా చేరుకుని గచ్చిబౌలి స్టేడియం నుండి విప్రో సెంటర్ వరకు రన్నింగ్ కొనసాగనుంది. ఒకే సారి 3km, 5km, 10km సంయుక్తంగా నిర్వాహకులు నిర్వహించనున్నారు. సుమారు 5 వెలకు పైగా రన్నర్స్ పాల్గొన్నారు. ఈ.. పింక్ కలర్ దుస్తులతో ముస్తాబైన వీరు అందరూ కలిసి గచ్చిబౌలి స్టేడియంలో పక్షి రూపంలో మానవహారంగా ఏర్పడనున్నారు. ఈ విధంగా పక్షిరూపంలో ఏర్పడి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేరేందుకు ప్రయత్నించనున్నారు. అయితే.. ఈ పింక్ మారథాన్‌లో పాల్గొనే ఔత్సాహికులకు ప్రత్యేక న్యూట్రిషన్ కిట్ల ను అందించనున్నారు. అంతేకాకుండా.. రేసుకు తర్వాత చేయాల్సిన వ్యాయామ చిట్కాలను తెలియజేయనున్నారు.
టీజీఎస్ ఆర్టీసీ కొత్తరూల్.. మెట్రో డీలక్స్ బస్సుల్లో స్టాఫ్ నాట్ అలోడ్
త్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించరాదని టీజీఎస్ ఆర్టీసీ ఆదేశించింది. సిబ్బందికి అనుమతి లేదు’ అని స్టిక్కర్లు అంటించారు. మహిళలు, జర్నలిస్టులు, స్కూల్ పిల్లలు, ఎస్కార్ట్ పోలీసులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఎయిడ్స్, డయాలసిస్ రోగులు, పోలీసు అమరవీరుల భార్యలు, ఎస్కార్ట్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఆర్టీసీ యాజమాన్యం చాలా మందికి 50 శాతం రాయితీలు కల్పిస్తోంది. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం’ అని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ సర్వీసుల్లో ఆర్టీసీ సిబ్బందికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని ఆర్టీసీ పున:పరిశీలించి ఆర్టీసీ సిబ్బందిని కూడా ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వాలని సూచించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో బస్సుల రద్దీ పెరిగింది. టిక్కెట్లు కొని ప్రయాణించే వారికి సీటు కూడా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పటికే హైదరాబాద్‌లో కొత్త బస్సులను నడుపుతోంది. అందులో 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు వీటికి అదనంగా మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రత్యేకంగా మరో 125 డీలక్స్ బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులు జూలై నుంచి ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ డీలక్స్ బస్సులు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో తిరుగుతున్నాయి.
ఉపమముఖ్యమంత్రిగా నేడే ఉదయనిధి ప్రమాణస్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం ముఖ్యమైన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. రాజ్ భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఉదయనిధి ప్రమాణస్వీకార కార్యక్రమం నేడు (ఆదివారం) జరగనుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో మరో ముఖ్యమైన అంశం సెంథిల్ బాలాజీ తిరిగి మంత్రివర్గంలోకి రావడం. బాలాజీకి గతంలో విద్యుత్, ఎక్సైజ్ శాఖలు ఇచ్చారు. మనీలాండరింగ్ ఆరోపణల కారణంగా బాలాజీని కొంతకాలం పాటు మంత్రివర్గం నుంచి తప్పించారు. అయితే ఇప్పుడు మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గత వారం, ఉదయనిధి స్టాలిన్ తాను ఉప ముఖ్యమంత్రి అవుతాడనే ఊహాగానాలను తోసిపుచ్చారు. అలాంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి మాత్రమే తీసుకుంటారని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి ఎవరనే దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని, నా పేరుతో మీడియా తొందరపడవద్దని అన్నారు. అయితే, ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్‌ను నియమిస్తున్నట్లు త్వరలో ప్రకటించవచ్చని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసన్ కొద్ది రోజుల క్రితం సూచించారు. ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తారని, వారం నుంచి 10 రోజుల్లో ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తుందని అప్పుడు ఆయన చెప్పారు.
‘ఫ్యాబ్ 4’గా బౌలర్లు.. భారత్ నుంచి ఇద్దరు!
ప్రస్తుత తరంలో అత్యుత్తమ టెస్టు క్రికెటర్లను ‘ఫ్యాబ్ 4’గా ఎంచుకుంటారన్నా విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్స్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ ట్యాగ్ కేవలం బ్యాటర్లకేనా?.. బౌలర్లకు వర్తించదా? అనే అనుమానం చాలామంది అభిమానుల్లో ఉంది. తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేస్ విభాగంలో తన ఫ్యాబ్ 4ని ఎంచుకుని.. ఆ లోటును భర్తీ చేశాడు. దీంతో బౌలింగ్ విభాగంలో ఫ్యాబ్ 4 గురించి మరింత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఫ్యాబ్ 4లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కగిసో రబాడ,హేజిల్ వుడ్‌లను జహీర్ ఖాన్ ఎంపిక చేశాడు. జహీర్ ఫ్యాబ్ 4లో ఇద్దరు భారత బౌలర్లు ఉండడం విశేషం. పాట్ కమిన్స్‌ను కూడా పోటీదారుగా పేర్కొన్నాడు. ‘గత కొన్నేళ్లుగా టెస్టుల్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు వెళ్లింది. ఏ పరిస్థితులలో అయినా భారత్ నిలకడగా రాణిస్తోంది. అందుకే తప్పకుండా నా ఫ్యాబ్ 4లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీని ఎంపిక చేస్తా. వీరి తర్వాత కగిసో రబాడ, జోష్ హేజిల్‌వుడ్ ఉంటారు. పాట్ కమిన్స్ కూడా ఫ్యాబ్ 4లో పోటీదారు. వీరందరూ టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నారు’ అని జహీర్ చెప్పాడు. ఇక నుంచి ఇతర దేశాల మాజీ క్రికెటర్లు సైతం అత్యుత్తమ బౌలర్లను ఎంపిక చేసే అవకాశముంది.
భారీ వరదలు.. 112 మంది మృతి.. కొట్టుకుపోయిన వందలాది మంది!
నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు, అలాగే కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 60 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో వందలాది మంది గల్లంతయ్యారు. గురువారం నుంచి నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విపత్తు అధికారులు ఆకస్మిక వరదల హెచ్చరికలు జారీ చేశారు. నేపాల్ పోలీసు డిప్యూటీ అధికార ప్రతినిధి బిశ్వ అధికారి ప్రకారం, వర్షం కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఖాట్మండు లోయ ఒకటి. ఇక్కడ ఒక్కటే ఏకంగా 34 మంది మరణించారు. ఇది కాకుండా, చాలా మంది తప్పిపోయారు. వందల కొద్దీ గాయపడ్డారు. ఖాట్మండు వ్యాలీలో 16 మంది అదృశ్యం కాగా, దేశవ్యాప్తంగా తప్పిపోయిన వారి సంఖ్య 100కి పైగా చేరుకుంది. ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ప్రజలను రక్షించినట్లు నేపాల్ పోలీసు డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ బిశ్వా అధికారి తెలిపారు. ఇది కాకుండా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో, దేశవ్యాప్తంగా 63 చోట్ల ప్రధాన రహదారులు బ్లాక్ చేయబడ్డాయి. ఇది రవాణా వ్యవస్థను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది.
సత్యం సుందరం సినిమాకు ఓటీటీ పార్టనర్ ఫిక్స్
స్టార్ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో ’96’ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల కోసం శనివారం (సెప్టెంబర్ 28) థియేటర్లలో విడుదలైంది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండేటి, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయింది. టాలెంటెడ్ నటులు కార్తీ, అరవింద స్వామి అద్భుతమైన నటన తమిళ్ తో పాటుగా తెలుగు ఆడియెన్స్ మనసులు దోచుకుంది. మరి బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో ఆకట్టుకోగా ఈ సినిమా ఓటిటి పార్టనర్ సంబంధించి స్పష్టత వచ్చేసింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ తర్వాత అయితే ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాను చూడవచ్చు. తెలుగు సహా తమిళ్ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ వారే స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ చిత్రానికి గోవింద వసంత బ్యూటిఫుల్ మ్యూజిక్ అందించగా తెలుగులో రీసెంట్ గా “35 చిన్న కథ కాదు” లాంటి అందమైన చిత్రాన్ని అందించిన నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ సురేష్ ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా కూడా రిలీజ్ అయింది.